ఆరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన: రఘువీరారెడ్డి
తుపాను నష్టాలను పరిశీలించేందుకు రాక...
కేంద్ర బృందానికి తక్షణమే నివేదికలివ్వాలి: మంత్రి రఘువీరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆరు జిల్లాల్లో పైలీన్ తుపాను, భారీ వర్షాలవల్ల కలిగిన నష్టాలను కేంద్ర బృందానికి చూపించాలని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి నిర్ణయించారు. తుపాను, వరద నష్టాలను పరిశీలించేందుకు ఈనెల 17న కేంద్ర బృందాలు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో వీటిని ఏఏ జిల్లాలకు పంపించాలనే అంశంపై ఉన్నతాధికారులతో రఘువీరారెడ్డి బుధవారం సమీక్షించారు. కేంద్ర బృందాలు పర్యటించే జిల్లాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టాలపై ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఆ బృందానికి సమర్పించేందుకు నష్టాల నివేదికలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. 17న హైదరాబాద్ చేరుకునే కేంద్ర బృందం సభ్యులు 18న ఉదయం లేక్‌వ్యూ అతిథి గృహంలో ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. తర్వాత వీరు మూడు బృందాలుగా విడిపోతారు. ఒక బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం; రెండో బృందం గుంటూరు, ప్రకాశం; మూడో బృందం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పర్యటనకు అదేరోజు మధ్యాహ్నం వెళతాయి. తర్వాత ఈ మూడు బృందాలు 20వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటాయి. 21వ తేదీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశమవుతుంది.