destruction!
-
మిస్సైల్ విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. శత్రుదేశాల ఖండాంతర క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తుత్తునియలు చేయగల కొత్తరకం క్షిపణి ఎండో–అట్మాస్ఫెరిక్ ఇంటర్‌సెప్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని యుద్ధ నౌక నుంచి శనివారం డీఆర్డీవో (రక్షణ పరిశోధన పరిశోధన సంస్థ), నావికా దళం ఈ పరీక్ష నిర్వహించాయి. శత్రు దేశాల క్షిపణిని మధ్యలోనే అడ్డుకుని, ధ్వంసం చేయగలిగే సరికొత్త బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను సొంతం చేసుకున్న దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలో పాలుపంచుకున్న డీఆర్డీవో, నేవీ, రక్షణ పరిశ్రమల ప్రతినిధులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. -
ఘోర విపత్తు.. దారణంగా టర్కీ పరిస్థితి.. శాటిలైట్ ఫోటోలు వైరల్
టర్కీ, సిరియాలో ఇటీవల సంభవించిన వరుస భూకంపాలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. ప్రకృతి విలయానికి ఇరు దేశాలూ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఎటుచూసినా కూలిన భవన శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే దర్శనమిస్తున్నాయి. ఘోర మృత్యుకంపం ధాటికి ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేలమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద భారీగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15,383 వేలకు చేరింది. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఒక్క తుర్కియేలోనే దాదాపు 12,391 మంది ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 2,992 మంది మరణించినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. తుర్కియే, సిరియా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆప్తుల ఆక్రందనలు, మిన్నింటిన రోదనా దృశ్యాలతో భయానంకంగా తయారయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలన్నింటినీ తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. అయితే ఎత్తయిన వేలాది భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాలను తొలగించడం తలకుమించిన పనిగా మారింది. చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత? శాటిలైట్ దృశ్యాలు విడుదల రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా విలవిల్లాడుతున్నాయి. తాజాగా భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన శాటిలైట్ విడుదల చేసిన దృశ్యాలు ఉపద్రవం సృష్టించిన వినాశనం కళ్లకు అద్దం పట్టిన్నట్లు చూపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన అత్యవసర ఆశ్రయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ భూకంపం కారణంగా ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాలన్నీ నేలమట్టమైన దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. టర్కీలోని దక్షిణ నగరాలైన అంటాక్యా, కహ్రమన్మరాస్, గాజియాంటెప్ భూకంపానికి గురైన అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ కుప్పకూలిన భవనాలు, గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ 25వేల మందికి పైగా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. 2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితం భారీ భూకంపం కారణంగా దాదాపు 2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ప్రభావిత ప్రాంతాల్లో 77 జాతీయ, 13 అంతర్జాతీయ అత్యవసర వైద్య బృందాలను మోహరించినట్లు పేర్కొంది. భారత్ సైతం, టర్కీ, సిరియాకు సహాయ సామాగ్రిని అందించింది. -
మంచి మాట: శత్రుత్వంతో శత్రుత్వం పెట్టుకుందాం
ఏ ఒకవ్యక్తిని మాత్రమో... ఏ కొంతమందిని మాత్రమో కాదు, కుటుంబాలకు కుటుంబాలను, ఊళ్లకు ఊళ్లను, రాష్ట్రాలకు రాష్ట్రాలను, దేశాలకు దేశాలను, మొత్తం ప్రపంచాన్ని వేధించేది శత్రుత్వం. ప్రతిమనిషికీ, ప్రపంచానికీ శత్రుత్వం తీరని గాయాల్ని కలిగిస్తూనే ఉంది. జీవితాలకు జీవితాలే శత్రుత్వానికి కాలి బూడిద అయిపోయాయి. శత్రుత్వం అగ్ని అయి అందరికీ అంటుకుంది, అంటుకుంటోంది... ఉన్నంతవరకూ నిప్పు కాలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా శత్రుత్వం మనిషి కడతేరిపోయేంతవరకూ రగులుతూనే ఉంటుంది. అంతేకాదు వ్యక్తులుపోయాక కూడా వాళ్ల వారసులకూ అంటుకుని శత్రుత్వం వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంది. శ్వాస తీసుకుంటున్నట్లుగా మనిషి శత్రుత్వాన్ని కూడా తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తోంది. పుట్టీపుట్టడంతోనే శత్రువును, వ్యాధిని ఎవరైతే పోగొట్టుకోడో అతడు ఎంతటి బలవంతుడైనా నశించిపోతాడని భోజ చరిత్రం చెబుతోంది. అంటే వ్యాధిని, శత్రువును లేదా శత్రుత్వాన్ని ముదరనివ్వకూడదు. సాధ్యమైనంత వేగంగా వాటిని తీర్చేసుకోవాలి. శత్రుత్వం వ్యాధిలాంటిది అని అనడం, అనుకోవడం కాదు శత్రుత్వం వ్యాధికన్నా వినాశకరమైంది అనే సత్యాన్ని మనం తప్పకుండా అవగతం చేసుకోవాలి. కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం మరికొన్ని దేశాలనూ బాధించింది, బాధిస్తోంది... కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం వల్ల జరిగిన యుద్ధాల్లో కలిగిన ప్రాణ నష్టాన్ని, సంపద నష్టాన్ని చరిత్ర మనకు తెలియజెబుతూనే ఉంది. శత్రుత్వం కారణంగా దేశ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు, విలవిలలాడిపోతున్నారు...ఇటీవలి కరోనా విలయానికి కూడా కొన్ని దేశాల శత్రుత్వమే కారణం అని కొన్ని పరిశీలనలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. సంస్కృతి పరంగానూ, సంపదపరంగానూ, విద్యపరంగానూ, అభివృద్ధి పరంగానూ ఏర్పడిన శత్రుత్వం ప్రధాన కారణం కాగా మనదేశంలోకి విదేశీ దురాక్రమణదారులు చొరబడి దేశాన్ని కొల్లగొట్టడమూ, ఆక్రమించుకోవడమూ, సామాజిక పరిస్థితిని అల్లకల్లోలం చెయ్యడమూ అందువల్ల మనదేశానికి పెద్ద ఎత్తున నష్టం, కష్టం కలగడమూ చారిత్రికసత్యంగా మనకు తెలిసిందే. కొన్ని శతాబ్దులకాలం మనదేశం పరపాలనపీడనలో దురవస్థలపాలవడానికి శత్రుత్వం ప్రధానమైన కారణం అయింది. ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా శత్రుత్వం కారణంగా ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో దురంతాలకు శత్రుత్వం ఒక్కటే ప్రాతిపదిక అయింది. శత్రుత్వం ఉంటే దురంతమే ఉంటుంది. శత్రుత్వం ప్రేరణకాగా ప్రపంచంలో ఎన్నో ఘోరమైన పరిణామాలు జరిగాయి. శత్రుత్వంవల్ల మనం ఎంత మాత్రమూ క్షేమంగా లేం. శత్రుత్వంవల్ల చాలకాలం క్రితమే మనిషితో మనిషికి ఉండాల్సిన సంబంధం లేకుండాపోయింది. శత్రుత్వం మనిషిని ఆవహించింది అందువల్ల మనం ఎంత మాత్రమూ భద్రంగా లేం. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం బుద్ధిలోకి తీసుకోవాలి. మనిషి ప్రగతి, ప్రశాంతతలను, ప్రపంచ ప్రగతి, ప్రశాంతతలను ధ్వంసం చేస్తున్న శత్రుత్వాన్ని తక్షణమే త్యజించాలి. క్షయకరమైన శత్రుత్వం మనిషి లక్షణం కాకూడదు. శత్రుత్వం మనిషి జీవనంలో భాగం కాకూడదు. ‘ఇది నాలుగురోజుల జీవితం ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం’ ఈ భావంతో తెలుగు కవి–గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఒక ఉర్దూగజల్ షేర్ రాసి, పలికారు. ఆలోచిద్దాం... మన బతుకుల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఛిద్రం చేసే శత్రుత్వం మనకు ఎందుకు? ఆలోచిద్దాం... మనం జీవించడానికి శత్రుత్వం అవసరం ఉందా? మనం శత్రుత్వాన్ని సంపూర్ణంగా వదిలేసుకుందాం. అది సాధ్యం కాకపోతే శత్రుత్వంతోనే శత్రుత్వం చేద్దాం. సాటి మనిషికీ, సమాజానికీ కాదు మనిషి శత్రుత్వానికి శత్రువైపోవాలి. మనిషికి శత్రుత్వంలో ఉన్న నిజాయితి, అభినివేశం స్నేహంలో లేకుండా పోయాయి. ఇది విధ్వంసకరమైన స్థితి. ఈ స్థితి మనకు వద్దు. మనిషి తీరు మారాలి. శత్రుత్వం ఇలలో లేకుండా పోవాలి. ఇప్పటికే మనమందరమూ శత్రుత్వం వల్ల ఆవేదన చెందుతున్నాం. ఇకనైనా సంసిద్ధులమై శత్రుత్వంతో శత్రుత్వమూ, స్నేహంతో స్నేహమూ చేస్తూ బతుకుదాం. నిజమైన మనుషులమై మనం మనకూ, ప్రపంచానికీ వీలైనంత మంచి, మేలు చేసుకుందాం. ‘ఇది నాలుగురోజుల జీవితం, ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? / నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం‘ – రోచిష్మాన్ -
Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది
మాస్కో: ఉక్రెయిన్ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పుతిన్ శుక్రవారం దేశ పార్లమెంట్‌నుద్దేశించి మాట్లాడారు. క్రిమియా, వేర్పాటువాదుల ప్రాబల్యప్రాంతాలతో పాటు ఆక్రమిత ప్రాంతాలపై తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని ఉక్రెయిన్ను రష్యా డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ సాయం వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు అమెరికా మరో రూ.3,100 కోట్ల విలువైన ఆయుధ సాయం అందజేసింది. ఇందులో అత్యాధునిక రాకెట్ వ్యవస్థలు తదితరాలున్నాయని అధికారులు చెప్పారు. -
విషాదం: అమ్మా.. ఎంత కష్టమొచ్చిందో..
సాక్షి, ఖమ్మం: ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఆమెను ప్రాణం తీసుకునేలా చేశాయి. క్షణికావేశానికి లోనైన ఆ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే పిల్లలు దిక్కులేనివారు అవుతారని అనుకుందో ఏమో కడుపుతీపిని సైతం చంపుకొని వారినీ తనతో పాటే తీసుకెళ్లింది. ఆ చిన్నారులు అమ్మా వద్దు వద్దు అంటున్నా క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం తనతో పాటు ఇద్దరు చిన్నారులను విగతజీవులుగా మార్చింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం నగరంలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మంలోని బస్టాండ్ సెంటర్లో పూల వ్యాపారం చేసే శ్రీనివాస్ తన మూడో కూతురైన వనితను బావమరిది డోన్వాన్ రవికుమార్‌కు ఇచ్చి 12 ఏళ్ల కిందట వివాహం చేశాడు. వారికి మొదట ఒక సంతానం కలిగి చనిపోగా తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆటోడ్రైవర్ అయిన రవి కుటుంబంతో కలిసి ఖానాపురం యూపీహెచ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఏడాదిన్నరగా వనిత నగరంలోని ఓ మార్ట్‌లో పనిచేస్తూ కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. అప్పుడప్పుడు రవికుమార్‌కు, వనితకు మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నా పెద్దవాళ్లు సర్దిచెప్పేవారు. తర్వాత భార్యాభర్తలు కూడా సర్దుకొని పోయి బాగానే ఉండేవారు. కొన్ని రోజుల క్రితం భర్తకు కరోనా రావడంతో వనిత పిల్లలు చైతన్య(7), రోహిణి(6)లతో కలిసి తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో రవికుమార్ మంగళవారం రాత్రి ఆమెకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరు ఫోన్లో ఘర్షణపడ్డారని.. బుధవారం ఉదయం భర్త వద్దకు వెళ్లగా ఆమెకు, రవికుమార్‌కు మరలా గొడవ జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మున్నేరులో దూకి.. బుధవారం మార్ట్‌లో పనిచేయడానికి వెళ్లాల్సిన వనిత అక్కడకు వెళ్లకుండా ఇద్దరు పి ల్లలను తీసుకొని ఆటోలో కాల్వొడ్డుకు చేరుకుంది. అక్కడ నుంచి మోతీనగర్ వైపు ఉన్న మున్నేరు ఒడ్డుకు వెళ్లింది. మొదట పిల్లలను మున్నేరు నీటిలో తోసేసి అనంతరం తాను కూడా దూకింది. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ముగ్గురిని కాపాడేందుకు నీళ్లలో దూకి వారిని ఒడ్డుకు చేర్చిచూడగా అప్పటికే ప్రాణాలు విడిచారు. ఏదైనా కష్టం ఉంటే తమకు చెప్పాల్సిందని, తామందరం లేమా అని ఆమె సోదరుడు కోటి, సోదరీమణులు, తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. ఆర్థిక ఒత్తిళ్లతోనే.. ఇదిలా ఉండగా వనిత, రవికుమార్ మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా అవి తాత్కాలికమేనని.. ఆమె భర్త కూడా భార్యను, పిల్లలను వదిలిపెట్టి ఉండేవాడు కాదని కొంతమంది బంధువులు చెబుతున్నారు. అయితే ఇటీవల వనిత ఒక స్కీమ్‌కు సంబంధించి తాను చేరడంతో పాటు మరికొందరిని కూడా చేర్పించిందని, దానికి సంబంధించిన డబ్బును స్కీమ్ నిర్వాహకులు ఇవ్వకపోవడంతో ఆమెకు అవతలివారి నుంచి ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని కొంతమంది బంధువులు అంటున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను రెడ్‌క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యుడు అన్నం శ్రీనివాసరావు తన బృంద సభ్యులతో కలిసి మార్చురీకి తరలించారు. చదవండి: బర్త్‌డే కేక్ కట్ చేశాడు.. అందరూ కటకటాల పాలయ్యారు -
సంపద సృష్టి, వినాశనం రెండూ ఫైనాన్షియల్ రంగంలోనే
ముంబై: ఆర్థిక సేవల రంగం గడిచిన ఐదేళ్ల కాలంలో సంపదను సృష్టించిన రంగంగానే కాకుండా, నాశనం చేసినదిగానూ నిలిచిందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ప్రైవేటు రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో పెట్టుబడులతో 2013– 2018 మధ్య అతిపెద్ద సంపద సృష్టించిన రంగమని పేర్కొంది. అయితే, ఎన్పీఏ సమస్యల కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు హరించుకుపోవడం, షేర్ల ధరలు పతనం కావడంతో... ఇదే రంగం అతిపెద్ద సంపదను తుడిచిపెట్టినదిగానూ నిలిచినట్టు అభివర్ణించింది. -
పెను విధ్వంసం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిత్లీ.. అంతా భయపడినట్లే విరుచుకుపడింది! ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. పచ్చని కొబ్బరిచెట్లతో సిక్కోలు కోనసీమగా పేరొందిన ఉద్ధానం ఊపిరి తీసేసింది! గంటకు 165 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన ఈ తుపాను ధాటికి రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమవడంతో జిల్లాతో ఉద్ధానం బంధం తెగిపోయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. గతంలో ఇలాంటి సీజన్‌ల్లోనే దాడి చేసిన ఫైలీన్, హుద్‌హుద్ తుపానుల కన్నా మితిమీరిన ప్రతాపంతో విరుచుకుపడడంతో ఉద్ధానం వారేగాక శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని గజగజ వణికిపోయారు. తుపాను కారణంగా చెట్లు, ఇళ్లు కూలిన ఘటనల్లో ఏడుగురు మృతిచెందారు. తుపాను సృష్టించిన విధ్వంసానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూకటివేళ్లతో విరిగిపడ్డాయి. పూరిళ్లు పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వందలాది గ్రామాలు, పట్టణాలు అంధకారంలో మునిగిపోయాయి. రైతులకు అపారనష్టం వాటిల్లింది. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. వరి తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు విజయనగరం జిల్లాపైనా తుపాను ప్రభావం చూపింది. ఇక ఒడిశా రాష్ట్రంపైనా తిత్లీ విరుచుకుపడింది. ప్రధానంగా గజపతి జిల్లాలో బీభత్సం సృష్టించింది. మొత్తంగా విలయ విధ్వంసం సృష్టించి, భీకర గాలులతో తీవ్ర నష్టాన్ని కలిగించి శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ అతి తీవ్ర తుపాను గురువారం వేకువ జామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. అనంతరం తీవ్ర తుపానుగాను, ఆపై తుపానుగాను మారి గురువారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఈశాన్య దిశగా పశ్చిమబెంగాల్ వైపు పయనిస్తోంది. గురువారం రాత్రి పది గంటల సమయానికి ఇది ఒడిశాలోని భవానీపట్నాకు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చిగురుటాకులా వణికిన సిక్కోలు.. తిత్లీ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను కరుణించిన తిత్లీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఫలితంగా దీని ధాటికి సిక్కోలు చిగురుటాకులా వణికిపోయింది. అర్థరాత్రి తర్వాత నుంచి గంటగంటకూ తిత్లీ తన ప్రతాపాన్ని చూపించింది. తీరాన్ని దాటే సమయానికి పలాస, ఇచ్చాపురం, టెక్కలి, నర్సన్నపేట, సోంపేట తదితర ప్రాంతాల్లో పెనుగాలుల ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఈ ప్రాంతాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంది. టెక్కలి డివిజన్లో అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సమాచార వ్యవస్థ కుప్పకూలిపోయింది. అప్పటిదాకా గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 130 నుంచి 165 కిలోమీటర్ల వేగానికి చేరాయి. దీంతో శ్రీకాకుళం జిల్లావాసులు తీవ్ర భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుపాను తీరాన్ని దాటిన సమయంలో వజ్రపుకొత్తూరు మండల ప్రజలు గజగజ వణికిపోయారు. నాలుగేళ్లక్రితం ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా హుద్‌హుద్ వణికించగా.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తీవ్రంగా దెబ్బతీసింది. ఉద్ధానంపై తీవ్ర ప్రభావం.. ముఖ్యంగా వజ్రపుకొత్తూరు మండలంలో తీరం దాటడంతో ప్రధానంగా ఉద్ధానం ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. భీకర రీతిలో విరుచుకుపడిన పెనుగాలుల ప్రభావంతో కొబ్బరి చెట్లతోపాటు జీడిమామిడి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. టెక్కలి సమీపంలో కన్నెవలస వద్ద జాతీయ రహదారి పూర్తిగా వరదలో మునిగిపోవడంతో ఉద్ధానం ప్రాంతానికి జిల్లాతో సంబంధం తెగిపోయింది. సుమారు 12 గంటలపాటు కురిసిన వర్షాలకు జిల్లా అంతటా వరద ముంచెత్తింది. గురువారం జిల్లాలో సగటున 77 మిమీ వర్షపాతం నమోదైంది. దీంతో పలు మండలాల్లో వరి పంట నీటమునిగింది. సుమారు 1.44 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. అలాగే ఉద్ధానం సహా జిల్లావ్యాప్తంగా 3 లక్షల కొబ్బరి చెట్లు నేలకూలాయి. 737 హెకార్లలో అరటి, బొప్పాయి, జీడిమామిడి తదితర ఉద్యాన పంటలతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు ధ్వంసమైనట్టు అధికారులు అంచనా వేశారు. పంటలకు వాటిల్లిన నష్టం రూ.1,350 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. పక్కా ఇళ్లకూ తప్పని దెబ్బ... తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీగా ఇళ్లకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 1,021 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కించారు. ఇందులో రెండు పక్కా ఇళ్లు పూర్తిగా ధ్వంసంకాగా, మరో ఆరిళ్లు పాక్షికంగా దెబ్బతి న్నాయి. పూరిళ్లు మాత్రం తుపాను దాటికి ఆగలేకపోయాయి. 409 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 254 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిలో ఎక్కువగా రేకుల ఇళ్లే. ఈదురుగాలులకు రేకులు ఎగిరిపోవడంతో వర్షానికి ఇళ్లల్లోని వస్తువులు, ఆహారధాన్యాలు పాడైపోయాయి. ఇలా ఇళ్లు నష్టపోయినవారిలో ఎక్కువమంది వంశధార ప్రాజెక్టు నిర్వాసితులే ఉన్నారు. ఈ మొత్తం నష్టం రూ.20 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమిక అంచనా. మత్స్యకారులకు తీరని నష్టం... తిత్లీ తుపాను ధాటికి మత్స్యకారులకు సంబంధించిన 12 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 445 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంతేకాదు మత్స్యకారులు వేటకు ఉపయోగించే 1,520 వలలు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దీనివల్ల జరిగిన నష్టం రూ.9.34 కోట్లు ఉంటుందని అంచనా. ఇచ్ఛాపురంలో 24 సెం.మీల భారీ వర్షం.. తిత్లీ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల కుంభవృష్టి వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఇచ్ఛాపురంలో 24, టెక్కలిలో 23, పలాసలో 20, మందసలో 13, సోంపేటలో 12, పాతపట్నంలో 10, కళింగపట్నంలో 9, రణస్థలంలో 5, పాలకొండలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. తుపాను తీరాన్ని దాటాక గాలుల ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పట్టినా గురువారం మధ్యాహ్నం దాకా ఈదురుగాలులు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రికి గాలులు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. మరోవైపు తిత్లీ తుపాను తీరం దాటి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుండడంతో ఉత్తరాంధ్రలో వానలు తగ్గుముఖం పట్టనున్నాయి. రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. తుపాను తీరం దాటడంతో రాష్ట్రంలోని అన్ని పోర్టులకు జారీ చేసిన హెచ్చరికలను ఉపసంహరించింది. ఏడుగురి మృతి... తుపాను ప్రభావంతో విరుచుకుపడిన ఈదురుగాలులు, వర్షాల కారణంగా గురువారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలయ్యాయి. వర్షానికి నానిపోయిన ఇంటిస్లాబ్ కూలిపోయిన ప్రమాదంలో సరిబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన మూడడ్ల సూర్యారావు(46) చనిపోయారు. తనపై చెట్టు కూలిపోవడంతో వంగర మండలంలోని వోనె అగ్రహారానికి చెందిన తాడి అప్పలనర్సమ్మ(62) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. సంతబొమ్మాళి మండలంలో సున్నాపల్లి గ్రామానికి చెందిన బొంగు దుర్గారావు(50) కూడా చనిపోయినా కారణం ఏమిటనేదీ అధికారికంగా ప్రకటించలేదు. పొలంలో తన ఎద్దులను రక్షించడానికి వెళ్లిన సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామానికి చెందిన అప్పలస్వామి(56) మృత్యువాత పడ్డారు. టెక్కలిలోని ఆండ్ర వీధిలో పూరిల్లు కూలిపోయి కొల్లి లక్ష్మమ్మ(70) అనే వృద్ధురాలు మృత్యువాత పడ్డారు. అలాగే నందిగాం మండలం దేవీపురం గ్రామానికి చెందిన మున్నేన సంతోష్‌కుమార్(29), బోలుభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి కన్నయ్య(53) గొర్రెలను కాస్తూ మందస మండలంలోని సువర్ణపురం వద్దకు వెళ్లారు. వారిపై కొబ్బరిచెట్టు పడడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. అలాగే తుపాను ధాటికి మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. తొమ్మిది ఎద్దులు, గేదెలు చనిపోగా, గొర్రెలు, మేకలు 80 వరకూ చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే 500 కోళ్లు చనిపోయినట్లు సమాచారం. 9 లక్షలమందిపై ప్రత్యక్ష ప్రభావం! ఊహించిన దానికన్నా ప్రచండమారుతంలా తిత్లీ తుపాను విరుచుకుపడటంతో ప్రత్యక్షంగా నష్టపోయిన బాధితుల సంఖ్య సుమారు 9 లక్షలమంది దాకా ఉంటుందని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. జిల్లాలోని 38 మండలాలపైనా తుపాను ప్రభావం కనిపించింది. 16 మండలాలపై తీవ్రంగా ఉంది. సుమారు 1,864 గ్రామాలతో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు కూడా ఈ తుపాను ధాటితో నష్టాన్ని చవిచూశాయి. మొత్తం మీద తిత్లీ తుపాను వల్ల జిల్లాలో రూ.1,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. -
అమెరికాలో ఫ్లోరెన్స్ విధ్వంసం
విల్మింగ్టన్: అమెరికా తూర్పుతీరాన్ని తాకిన ఫ్లోరెన్స్ హరికేన్ విధ్వంసం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతుండటంతో భారీగా వరద పోటెత్తుతోంది. ఫ్లోరెన్స్ కారణంగా ఇప్పటివరకూ అమెరికాలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా ట్రెంట్, నూస్ నదులు పొంగిపొర్లుతుండటంతో ఉత్తర కరోలినాలోని న్యూబెర్న్ పట్టణంలో చాలా మంది 10 అడుగుల ఎత్తైన వరదలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. న్యూబెర్న్ నుంచి ఇప్పటివరకూ 400 మందిని రక్షించామనీ, మిగిలినవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. కాగా, ఫ్లోరెన్స్ హరికేన్ తీవ్రత ‘ఉష్ణమండల తుపాను’ స్థాయికి తగ్గినప్పటికీ గంటకు 112 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, కుంభవృష్టి సంభవిస్తుందని జాతీయ హరికేన్ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. మరోవైపు ఈ విషయమై ఉత్తర కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ స్పందిస్తూ.. ‘ఫ్లోరెన్స్ విధ్వంసం మరో 2–3 రోజులు కొనసాగే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 7.6 లక్షల మంది చీకట్లో మగ్గుతుండగా, 21,000 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఫ్లోరెన్స్ ప్రభావంతో కుంభవృష్టి కురవడంతో పాటు అకస్మాత్తుగా వరదలు పోటెత్తే ప్రమాదముంది. ఈ విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఫ్లోరెన్స్ దెబ్బకు అతలాకుతలమైన ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని దాదాపు 17 లక్షల మంది ప్రజలను అధికారులు ఇప్పటికే ఆదేశించారు. ఫ్లోరెన్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అమెరికా విపత్తు నిర్వహణా సంస్థ(ఫెమా)ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఫిలిప్పీన్స్ అతలాకుతలం మనీలా: మంగ్‌ఖుట్ టైఫూన్ ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. దీని కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ 12 మంది దుర్మరణం చెందగా, ఆరుగురు గల్లంతయ్యారు. గంటకు 170 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సహాయక చర్యల కోసం రెండు సీ–130 హెర్క్యులస్ విమానాలతో పాటుæహెలికాప్టర్లను అందు బాటులో ఉంచారు. 50 లక్షల మందిపై టైఫూన్ ప్రభావం చూపుతోంది. -
పై లీన్ పెను విధ్వంసం!
సంపాదకీయం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరప్రాంతాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రళయభీకర పై లీన్ తుపాను ఎట్టకేలకు శనివారం సాయంత్రం తీరాన్ని తాకింది. వస్తూనే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులనూ, కుండపోత వర్షాలనూ మోసుకొచ్చింది. గోపాల్పూర్నుంచి కళింగపట్నంవరకూ మహా వృక్షాలను, విద్యుత్ స్తంభాలనే కాదు... మనిషిని సైతం నిలబడనీయనంత స్థాయిలో పెనుగాలులు వీయడం మొదలైంది. తీరాన్ని తాకింది గనుక రానున్న 48 గంటలూ కోస్తా తీరంపొడవునా ఉన్న జనావాసాలకు పరీక్షా సమయమే. తుపాను బలహీనపడే వరకూ అది పయనించినంతమేరా కుండపోతగా వర్షాలుంటాయి. ఇప్పటికే తీరప్రాంత గ్రామాల్లో విద్యుత్ పంపిణీ నిలిచిపోయి అవి అంధకారంలో ఉన్నాయి. రవాణా సదుపాయాలూ ఆగిపోయాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో అయిదున్నర లక్షలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, భారీ నష్టం సంభవించే అవకాశం ఉన్నదని భావించిన ప్రాంతాల్లో సైన్యం, నావికాదళ సిబ్బంది, పారా మిలిటరీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. వారికి విమానాలు, హెలికాప్టర్లు, ఇతర రవాణా సదుపాయాలున్నాయి. విజ్ఞాన శాస్త్రాలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఈనాటికీ ప్రకృతి విపత్తులను నివారించడం మనిషికి అసాధ్యమవుతున్నది. చేయగలిగిందల్లా ఆ విపత్తుల స్థాయిని అంచనావేసుకుని, అది తెచ్చే నష్టాన్ని కనిష్ట స్థాయికి కుదించడమే. ముఖ్యంగా ఆస్తి నష్టాన్ని నివారించడం సాధ్యంకాకపోయినా ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని రకాల చర్యలూ తీసుకోవాల్సి ఉంటుంది. గత 24 ఏళ్లలో ఇంత భారీయెత్తున తుపాను విరుచుకుపడటం ఇదే ప్రథమమని వాతావరణ విభాగం చెబుతున్నది. తరచుగా బంగాళాఖాతం అల్లకల్లోలం కావడం, వాయుగుండాలు, తుపానులు చెలరేగడం...పర్యవసానంగా వరదలు సంభవించడం కొత్తేమీ కాదు. 36ఏళ్లక్రితం దివిసీమను ముంచెత్తిన ఉప్పెన ఎంత నష్టాన్ని మిగిల్చిందో ఇంకా జనం జ్ఞాపకాల్లో పచ్చిగానే ఉంది. తీరందాటి విరుచుకుపడిన రాకాసి అలలు అప్పుడు 10,000మందికి పైగా పౌరులను పొట్టనబెట్టుకున్నాయి. మనకున్న వెయ్యి కిలోమీటర్లకుపైగా తీరప్రాంతం తరచువచ్చే తుపానుల కారణంగా ముంపునకు గురవుతోంది. పదేళ్లక్రితం వరకూ ఏడాదికి ఒక్కసారి వచ్చే తుపానులు ఇప్పుడు ఏటా కనీసం రెండు, మూడుసార్లయినా పలకరిస్తున్నాయి. వచ్చిన ప్రతిసారీ లోతట్టు ప్రాంతాలను వరదలతో ముంచెత్తి, పంటలకు సైతం భారీగా నష్టాన్ని తెస్తున్నాయి. కోస్తా జనజీవితాల్లో భాగంగా మారిపోయిన ఈ వాయుగుండాలు, తుపానులనుంచి ప్రభుత్వాలు నేర్చుకున్నదేమిటి? క్షేత్రస్థాయిలోని వాస్తవాలను పరిశీలిస్తే అందులో చాలా వెనకబడే ఉన్నామని అర్ధమవుతుంది. ఇప్పుడు పెను నష్టం సంభవించనున్న శ్రీకాకుళం సంగతే తీసుకుంటే...అక్కడున్న తుపాను షెల్టర్లలో చాలా భాగం పనిచేయడం లేదు. ఎన్నడో 1982లో ఆ జిల్లాలోని దిబ్బలపాలెంలో నిర్మించిన తుఫాను షెల్టరు బీటలువారి శిథిలప్రాయమైంది. అక్కడనేమిటి? తీరప్రాంతంలో ఉన్న తుఫాను షెల్టర్లన్నీ ఇలాంటి దుస్థితిలోనే ఉన్నాయి. ఒకచోటైతే శిథిలమైన షెల్టర్‌ను కూల్చి మెరైన్ పోలీస్ స్టేషన్ కోసం కొత్త భవనాన్ని నిర్మించారు. కొన్ని షెల్టర్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. అంటే ఆపత్కాలంలో తలదాచుకోవడానికి ప్రజలకు ఎలాంటి సురక్షిత భవనమూ లేదన్నమాట. తుపాను షెల్టర్ల పరిస్థితి ఇలావుంటే... తాత్కాలిక సహాయ శిబిరాలుగా మారిన పాఠశాలలకు తరలించిన ప్రజలు గొంతు తడుపుకొనడానికి మంచినీళ్లు కూడా లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఇక తిండి సంగతి చెప్పేదేముంది? ఈ శిబిరాల్లో తలదాచుకున్నవారు చానెళ్లకు చెబుతున్న కథనాలు వింటుంటే హృదయవిదారకంగా ఉంటున్నాయి. విపత్తులు మనకు కొత్త కాకపోయినా సహాయ చర్యల విషయానికొచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం ఇలా అనుభవలేమిని ఎందుకు ప్రదర్శిస్తుందో అనూహ్యం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పర్యవేక్షించడానికి మనకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉంది. పైలిన్ తుపాను వచ్చాక అది ఆ పనిలో నిమగ్నమై ఉన్నది. అయితే, సాధారణ సమయాల్లో ఆ సంస్థ చేయాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తుపాను షెల్టర్ల స్థితి ఎలా ఉన్నదో చూసి అవసరమైన మరమ్మతులు చేయించడం... అదనంగా ఎక్కడెక్కడ షెల్టర్లు నిర్మించవలసి ఉన్నదో అంచనావేసుకోవడం... మత్స్యకార గ్రామాలకు రవాణా సదుపాయాలెలా ఉన్నాయో చూసి, అవసరమైన మార్పులను సూచించడం...రహదారులు సరిగా లేనిచోట వాటిని నిర్మించడంలాంటి పనులను చేపడితే ప్రాణ నష్టాన్ని నివారించడం సులభమవుతుంది. జపాన్‌లో భూకంపాల గురించి నిర్ణీత కాల వ్యవధిలో తరచుగా అవగాహన కలిగించే కార్యక్రమాలున్నట్టు... ఈ తుపానుల గురించి, అవి తలెత్తినప్పుడు అందుబాటులో ఉంచుకోవాల్సిన సహాయసంపత్తి గురించి, ఉండాల్సిన సంసిద్ధత గురించి తరచుగా తెలియజెబితే ఇంత గందరగోళ పరిస్థితులు తలెత్తవు. పౌరులు సహాయ శిబిరాల్లో ఆకలితో హాహాకారాలు చేసే దుస్థితి ఏర్పడదు. మూడేళ్లక్రితం లైలా తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించినప్పుడూ, ఏడాదిక్రితం నీలమ్ తుపాను విరుచుకుపడినప్పుడూ సహాయచర్యలపరంగా బయటపడిన వైఫల్యాలే ఇప్పుడూ ఎదురవుతుంటే ఇక ప్రభుత్వాలు ఉండి ఎందుకు? విపత్తులు సంభవించినప్పుడు సాయం చేయడానికి రంగంలోకి దూకడమే కాదు...ఆ కృషిలో ఎదురైన అనుభవాలను సమీక్షించుకుని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ క్రమంలో తలెత్తిన పొరపాట్లను పరిహరించుకోవచ్చునో మదింపు వేసుకుంటే భవిష్యత్తు ఇబ్బందులను ఎదుర్కోవడం సులభమవుతుంది. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలి.