Phailin cyclonic
-
ఆరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన: రఘువీరారెడ్డి
తుపాను నష్టాలను పరిశీలించేందుకు రాక... కేంద్ర బృందానికి తక్షణమే నివేదికలివ్వాలి: మంత్రి రఘువీరారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆరు జిల్లాల్లో పైలీన్ తుపాను, భారీ వర్షాలవల్ల కలిగిన నష్టాలను కేంద్ర బృందానికి చూపించాలని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి నిర్ణయించారు. తుపాను, వరద నష్టాలను పరిశీలించేందుకు ఈనెల 17న కేంద్ర బృందాలు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో వీటిని ఏఏ జిల్లాలకు పంపించాలనే అంశంపై ఉన్నతాధికారులతో రఘువీరారెడ్డి బుధవారం సమీక్షించారు. కేంద్ర బృందాలు పర్యటించే జిల్లాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టాలపై ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆ బృందానికి సమర్పించేందుకు నష్టాల నివేదికలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. 17న హైదరాబాద్ చేరుకునే కేంద్ర బృందం సభ్యులు 18న ఉదయం లేక్‌వ్యూ అతిథి గృహంలో ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. తర్వాత వీరు మూడు బృందాలుగా విడిపోతారు. ఒక బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం; రెండో బృందం గుంటూరు, ప్రకాశం; మూడో బృందం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పర్యటనకు అదేరోజు మధ్యాహ్నం వెళతాయి. తర్వాత ఈ మూడు బృందాలు 20వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటాయి. 21వ తేదీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశమవుతుంది. -
రాత్రి 9 గంటలకు రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటి!
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాత్రి 9 గంటల10 నిమిషాలకు సమావేశమవ్వనున్నారు. ఈ రాత్రికి వైఎస్ జగన్ కు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. తుఫాన్ దాటికి నష్టపోయిన రైతుల కష్టాలను రాష్ట్రపతి దృష్టికి వైఎస్ జగన్ తీసుకురానున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి మంగళవారం ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ లో పాల్గొంటారు. -
సిక్కోలులో 4లక్షల మందిపై పై-లిన్ ప్రభావం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుఫాన్ నాలుగు లక్షల మందిపై ప్రభావం చూపిందని జిల్లా కలక్టర్ సౌరభ్ గౌర్ ప్రకటించారు. పైలిన్ తుఫాన్ వెలిసిన వారం రోజుల తరువాత అధికార్లు నష్టం అంచనాలను ప్రకటించడం విశేషం. ఎక్కడా ప్రాణ నష్టం సంభవించకపోగా, ఎనభై నాలుగు పశువులు మృతి చెందాయన్నారు. 382 ఇళ్లు పూర్తిగా, 800 వందల ఇళ్లు పాక్షికంగా , పన్నెండు వందల విద్యుత్ స్థంబాలు ధ్వంసం అయ్యాయన్నారు. 442 గ్రామాలు తుఫాన్ ధాటికి గురి అయ్యాయని, 9వేల హెక్టార్లలో పంట పొలాలు, 8 వేల హెక్టార్లలో ఇతర పంటలు నాశనం అయ్యాయని తెలిపారు. తుఫాన్ పునరావాస చర్యలు కొనసాగుతున్నాయన్నారు. -
హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్ బయల్దేరారు.శ్రీకాకుళం జిల్లాలో నిన్న తుపాను బాధితుల్ని పరామర్శించిన ఆమె గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. పై-లీన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని పలు మారుమూల గ్రామాల్లో విజయమ్మ నిన్న విస్తృతంగా పర్యటించారు. ఆమె అడుగిడిన ప్రతిచోటా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ కష్టాలు చెప్పుకొన్నారు. రైతుల కష్ట నష్టాలు తెలుసుకుంటూ...బాధిత రైతులను పరామర్శిస్తూ... వలలు, బోట్లు, ఆస్తులు కోల్పోయిన మత్స్యకారులకు భరోసానిస్తూ... రైతులకు అండగా ఉంటామని విజయమ్మ హామీ ఇచ్చారు.నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెబుతూ ఆమె ముందుకు సాగారు. -
విశాఖ చేరుకున్న వైఎస్ విజయమ్మ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయల్దేరారు. జిల్లాలోని ఫై-లిన్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తారు. పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు పరామర్శించనున్నారు. కొద్దిసేపటి క్రితం విజయమ్మ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ నేతల స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆమె శ్రీకాకుళం చేరుకుంటారు.ఇచ్చాపురం నియోజక వర్గంలో విజయమ్మ పర్యటన కొనసాగనుంది. ఇచ్చాపురం నియోజకవర్గంలో కంచలీ,పెద్ద కొజ్జారియా, జాడుపుడి,రాజుపురం, జగతి, ఇద్దివానిపాలెం,కళింగ పట్నం,ఇసుకపాలెం,తలతంపర,బారువులో పర్యటిస్తారు.ఫైలిన్ తుఫాన్ వల్ల నష్టపోయిన కొబ్బరి, జీడి రైతులను , మత్స్యకారులను విజయమ్మ పరామర్శిస్తారు. తర్వాత తుఫాన్ వల్ల దెబ్బతిన రహదారులను, విద్యుత్ వ్యవస్థను స్వయంగా పరిశీలిస్తారు.సాయంత్రానికి పర్యటన పూర్తిచేసుకోని రాత్రి పలాసలో బస చేస్తారు. -
నేడు శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ పర్యటన
సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బుధవారం ఉదయం పర్యటిస్తారు. తుపాను గండం గడిచినప్పటికీ దాని ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో జీడి, కొబ్బరి, అరటి, వరి, కూరగాయలు, ఉద్యాన పంటల సాగు చేస్తున్న రైతులు పై-లీన్ విధ్వంసానికి తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించి బాధిత రైతులను పరామర్శిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. -
తుపాను నష్టం ఆపారం
ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను సృష్టించిన విలయంతో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు విలవిల్లాడుతున్నాయి. వందల కోట్ల పంట, ఆస్తి నష్టం వాటిల్లింది. ఉద్దానం జీవనాధారమైన కొబ్బరి, జీడి తోటలు ధ్వంసమయ్యాయి. రైతులు, మత్స్యకారులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు.. ఇలా అన్ని వర్గాలవారు తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయారు. మంత్రులు రఘువీరారెడ్డి, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీమోహన్, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తదితరులు తుపాను ప్రాంతాల్లో నామమాత్రంగా పర్యటించి, మొసలి కన్నీరు కార్చి వెళ్లిపోయారే తప్ప సహాయ చర్యలు ఎలా అమలవుతున్నాయన్న విషయాన్ని అసలు పట్టించుకోలేదు. సహాయం గురించి ముఖ్యమంత్రి వైపు నుంచి ఇంతవరకు కనీస ప్రకటన లేకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుదేలైన కొబ్బరి రైతు రెండు నియోజకవర్గాల్లో విస్తరించిన ఉద్దానం ప్రాంతంలో 9 వేల హెక్టార్లకు పైగా కొబ్బరి పంట ఉండగా 3,500కు పైగా హెక్టార్లల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా. కొబ్బరి రైతులు రూ.450 కోట్ల మేర నష్టపోయారు. పదేళ్లయినా కొబ్బరి రైతు తేరుకోలేడని, నష్టం అంత తీవ్రంగా ఉందని కొబ్బరి బోర్డు సీనియర్ కన్సల్టెంట్ జోహార్‌ఖాన్ చెప్పారు. కొబ్బరితోపాటు అంతర పంటలైన జీడి, మామిడి, అరటి తోటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వీటి నష్టం మరో రూ.100 కోట్ల వరకు ఉంటుంది. 400 హెక్టార్లలో కాయగూరలు, వందల హెక్టార్లలో వేసిన పనస, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వరి, ఇతర పంటలు సాగు చేస్తున్న సుమారు 15 వేల ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. దాదాపు వంద ఎకరాల్లో వేసిన టేకు చెట్లు కూడా కూలిపోయాయి. కోట్ల విలువైన బోట్లు, వలల ధ్వంసం వందల సంఖ్యలో విలువైన బోట్లు, వలలు కొట్టుకుపోవడమో, పాడైపోవడమో జరిగి, మత్స్యకారులు పది కోట్ల రూపాయలకుపైనే నష్టపోయివుంటారని అంచనా. దాచుకున్న చేపలను సైతం సముద్రం లాగేసుకోవడంతో మరో కోటి రూపాయలకు పైగానే నష్టం వాటిల్లింది. సుమారు 20 రొయ్యల చెరువులు కూడా ధ్వంసమయ్యాయి. సుమారు 3వేలకు పైగా ఇళ్లు పూర్తిగానో, పాక్షికంగానో దెబ్బతినగా 400 ఇళ్ల లెక్కే చూపిస్తున్నారు. జల దిగ్బంధంలో 3 గ్రామాలు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇప్పటికీ మూడు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇచ్ఛాపురం మండలంలోని ఇన్నీసుపేట, బొడ్డబడ, కవిటి మండలంలోని ఒంటూరు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. బాహుదా నది వరద కారణంగా బొడ్డబడ గ్రామానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఒంటూరు గ్రామస్తులు సరైన ఆహారం, పారిశుద్ధ్యం లేక అనారోగ్యం పాలవుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలు ముమ్మరం విశాఖపట్నం: పై-లీన్ తుపాను నష్ట నివారణకు ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్) చర్యలు చేపట్టింది. ఉత్తరాంధ్ర జిల్లా పరిధిలోని 33/11 కేవీ సామర్థ్యమున్న 81 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. 1010 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్టు లెక్కతేల్చారు. అయితే నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న దానిపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, పలాస, వజ్రపుకొత్తూరు పరిధిలో బాగా నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్తున్నారు. టెక్కలి డివిజన్లో ప్రస్తుతం 33/11 కేవీ సామర్థ్యమున్న 34 సబ్స్టేషన్లను ప్రస్తుతం పునరుద్ధరించారు. 11 కేవీ ఫీడర్లు, ఎల్టీ లైన్ల పునరుద్ధరణకు మరో రెండు రోజులు పడుతుందని చెప్తున్నారు. దీంతో సుమారు 270 గ్రామాలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ చేస్తామని చెప్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్స్ విభాగంలో అనుభవమున్న సీనియర్ ఇంజనీరు, ఈపీడీసీఎల్ జనరల్ మేనేజర్(ప్రాజెక్ట్సు) పి.వి.వి.సత్యనారాయణను పర్యవేక్షక ఇంజనీరు(ఎస్ఈ)గా సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్తు పునరుద్ధరణకు ఆదేశాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణ, ఇతర సహాయ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను వల్ల నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ, మంచినీటి సరఫరా పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపానులో దెబ్బతిన్న 112 (33/11) సబ్స్టేషన్లలో 111 సబ్స్టేషన్లకు మరమ్మతులు పూర్తి చేశామని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. 11 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 323 దెబ్బతినగా 295 మరమ్మతులు చేశామని వివరించారు. 2,061 గ్రామాలకు విద్యుత్తు సరఫరా దెబ్బతినగా 1,811 గ్రామాలకు పునరుద్ధరించామని తెలిపారు. రహదారులు పునరుద్ధరించామని, బావుల్లో కలుషితమైన నీటిని శుద్ధి చేశామని సంబంధిత శాఖల అధికారులు తెలియజేశారు. పొంచి ఉన్న మరో ముప్పు? సాక్షి, విశాఖపట్నం: పై-లీన్ తుపాను తీరం దాటిపోవడంతో అన్నివర్గాలూ ఊపిరిపీల్చుకున్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్ ప్రాంతంలో అల్పపీడన ం ఏర్పడడం, ఇది కాస్త బలపడే అవకాశం ఉండడంతో మరో తుపాను ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. అండమాన్ నికోబార్ ప్రాంతం నుంచి బంగ్లాదేశ్/థాయ్‌లాండ్ ప్రాంతాల మీదుగా బంగాళాఖాతం వైపు గాలులు వీస్తుండడంతో నాలుగైదు రోజుల్లో ప్రభావం కనిపించవచ్చనే ప్రచారం ఊపందుకుంది. తూర్పు తీరంపై తుపాను ప్రభావం ఉంటుందనే విషయమై.. ఇది వాస్తవం కాదని, ప్రస్తుత వాతావరణం.. కొన్ని చోట్ల వర్షాలు పడేందుకే కారణమవుతోంది తప్పితే తుపాను అవకాశాలేవీ లేవని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అయితే ఇది కాస్త బలహీనంగానే ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పై-లీన్ తుపాను జార్ఖండ్ ప్రాంతంలో పూర్తిస్థాయిలో బలహీనపడిపోయిందని, దీని ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టేనని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రంలోపు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు విజయమ్మ పర్యటన
హైదరాబాద్ : పై-లీన్ తుపాన్ ప్రభావ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బుధవారం పర్యటించనున్నారు. తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలను ఆమె పర్యటిస్తారు. బాధితుల్ని పరామర్శిస్తారు . పై-లిన్ విసిరిన పంజాకు శ్రీకాకుళం జిల్లా కకావికలమైంది. భారీగా పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పలు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. విద్యుత్ లేక చాలా గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. దాంతో విద్యుత్ సరఫరాను పునర్నిర్మించుకోడానికి మత్స్యకారులు తమంతట తాము ముందుకొస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో దాదాపుగా గంటకు 220-240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలో ఏకంగా 832 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. -
పై-లిన్ ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా సీఎం ఏరియల్ సర్వే
భువనేశ్వర్ : పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏరియల్ సర్వే నిర్వహించారు. పై-లిన్ తుపాన్‌తో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధితులందరినీ ఆదుకుంటామని నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. గోపాల్ పూర్, గంజాం జిల్లాల్లో పర్యటించారు. అయితే కొన్నిచోట్ల సీఎం కాన్వాయ్ ని బాధితులు అడ్డుకున్నారు. సహాయక చర్యలు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పై-లిన్ ప్రభావంతో రద్దు చేసిన అన్ని రైళ్లను పునరుద్దరించినట్లు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు పాడయిన రైల్వే ట్రాక్ పనులను పునరుద్దరిస్తున్నారు. -
పై-లీన్ విపత్తులో మన నేరమెంత?
పై-లీన్ తుపాను గండం దాటిపోయిందంటూ 'హమ్మయ్య' అని ఈ నిట్టూర్పు విడిచేసి, చేతులు దులిపేసుకుంటే అంతకి మించి నేరం మరొకటి లేదంటున్నారు నిపుణులు. లక్షలాది ఇళ్లు నేలమట్టం చేసి, లక్షల కుటుంబాలకీ నిలవ నీడ లేకుండా చేసి, రవాణా, ప్రసార వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి, వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన పై-లీన్ విషయంలో హమ్మయ్య అనుకోవలసిందేమైనా ఉందంటే అది ప్రాణనష్టాన్ని నివారించచడం ఒక్కటే. 1999 ఒడిశా పెను తుపాను తర్వాత, ఈ 14 ఏళ్లలో అతి పెద్ద తుపాను పై-లీన్ అని వాతావరణ శాఖ ప్రకటించింది. రగులుతున్న రాజకీయ వర్తమానం నుంచి, సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా అనుకున్నాయో, లేదా వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల ఫలితమో గానీ, ప్రభుత్వాలు ముందెన్నడూ లేనంత భారీ ఎత్తున లక్షలాది మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాయి. చనిపోయిన వారి సంఖ్య 25 (మాత్రమే) కావడం కూడా 'హమయ్య' అనుకునే వెసులుబాటు ఇచ్చింది. కానీ, ఎన్ని సార్లైనా, చేతులు కాలాక మాత్రమే ఆకులు పట్టుకుంటున్న ఈ నిర్లక్ష్యం ఉపేక్షించరానిది. ప్రచండ పై-లీన్ ప్రతాపం పెనుగాలులు, కుండపోత వర్షం, గట్లు తెగిన నదులు, పోటెత్తి జనవాసాల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం. నేలమట్టమైన ఇళ్లు, కొట్టుకుపోయిన పంటలు, కుప్పకూలిన కొబ్బరి చెట్లు, తెప్పలా తేలిన జీడిమామిడి చెట్లు, ఆచూకీలేని అరటి తోటలు.. అంతా కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిన విషాదం. ప్రాథమిక అంచనా ప్రకారం.. మన రాష్ట్రం వరకూ 6000 హెక్టార్లలో అరటి, జీడి, మొక్కజొన్న, కొబ్బరి, , చెరకు పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో కొబ్బరి విస్తీర్ణం అధిక శాతం కనుక, బాధిత రైతుల్లో 90 శాతం కొబ్బరి రైతులే! ఇది కాకుండా, కేవలం ఆరు మండలాల్లోనే 8000 హెక్టార్లలో వరి నాశనమైంది. ఇందులో పొట్ట దశకు వచ్చి పాడైన పంట 3500 హెక్టార్లలో ఉంది. లక్షలాది టేకు చెట్లు వెన్ను విరిగి కూలాయి. గాలులు గంటకి 230 కిలో మీటర్ల వేగంతో వీచాయి, దానితో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వంగిపోయిన విద్యుత్ స్థంభాలు ఎన్నో. పశువులు, సైబేరియా నుంచి వచ్చిన వలస పక్షులు ఎన్ని చనిపోయాయో లెక్కకి తేలదు. కుండపోత వర్షాలకి వరదలెత్తిన నదులు గ్రామాలకి గ్రామాల్నే ముంచెత్తాయి. 150 ఎకరాల్లో రొయ్యల చెరువులు దెబ్బ తిన్నాయి. మానవ తప్పిదమెంత? ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డుకోలేక పోయినా, ఆ తీవ్రతని తగ్గించే ప్రత్యామ్నాయాల్ని చేజేతులా నాశనం చేసుకోవడం వల్లే తుపానులు, ఉప్పెనల్లో భారీ నష్టం జరుగుతుంది. "ఏ ట్రాపికల్ సైక్లోన్ (ఉష్ణమండలాల్లో వచ్చే తుపానులు) పరిణామాలైనా మూడు- ఒకటి పెనుగాలులు, రెండు కుంభవృష్టి, మూడు ఉప్పెన (లేదా సునామి). ఈ మూడు వైపరీత్యాల తీవ్రతని 40 శాతం వరకూ తగ్గించే రక్షణ కవచాలు మడ చెట్లు. సముద్రం ఒడ్డున పెరిగే ఈ అడవుల్ని కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం అడ్డగోలుగా నరికేస్తుంటే పట్టించుకునే నాథులే లేరు," అని వాపోయారు ఆంధ్రా యూనివర్సిటీ ఓషనోగ్రఫీ విభాగం విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ ఓఎస్ఆర్యు భానుకుమార్. సోమవారం సాక్షితో మాట్లాడుతూ, మడ అడవుల్ని సంరక్షించుకోగలిగినట్టైతే పై-లీన్ తుపాను నష్టం ఎంతో నివారించబడేదని ఆయన అన్నారు. "ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మడ అడవులు గోడలా నిలిచి మానవాళికి రక్షణ కల్పిస్తున్నాయి. తీరం కోతకు గురవకుండా ఇవి కాపాడతాయి. సునామీ సమయాల్లో సముద్రపు నీరు నేరుగా లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇలవమడ, నల్లమడ, గుగ్గిలం తెల్లమడ ఈల్వమడతోపాటు మొత్తం 35 రకాల చెట్లు ఈ అడవుల్లో కనిపిస్తాయి. ఇవి రెండు నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు ఎదిగి తీరంలో రక్షణ కవచంగా నిర్మిస్తాయి," అని ఆయన చెప్పారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ మడ చెట్ల పెంపకం గురించి ఒక కొత్త పథకాన్ని రూపొందించారని ఆయన తెలిపారు. మడ చెట్లు రక్షణ కవచమే కాకుండా, చేపల పునరుత్పత్తికి దోహదపడతాయనీ, దాని వల్ల దేశ సముద్ర ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని మరో వాతావరణ అధ్యయన నిపుణులు అచ్యుతరావు తెలిపారు. అయితే, కొందరు స్వార్థపరులు మడ అడవులను నరికేస్తూ, చేపల చెరువులు, రొయ్యల చెరువులు తవ్వుతున్నారు; దానికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకు తున్నారు. ఎంతో విలువైన వృక్ష సంపద వంట చెరకుగా మారిపోతోంది. మడ అడవులు తరిగిపోతూ తీర్రపాంతంలో భూమి కోతకు గురికావడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి దుష్పరిణామాలతో పాటు, ప్రకృతి విలయానికి వేల కోట్లలో నష్టం కలుగుతోంది. దానికి ప్రాణనష్టం కూడా తోడైతే ఏ గణాంకాలు ఆ తీవ్రతని అంచనా వేయగలవు? అందరి సమష్టి బాధ్యత సముద్ర తీర ప్రాంతాల్లో మాంగ్రోవ్ అని పిలవబడే మడ అడవుల పెంపకం అమెరికా వంటి దేశాల్లో విధిగా ఆచరిస్తారు. వాటిని నరికివేయడం పెద్ద నేరం. దానికి కఠినమైన శిక్షలు అమలు చేసాయి ఆ ప్రభుత్వాలు. "నిజానికి మన దేశంలో కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం, సముద్రతీరంలో ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు," అన్నారు కోస్తా పర్యావరణ అధ్యయన ఆచార్యులు డి ఇ బాబు. ఆ నిబంధనలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ సడలింపు ఉండదని ఆయన సాక్షి కి వివరించారు. అయితే నిషేధాలని పక్కనపెట్టి అక్రమార్కులు యథేచ్చగా చేపల చెరువులను తవ్వేస్తున్నారు, అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారు. పై-లీన్ ఉత్తర వాయువ్య దిశగా ఒడిషా వైపు వెళ్లిపోవడం వల్ల, నిలకడగా ఒక చోట నిలవకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు తప్పింది. లేకుంటే, తెలంగాణా జిల్లాలకి కూడా వాన దెబ్బ తగిలేదని, హైదరాబాదు వాతావరణ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. ఉష్ణ,సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు,పొదల సముదాయమే మడ అడవులు. ఆ తీరప్రాంతాల్లో, నదీ ముఖద్వారాలలో పరిశ్రమలు స్ధాపించడం, చేపల, రొయ్యల చెరువులు తవ్వడం తీవ్రమైన నేరాలు. వాటి వల్ల మడ అడవులను అంతరించకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే కాదు ప్రతీ ఒక్కరిమీద వుంది. -
వంశధారకు పోటెత్తిన వరద నీరు
శ్రీకాకుళం : వంశధారకు వరద నీరు పోటెత్తుతుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. కొత్తూరులో నివగాం, మదనాపురంలోని రహదారిపైకి వరదనీరు చేరింది. ఒడిశాలోని నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురియడంతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, బాహుదా, మహేంద్రతనయ నదుల్లో వరదనీరు పోటెత్తుతుంది. వంశధార గొట్టా బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి ప్రవాహం 53వేల క్యూసెక్కులకు చేరింది. అధికారులు బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడిచి పెట్టారు. ఇక పై-లీన్ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కకావికలమైంది. శనివారం రాత్రి వీచిన ప్రచండ గాలులకు ఒకరు మృతి చెందారు. సుమారు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఉద్యాన పంటలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మిగతా పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
జలదిగ్బంధంలో చెవ్వాకుల పేట
ఆముదాలవలస : శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చెవ్వాకుల గ్రామం వద్ద వంశధార పొంగి పొర్లుతోంది. దాంతో చెవ్వాకుల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు వంశధార వరద ఉధృతి పెరగటంతో 54వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా హీరమండలం వద్ద గొట్టా బ్యారెజ్ అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పై-లిన్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతింది. 20వేల ఎకరాల్లో కొబ్బరి తోటలకు నష్టం వాటిల్లింది, ఇక ఒడిశాలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురియడంతో వంశధార నదికి వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తూ కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల మరో 10 వేల క్యూసెక్కుల నీరు అదనంగా చేరవచ్చని, దీనివల్ల వరద ప్రమాదం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వంశధార నదీతీర వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. -
దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లు పునరుద్దరణ
విశాఖ : పై-లిన్ తుపాను కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ల పునరుద్దరణ పనులను రైల్వే అధికారులు సోమవారం ప్రారంభించారు. విశాఖ నుంచి భువనేశ్వర్, కోల్‌కతా రైలు మార్గంలో మరమ్మతులు చేపట్టారు. అలాగే ఈ మార్గంలో పరిమిత వేగంతో రైళ్లు నడపాలని నిర్ణయించారు. కాగా పై-లీన్ తుపాను ప్రభావం తగ్గడంతో కొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే నిన్న ప్రకటించింది. పలు స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపినట్లు తెలిపింది. హౌరా- పూరి మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించినట్లు పేర్కొంది. భువనేశ్వర్-రూర్కెలా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, పూరి- సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-న్యూఢిల్లీల మధ్య సంపర్క్‌క్రాంతి, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు నిన్న సాయంత్రం షెడ్యూల్ సమయం కన్నా ఆలస్యంగా భువనేశ్వర్ నుంచి బయల్దేరాయి. పూరి నుంచి బయల్దేరనున్న కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను షెడ్యూల్ ప్రకారమే నడిపిస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా బయల్దేరుతాయని పేర్కొంది. -
పారాదీప్ పోర్టుకు తీవ్రం నష్టం
భువనేశ్వర్ : ఒడిశాలో పారాదీప్ పోర్టు పై-లీన్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయింది. పోర్టుకు వచ్చే దారులపై చెట్లు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకూ అధికారులు 40వేల చెట్లను తొలగించారు. 10 కిలో మీటర్ల వరకు సీ ఛానల్ షిప్పులకు వీలుగాలేదని అధికారులు చెబుతున్నారు. సీ ఛానల్లో ఇంకా ఆరు మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి. తుపాను తాకిడి వల్ల పలువురు మత్స్యకారులు దారితప్పారు. పారాదీప్‌లో ఏపీకి చెందిన 8 బోట్లు, 80 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. పారాదీప్ ప్రాంతంలో 3వేల మట్టి ఇళ్లు కూలిపోయాయి. -
సీమాంధ్రలో మార్మోగుతున్న నినాదం
సాక్షి నెట్వర్క్: పైలీన్ తుపాను గడియల్లోనూ.. దసరా శరన్నవరాత్రి వేడుకల్లోనూ సీమాంధ్రలో ఒక్కటే నినాదం మార్మోగుతోంది. ‘సేవ్ సమైక్యాంధ్రప్రదేశ్’.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారీవర్షాలు కూడా లెక్కచేయక జనం రోడ్లపైకి సమైక్యనినాదాలు హోరెత్తించారు. ఇక అమ్మవారి నవరాత్రి వేడుకల్లో రాష్ర్టం ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేపట్టారు. వరుసగా 74వరోజైన శనివారం సమైక్యవాదులు వివిధరూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. శ్రీకాకుళం పాలకొండలో వర్షం కురుస్తున్నా ఎన్జీవోలు, ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించారు. బెలగాంలో దుర్గాదేవి అవతారంలో తెలుగుతల్లి సమైక్యాంధ్ర ద్రోహులపై ఆగ్రహంచినట్లు వినూత్న తరహాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన రైతు, మహిళ, కార్మిక గర్జనకు వేలాది మంది పోటెత్తారు. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా చైర్మన్ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథ్ మాట్లాడుతూ విభజనను అడ్డుకోకుండా పదవుల్లో కొనసాగుతూ డ్రామాలాడుతున్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో సమైక్య నినాదంతో విద్యార్థులు గర్జించారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, వైద్యసిబ్బంది ఓపీ సేవలు నిలిపేశారు. రైల్వేకోడూరులో విద్యార్థులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ మానవహారం, మైదుకూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. సమైక్య ద్రోహి ఎంపీ చింతామోహన్ అంటూ నినాదాల్ని హోరెత్తించారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్యోగ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో రహదారులను దిగ్భంధించి వంటావార్పు చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పత్తి మొక్కలతో రైతులు ఆందోళన చేపట్టారు. రేపల్లెలో రైతుగర్జన సభ నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి ఎన్జీఓ హోమ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడగడపకూ సమైక్యనినాదం పేరిట కార్యక్రమం నిర్వహించారు. సమైక్యాంధ్ర దళిత జేఏసీ కన్వీనర్ హత్య నెల్లూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర దళిత జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బిరదవోలు చిరంజీవి (35) దారుణహత్యకు గురయ్యారు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లకు చెందిన చిరంజీవి మృతదేహం గ్రామ సమీపంలోని కాలువలో ఉండగా పశువుల కాపర్లు గమనించారు. చిరంజీవి గొంతు, వీపుపై కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మృతుడి మోటారు సైకిల్ రోడ్డు పక్కనే ఉంది. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే చిరంజీవి సమైక్య ఉద్యమంలో భాగంగా దళిత జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ఆధారాలు సేకరించామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ చెప్పారు. తేరుకున్న విజయనగరం సాక్షి ప్రతినిధి, విజయనగరం: అల్లర్లతో అతలాకుతలమైన విజయనగరం తేరుకుంటోంది. ఇన్నాళ్లూ పగలూ రాత్రీ భయంతో ఇళ్లలో గడిపిన జనం ఇప్పుడిప్పుడే వీధుల్లోకి వస్తున్నారు. అధికారులు పగటి పూట కర్ఫ్యూను సడలించడంతో ప్రజలు సరుకులు కొనుక్కునేందుకు మార్కెట్ బాట పడుతున్నారు. దసరా, మరో వారంలో జరగనున్న పైడితల్లమ్మ పండుగలకు ఏర్పాట్లు చేసుకునే నిమిత్తం ప్రజలు కొనుగోలు బాట పట్టారు. దాదాపు రెండునెలల తరువాత పట్టణంలో సందడి నెలకొంది. కాగా, ఆదివారం ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
ప్రజలకు అండగా నిలవండి: జగన్
సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపాను ప్రమాదం ఉంటుందని భావిస్తున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులను వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శనివారం నిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం జగన్ ఇంటికి వచ్చిన వెంటనే పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి గురించి పార్టీ నేతలకు ఫోన్లు చేసి తెలుసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా తుపాను ప్రభావంపై వార్తల నేపథ్యంలో జగన్ పార్టీ శ్రేణులను సమాయత్తపరిచారు. సహాయ, పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయాలని, ప్రజలకు అండగా ఉండాలని సంబంధిత జిల్లాల పార్టీ ఇన్చార్జిలను ఆదేశించారు. ధర్మాన కృష్ణదాస్ (శ్రీకాకుళం), పెన్మత్స సాంబశివరాజు, సుజయ్‌కృష్ణ రంగారావు (విజయనగరం), కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖపట్టణం), టి.బాలరాజు (పశ్చిమగోదావరి), కుడిపూడి చిట్టెబ్బాయ్ (తూర్పు గోదావరి) తదితరులతో జగన్ మాట్లాడారు. పై-లీన్ ప్రభావిత జిల్లాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, నాయకులతో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా మాట్లాడారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుని అవసరమైన సాయాన్ని అందించాలని కోరారు. -
పై లీన్ పెను విధ్వంసం!
సంపాదకీయం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరప్రాంతాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రళయభీకర పై లీన్ తుపాను ఎట్టకేలకు శనివారం సాయంత్రం తీరాన్ని తాకింది. వస్తూనే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులనూ, కుండపోత వర్షాలనూ మోసుకొచ్చింది. గోపాల్పూర్నుంచి కళింగపట్నంవరకూ మహా వృక్షాలను, విద్యుత్ స్తంభాలనే కాదు... మనిషిని సైతం నిలబడనీయనంత స్థాయిలో పెనుగాలులు వీయడం మొదలైంది. తీరాన్ని తాకింది గనుక రానున్న 48 గంటలూ కోస్తా తీరంపొడవునా ఉన్న జనావాసాలకు పరీక్షా సమయమే. తుపాను బలహీనపడే వరకూ అది పయనించినంతమేరా కుండపోతగా వర్షాలుంటాయి. ఇప్పటికే తీరప్రాంత గ్రామాల్లో విద్యుత్ పంపిణీ నిలిచిపోయి అవి అంధకారంలో ఉన్నాయి. రవాణా సదుపాయాలూ ఆగిపోయాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో అయిదున్నర లక్షలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, భారీ నష్టం సంభవించే అవకాశం ఉన్నదని భావించిన ప్రాంతాల్లో సైన్యం, నావికాదళ సిబ్బంది, పారా మిలిటరీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. వారికి విమానాలు, హెలికాప్టర్లు, ఇతర రవాణా సదుపాయాలున్నాయి. విజ్ఞాన శాస్త్రాలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఈనాటికీ ప్రకృతి విపత్తులను నివారించడం మనిషికి అసాధ్యమవుతున్నది. చేయగలిగిందల్లా ఆ విపత్తుల స్థాయిని అంచనావేసుకుని, అది తెచ్చే నష్టాన్ని కనిష్ట స్థాయికి కుదించడమే. ముఖ్యంగా ఆస్తి నష్టాన్ని నివారించడం సాధ్యంకాకపోయినా ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని రకాల చర్యలూ తీసుకోవాల్సి ఉంటుంది. గత 24 ఏళ్లలో ఇంత భారీయెత్తున తుపాను విరుచుకుపడటం ఇదే ప్రథమమని వాతావరణ విభాగం చెబుతున్నది. తరచుగా బంగాళాఖాతం అల్లకల్లోలం కావడం, వాయుగుండాలు, తుపానులు చెలరేగడం...పర్యవసానంగా వరదలు సంభవించడం కొత్తేమీ కాదు. 36ఏళ్లక్రితం దివిసీమను ముంచెత్తిన ఉప్పెన ఎంత నష్టాన్ని మిగిల్చిందో ఇంకా జనం జ్ఞాపకాల్లో పచ్చిగానే ఉంది. తీరందాటి విరుచుకుపడిన రాకాసి అలలు అప్పుడు 10,000మందికి పైగా పౌరులను పొట్టనబెట్టుకున్నాయి. మనకున్న వెయ్యి కిలోమీటర్లకుపైగా తీరప్రాంతం తరచువచ్చే తుపానుల కారణంగా ముంపునకు గురవుతోంది. పదేళ్లక్రితం వరకూ ఏడాదికి ఒక్కసారి వచ్చే తుపానులు ఇప్పుడు ఏటా కనీసం రెండు, మూడుసార్లయినా పలకరిస్తున్నాయి. వచ్చిన ప్రతిసారీ లోతట్టు ప్రాంతాలను వరదలతో ముంచెత్తి, పంటలకు సైతం భారీగా నష్టాన్ని తెస్తున్నాయి. కోస్తా జనజీవితాల్లో భాగంగా మారిపోయిన ఈ వాయుగుండాలు, తుపానులనుంచి ప్రభుత్వాలు నేర్చుకున్నదేమిటి? క్షేత్రస్థాయిలోని వాస్తవాలను పరిశీలిస్తే అందులో చాలా వెనకబడే ఉన్నామని అర్ధమవుతుంది. ఇప్పుడు పెను నష్టం సంభవించనున్న శ్రీకాకుళం సంగతే తీసుకుంటే...అక్కడున్న తుపాను షెల్టర్లలో చాలా భాగం పనిచేయడం లేదు. ఎన్నడో 1982లో ఆ జిల్లాలోని దిబ్బలపాలెంలో నిర్మించిన తుఫాను షెల్టరు బీటలువారి శిథిలప్రాయమైంది. అక్కడనేమిటి? తీరప్రాంతంలో ఉన్న తుఫాను షెల్టర్లన్నీ ఇలాంటి దుస్థితిలోనే ఉన్నాయి. ఒకచోటైతే శిథిలమైన షెల్టర్‌ను కూల్చి మెరైన్ పోలీస్ స్టేషన్ కోసం కొత్త భవనాన్ని నిర్మించారు. కొన్ని షెల్టర్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. అంటే ఆపత్కాలంలో తలదాచుకోవడానికి ప్రజలకు ఎలాంటి సురక్షిత భవనమూ లేదన్నమాట. తుపాను షెల్టర్ల పరిస్థితి ఇలావుంటే... తాత్కాలిక సహాయ శిబిరాలుగా మారిన పాఠశాలలకు తరలించిన ప్రజలు గొంతు తడుపుకొనడానికి మంచినీళ్లు కూడా లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఇక తిండి సంగతి చెప్పేదేముంది? ఈ శిబిరాల్లో తలదాచుకున్నవారు చానెళ్లకు చెబుతున్న కథనాలు వింటుంటే హృదయవిదారకంగా ఉంటున్నాయి. విపత్తులు మనకు కొత్త కాకపోయినా సహాయ చర్యల విషయానికొచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం ఇలా అనుభవలేమిని ఎందుకు ప్రదర్శిస్తుందో అనూహ్యం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పర్యవేక్షించడానికి మనకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉంది. పైలిన్ తుపాను వచ్చాక అది ఆ పనిలో నిమగ్నమై ఉన్నది. అయితే, సాధారణ సమయాల్లో ఆ సంస్థ చేయాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తుపాను షెల్టర్ల స్థితి ఎలా ఉన్నదో చూసి అవసరమైన మరమ్మతులు చేయించడం... అదనంగా ఎక్కడెక్కడ షెల్టర్లు నిర్మించవలసి ఉన్నదో అంచనావేసుకోవడం... మత్స్యకార గ్రామాలకు రవాణా సదుపాయాలెలా ఉన్నాయో చూసి, అవసరమైన మార్పులను సూచించడం...రహదారులు సరిగా లేనిచోట వాటిని నిర్మించడంలాంటి పనులను చేపడితే ప్రాణ నష్టాన్ని నివారించడం సులభమవుతుంది. జపాన్‌లో భూకంపాల గురించి నిర్ణీత కాల వ్యవధిలో తరచుగా అవగాహన కలిగించే కార్యక్రమాలున్నట్టు... ఈ తుపానుల గురించి, అవి తలెత్తినప్పుడు అందుబాటులో ఉంచుకోవాల్సిన సహాయసంపత్తి గురించి, ఉండాల్సిన సంసిద్ధత గురించి తరచుగా తెలియజెబితే ఇంత గందరగోళ పరిస్థితులు తలెత్తవు. పౌరులు సహాయ శిబిరాల్లో ఆకలితో హాహాకారాలు చేసే దుస్థితి ఏర్పడదు. మూడేళ్లక్రితం లైలా తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించినప్పుడూ, ఏడాదిక్రితం నీలమ్ తుపాను విరుచుకుపడినప్పుడూ సహాయచర్యలపరంగా బయటపడిన వైఫల్యాలే ఇప్పుడూ ఎదురవుతుంటే ఇక ప్రభుత్వాలు ఉండి ఎందుకు? విపత్తులు సంభవించినప్పుడు సాయం చేయడానికి రంగంలోకి దూకడమే కాదు...ఆ కృషిలో ఎదురైన అనుభవాలను సమీక్షించుకుని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ క్రమంలో తలెత్తిన పొరపాట్లను పరిహరించుకోవచ్చునో మదింపు వేసుకుంటే భవిష్యత్తు ఇబ్బందులను ఎదుర్కోవడం సులభమవుతుంది. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలి.