పై-లీన్ విపత్తులో మన నేరమెంత?
పై-లీన్ విపత్తులో మన నేరమెంత?
Published Mon, Oct 14 2013 4:05 PM | Last Updated on Fri, Sep 1 2017 11:39 PM
పై-లీన్ తుపాను గండం దాటిపోయిందంటూ 'హమ్మయ్య' అని ఈ నిట్టూర్పు విడిచేసి, చేతులు దులిపేసుకుంటే అంతకి మించి నేరం మరొకటి లేదంటున్నారు నిపుణులు. లక్షలాది ఇళ్లు నేలమట్టం చేసి, లక్షల కుటుంబాలకీ నిలవ నీడ లేకుండా చేసి, రవాణా, ప్రసార వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి, వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన పై-లీన్ విషయంలో హమ్మయ్య అనుకోవలసిందేమైనా ఉందంటే అది ప్రాణనష్టాన్ని నివారించచడం ఒక్కటే. 1999 ఒడిశా పెను తుపాను తర్వాత, ఈ 14 ఏళ్లలో అతి పెద్ద తుపాను పై-లీన్ అని వాతావరణ శాఖ ప్రకటించింది.
రగులుతున్న రాజకీయ వర్తమానం నుంచి, సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా అనుకున్నాయో, లేదా వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల ఫలితమో గానీ, ప్రభుత్వాలు ముందెన్నడూ లేనంత భారీ ఎత్తున లక్షలాది మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాయి. చనిపోయిన వారి సంఖ్య 25 (మాత్రమే) కావడం కూడా 'హమయ్య' అనుకునే వెసులుబాటు ఇచ్చింది. కానీ, ఎన్ని సార్లైనా, చేతులు కాలాక మాత్రమే ఆకులు పట్టుకుంటున్న ఈ నిర్లక్ష్యం ఉపేక్షించరానిది.
ప్రచండ పై-లీన్ ప్రతాపం
పెనుగాలులు, కుండపోత వర్షం, గట్లు తెగిన నదులు, పోటెత్తి జనవాసాల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం. నేలమట్టమైన ఇళ్లు, కొట్టుకుపోయిన పంటలు, కుప్పకూలిన కొబ్బరి చెట్లు, తెప్పలా తేలిన జీడిమామిడి చెట్లు, ఆచూకీలేని అరటి తోటలు.. అంతా కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిన విషాదం. ప్రాథమిక అంచనా ప్రకారం.. మన రాష్ట్రం వరకూ 6000 హెక్టార్లలో అరటి, జీడి, మొక్కజొన్న, కొబ్బరి, , చెరకు పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో కొబ్బరి విస్తీర్ణం అధిక శాతం కనుక, బాధిత రైతుల్లో 90 శాతం కొబ్బరి రైతులే! ఇది కాకుండా, కేవలం ఆరు మండలాల్లోనే 8000 హెక్టార్లలో వరి నాశనమైంది. ఇందులో పొట్ట దశకు వచ్చి పాడైన పంట 3500 హెక్టార్లలో ఉంది. లక్షలాది టేకు చెట్లు వెన్ను విరిగి కూలాయి. గాలులు గంటకి 230 కిలో మీటర్ల వేగంతో వీచాయి, దానితో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వంగిపోయిన విద్యుత్ స్థంభాలు ఎన్నో. పశువులు, సైబేరియా నుంచి వచ్చిన వలస పక్షులు ఎన్ని చనిపోయాయో లెక్కకి తేలదు. కుండపోత వర్షాలకి వరదలెత్తిన నదులు గ్రామాలకి గ్రామాల్నే ముంచెత్తాయి. 150 ఎకరాల్లో రొయ్యల చెరువులు దెబ్బ తిన్నాయి.
మానవ తప్పిదమెంత?
ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డుకోలేక పోయినా, ఆ తీవ్రతని తగ్గించే ప్రత్యామ్నాయాల్ని చేజేతులా నాశనం చేసుకోవడం వల్లే తుపానులు, ఉప్పెనల్లో భారీ నష్టం జరుగుతుంది.
"ఏ ట్రాపికల్ సైక్లోన్ (ఉష్ణమండలాల్లో వచ్చే తుపానులు) పరిణామాలైనా మూడు- ఒకటి పెనుగాలులు, రెండు కుంభవృష్టి, మూడు ఉప్పెన (లేదా సునామి). ఈ మూడు వైపరీత్యాల తీవ్రతని 40 శాతం వరకూ తగ్గించే రక్షణ కవచాలు మడ చెట్లు. సముద్రం ఒడ్డున పెరిగే ఈ అడవుల్ని కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం అడ్డగోలుగా నరికేస్తుంటే పట్టించుకునే నాథులే లేరు," అని వాపోయారు ఆంధ్రా యూనివర్సిటీ ఓషనోగ్రఫీ విభాగం విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ ఓఎస్‌ఆర్‌యు భానుకుమార్.
సోమవారం సాక్షితో మాట్లాడుతూ, మడ అడవుల్ని సంరక్షించుకోగలిగినట్టైతే పై-లీన్ తుపాను నష్టం ఎంతో నివారించబడేదని ఆయన అన్నారు.
"ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మడ అడవులు గోడలా నిలిచి మానవాళికి రక్షణ కల్పిస్తున్నాయి. తీరం కోతకు గురవకుండా ఇవి కాపాడతాయి. సునామీ సమయాల్లో సముద్రపు నీరు నేరుగా లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇలవమడ, నల్లమడ, గుగ్గిలం తెల్లమడ ఈల్వమడతోపాటు మొత్తం 35 రకాల చెట్లు ఈ అడవుల్లో కనిపిస్తాయి. ఇవి రెండు నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు ఎదిగి తీరంలో రక్షణ కవచంగా నిర్మిస్తాయి," అని ఆయన చెప్పారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ మడ చెట్ల పెంపకం గురించి ఒక కొత్త పథకాన్ని రూపొందించారని ఆయన తెలిపారు.
మడ చెట్లు రక్షణ కవచమే కాకుండా, చేపల పునరుత్పత్తికి దోహదపడతాయనీ, దాని వల్ల దేశ సముద్ర ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని మరో వాతావరణ అధ్యయన నిపుణులు అచ్యుతరావు తెలిపారు.
అయితే, కొందరు స్వార్థపరులు మడ అడవులను నరికేస్తూ, చేపల చెరువులు, రొయ్యల చెరువులు తవ్వుతున్నారు; దానికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకు తున్నారు. ఎంతో విలువైన వృక్ష సంపద వంట చెరకుగా మారిపోతోంది. మడ అడవులు తరిగిపోతూ తీర్రపాంతంలో భూమి కోతకు గురికావడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి దుష్పరిణామాలతో పాటు, ప్రకృతి విలయానికి వేల కోట్లలో నష్టం కలుగుతోంది. దానికి ప్రాణనష్టం కూడా తోడైతే ఏ గణాంకాలు ఆ తీవ్రతని అంచనా వేయగలవు?
అందరి సమష్టి బాధ్యత
సముద్ర తీర ప్రాంతాల్లో మాంగ్రోవ్ అని పిలవబడే మడ అడవుల పెంపకం అమెరికా వంటి దేశాల్లో విధిగా ఆచరిస్తారు. వాటిని నరికివేయడం పెద్ద నేరం. దానికి కఠినమైన శిక్షలు అమలు చేసాయి ఆ ప్రభుత్వాలు. "నిజానికి మన దేశంలో కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం, సముద్రతీరంలో ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు," అన్నారు కోస్తా పర్యావరణ అధ్యయన ఆచార్యులు డి ఇ బాబు.
ఆ నిబంధనలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ సడలింపు ఉండదని ఆయన సాక్షి కి వివరించారు.
అయితే నిషేధాలని పక్కనపెట్టి అక్రమార్కులు యథేచ్చగా చేపల చెరువులను తవ్వేస్తున్నారు, అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారు.
పై-లీన్ ఉత్తర వాయువ్య దిశగా ఒడిషా వైపు వెళ్లిపోవడం వల్ల, నిలకడగా ఒక చోట నిలవకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు తప్పింది. లేకుంటే, తెలంగాణా జిల్లాలకి కూడా వాన దెబ్బ తగిలేదని, హైదరాబాదు వాతావరణ శాఖ అధికారి నరసింహారావు అన్నారు.
ఉష్ణ,సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు,పొదల సముదాయమే మడ అడవులు. ఆ తీరప్రాంతాల్లో, నదీ ముఖద్వారాలలో పరిశ్రమలు స్ధాపించడం, చేపల, రొయ్యల చెరువులు తవ్వడం తీవ్రమైన నేరాలు. వాటి వల్ల మడ అడవులను అంతరించకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే కాదు ప్రతీ ఒక్కరిమీద వుంది.
Advertisement