పచ్చదనంపై తుపాను పంజా
భువనేశ్వర్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ఒడిశాకు పెను నష్టాన్ని మిగిల్చింది. దీని దెబ్బకు రాష్ట్రంలో కనీసం 26 లక్షల చెట్లు నేలకూలినట్టు తేలింది. తుపాను దెబ్బకు రాష్ట్రంలో చాలా అటవీ ప్రాంతాల్లో ఇంకా అడుగుపెట్టలేని పరిస్థితి ఉందని, వాటిని కూడా పరిశీలిస్తే వృక్ష నష్టం మరెంతో ఎక్కువగా ఉండవచ్చని అటవీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గంజాం, గజపతి జిల్లాల్లో ఈ నష్టం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని పూడ్చుకోవడానికి చాలా ఏళ్లు పడుతుందని అధికారులన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్టు అటవీ మంత్రి బిజయ్‌శ్రీ చెప్పారు.
గత 14 ఏళ్లలో భారత తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసిన అత్యంత శక్తివంతమైన తుపానుగా పై-లీన్ నిలిచింది. 1999 సూపర్ సైక్లోన్ సైతం ఒడిశాలోని లక్షల చెట్లను నేలకూల్చింది. ఇక పై-లీన్ వల్ల ఒడిశాకు కనీసం రూ.4,242 కోట్ల మేరకు నష్టం సంభవించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి ఈ మేరకు నివేదించింది. ఇందులో ఒక్క గంజాం జిల్లాలోనే ఏకంగా రూ.1,550 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు వివరించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గోస్వామి ఆదివారం పర్యటించారు. గంజాం జిల్లాను ప్రత్యక్షంగా పరిశీలించారు. పై-లీన్ నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు, మూడు రోజుల్లో మంత్రుల బృందం ఏర్పాటవుతుందని, ప్రభావిత ప్రాంతాలను అది పరిశీలిస్తుందని తెలిపారు.
వేగంగా పెరిగే చెట్లే ఎక్కువ కూలాయి!
వేగంగా పెరుగుతాయన్న భావంతో పెంచిన స్థానికేతర జాతుల చెట్లే తుపాను గాలుల ధాటికి ఎక్కువగా కూలాయని నిపుణులు చెప్పారు. యూకలిప్టస్, గుల్‌మొహర్ వంటి మెతక జాతుల చెట్లు ఎక్కువగా నాశనమయ్యాయి. దృఢమైన చింత, మామిడి, వేప, జామ, మర్రి మొక్కలను నాటితే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
మొబైల్స్, రేడియోలే ప్రాణదాతలు
పూరీ (ఒడిశా): అక్టోబర్ 12న ఒడిశాలో పెను విధ్వంసం సృష్టించిన పై-లీన్ తుపాను బారి నుంచి పలువురిని కాపాడటంలో రేడియోలు, మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషించాయి. పై-లీన్ దెబ్బకు వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం మాత్రం కేవలం 44కు పరిమితమవడంలో వాటి పాత్ర చాలా ఉంది. తుపా ను సమీపిస్తున్న విషయాన్ని రేడియోలో వినడం వల్లే తాను, తన కుటుంబం బతికి బయట పడ్డామని గజేంద్ర జనా (55) చెప్పారు. రేడియోలో ప్రత్యేక తుపాను హెచ్చరికలను వినగానే వీలైనన్ని నిత్యావసరాలను వెంటబెట్టుకుని ఆయన కుటుంబమంతా సమీపంలోని తుపాను షెల్టర్‌కు చేరుకుంది. ఆ వెంటనే విరుచుకుపడ్డ తుపాను ఆయన ఇంటిని నేలమట్టం చేసింది. అధికారులు కూడా మొబైల్ ఫోన్లను వీలైనంత విరివిగా వాడటం ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అత్యధికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. రేడియో, మొబైల్స్ లేకుండా ఇది సాధ్యపడేది కాదని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. తుపాను హెచ్చరికల అనంతరం రాష్ట్రంలో రేడియోల అమ్మకాలు కూడా బాగా పుంజుకోవడం విశేషం!
బాధితులకు సైకత శిల్పి బాసట
పై-లీన్ బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ముందుకొచ్చారు. కాన్వాస్‌పై తాను సృజించిన పలు సైకత మూర్తులను విక్రయించి, తద్వారా వచ్చే మొత్తాన్ని బాధితులకు అందజేస్తానని ప్రకటించారు.