సంపాదకీయం
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరప్రాంతాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రళయభీకర పై లీన్ తుపాను ఎట్టకేలకు శనివారం సాయంత్రం తీరాన్ని తాకింది. వస్తూనే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులనూ, కుండపోత వర్షాలనూ మోసుకొచ్చింది. గోపాల్‌పూర్‌నుంచి కళింగపట్నంవరకూ మహా వృక్షాలను, విద్యుత్ స్తంభాలనే కాదు... మనిషిని సైతం నిలబడనీయనంత స్థాయిలో పెనుగాలులు వీయడం మొదలైంది. తీరాన్ని తాకింది గనుక రానున్న 48 గంటలూ కోస్తా తీరంపొడవునా ఉన్న జనావాసాలకు పరీక్షా సమయమే. తుపాను బలహీనపడే వరకూ అది పయనించినంతమేరా కుండపోతగా వర్షాలుంటాయి. ఇప్పటికే తీరప్రాంత గ్రామాల్లో విద్యుత్ పంపిణీ నిలిచిపోయి అవి అంధకారంలో ఉన్నాయి. రవాణా సదుపాయాలూ ఆగిపోయాయి.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో అయిదున్నర లక్షలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, భారీ నష్టం సంభవించే అవకాశం ఉన్నదని భావించిన ప్రాంతాల్లో సైన్యం, నావికాదళ సిబ్బంది, పారా మిలిటరీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. వారికి విమానాలు, హెలికాప్టర్లు, ఇతర రవాణా సదుపాయాలున్నాయి. విజ్ఞాన శాస్త్రాలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఈనాటికీ ప్రకృతి విపత్తులను నివారించడం మనిషికి అసాధ్యమవుతున్నది. చేయగలిగిందల్లా ఆ విపత్తుల స్థాయిని అంచనావేసుకుని, అది తెచ్చే నష్టాన్ని కనిష్ట స్థాయికి కుదించడమే. ముఖ్యంగా ఆస్తి నష్టాన్ని నివారించడం సాధ్యంకాకపోయినా ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని రకాల చర్యలూ తీసుకోవాల్సి ఉంటుంది. గత 24 ఏళ్లలో ఇంత భారీయెత్తున తుపాను విరుచుకుపడటం ఇదే ప్రథమమని వాతావరణ విభాగం చెబుతున్నది.
తరచుగా బంగాళాఖాతం అల్లకల్లోలం కావడం, వాయుగుండాలు, తుపానులు చెలరేగడం...పర్యవసానంగా వరదలు సంభవించడం కొత్తేమీ కాదు. 36ఏళ్లక్రితం దివిసీమను ముంచెత్తిన ఉప్పెన ఎంత నష్టాన్ని మిగిల్చిందో ఇంకా జనం జ్ఞాపకాల్లో పచ్చిగానే ఉంది. తీరందాటి విరుచుకుపడిన రాకాసి అలలు అప్పుడు 10,000మందికి పైగా పౌరులను పొట్టనబెట్టుకున్నాయి. మనకున్న వెయ్యి కిలోమీటర్లకుపైగా తీరప్రాంతం తరచువచ్చే తుపానుల కారణంగా ముంపునకు గురవుతోంది. పదేళ్లక్రితం వరకూ ఏడాదికి ఒక్కసారి వచ్చే తుపానులు ఇప్పుడు ఏటా కనీసం రెండు, మూడుసార్లయినా పలకరిస్తున్నాయి. వచ్చిన ప్రతిసారీ లోతట్టు ప్రాంతాలను వరదలతో ముంచెత్తి, పంటలకు సైతం భారీగా నష్టాన్ని తెస్తున్నాయి. కోస్తా జనజీవితాల్లో భాగంగా మారిపోయిన ఈ వాయుగుండాలు, తుపానులనుంచి ప్రభుత్వాలు నేర్చుకున్నదేమిటి? క్షేత్రస్థాయిలోని వాస్తవాలను పరిశీలిస్తే అందులో చాలా వెనకబడే ఉన్నామని అర్ధమవుతుంది. ఇప్పుడు పెను నష్టం సంభవించనున్న శ్రీకాకుళం సంగతే తీసుకుంటే...అక్కడున్న తుపాను షెల్టర్లలో చాలా భాగం పనిచేయడం లేదు.
ఎన్నడో 1982లో ఆ జిల్లాలోని దిబ్బలపాలెంలో నిర్మించిన తుఫాను షెల్టరు బీటలువారి శిథిలప్రాయమైంది. అక్కడనేమిటి? తీరప్రాంతంలో ఉన్న తుఫాను షెల్టర్లన్నీ ఇలాంటి దుస్థితిలోనే ఉన్నాయి. ఒకచోటైతే శిథిలమైన షెల్టర్‌ను కూల్చి మెరైన్ పోలీస్ స్టేషన్ కోసం కొత్త భవనాన్ని నిర్మించారు. కొన్ని షెల్టర్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. అంటే ఆపత్కాలంలో తలదాచుకోవడానికి ప్రజలకు ఎలాంటి సురక్షిత భవనమూ లేదన్నమాట. తుపాను షెల్టర్ల పరిస్థితి ఇలావుంటే... తాత్కాలిక సహాయ శిబిరాలుగా మారిన పాఠశాలలకు తరలించిన ప్రజలు గొంతు తడుపుకొనడానికి మంచినీళ్లు కూడా లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఇక తిండి సంగతి చెప్పేదేముంది? ఈ శిబిరాల్లో తలదాచుకున్నవారు చానెళ్లకు చెబుతున్న కథనాలు వింటుంటే హృదయవిదారకంగా ఉంటున్నాయి.
విపత్తులు మనకు కొత్త కాకపోయినా సహాయ చర్యల విషయానికొచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం ఇలా అనుభవలేమిని ఎందుకు ప్రదర్శిస్తుందో అనూహ్యం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పర్యవేక్షించడానికి మనకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉంది. పైలిన్ తుపాను వచ్చాక అది ఆ పనిలో నిమగ్నమై ఉన్నది. అయితే, సాధారణ సమయాల్లో ఆ సంస్థ చేయాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి.
ముఖ్యంగా తుపాను షెల్టర్ల స్థితి ఎలా ఉన్నదో చూసి అవసరమైన మరమ్మతులు చేయించడం... అదనంగా ఎక్కడెక్కడ షెల్టర్లు నిర్మించవలసి ఉన్నదో అంచనావేసుకోవడం... మత్స్యకార గ్రామాలకు రవాణా సదుపాయాలెలా ఉన్నాయో చూసి, అవసరమైన మార్పులను సూచించడం...రహదారులు సరిగా లేనిచోట వాటిని నిర్మించడంలాంటి పనులను చేపడితే ప్రాణ నష్టాన్ని నివారించడం సులభమవుతుంది. జపాన్‌లో భూకంపాల గురించి నిర్ణీత కాల వ్యవధిలో తరచుగా అవగాహన కలిగించే కార్యక్రమాలున్నట్టు... ఈ తుపానుల గురించి, అవి తలెత్తినప్పుడు అందుబాటులో ఉంచుకోవాల్సిన సహాయసంపత్తి గురించి, ఉండాల్సిన సంసిద్ధత గురించి తరచుగా తెలియజెబితే ఇంత గందరగోళ పరిస్థితులు తలెత్తవు.
పౌరులు సహాయ శిబిరాల్లో ఆకలితో హాహాకారాలు చేసే దుస్థితి ఏర్పడదు. మూడేళ్లక్రితం లైలా తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించినప్పుడూ, ఏడాదిక్రితం నీలమ్ తుపాను విరుచుకుపడినప్పుడూ సహాయచర్యలపరంగా బయటపడిన వైఫల్యాలే ఇప్పుడూ ఎదురవుతుంటే ఇక ప్రభుత్వాలు ఉండి ఎందుకు? విపత్తులు సంభవించినప్పుడు సాయం చేయడానికి రంగంలోకి దూకడమే కాదు...ఆ కృషిలో ఎదురైన అనుభవాలను సమీక్షించుకుని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ క్రమంలో తలెత్తిన పొరపాట్లను పరిహరించుకోవచ్చునో మదింపు వేసుకుంటే భవిష్యత్తు ఇబ్బందులను ఎదుర్కోవడం సులభమవుతుంది. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలి.