ప్రజలకు అండగా నిలవండి: జగన్
సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపాను ప్రమాదం ఉంటుందని భావిస్తున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులను వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం నిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం జగన్ ఇంటికి వచ్చిన వెంటనే పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి గురించి పార్టీ నేతలకు ఫోన్లు చేసి తెలుసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా తుపాను ప్రభావంపై వార్తల నేపథ్యంలో జగన్ పార్టీ శ్రేణులను సమాయత్తపరిచారు.
సహాయ, పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయాలని, ప్రజలకు అండగా ఉండాలని సంబంధిత జిల్లాల పార్టీ ఇన్‌చార్జిలను ఆదేశించారు. ధర్మాన కృష్ణదాస్ (శ్రీకాకుళం), పెన్మత్స సాంబశివరాజు, సుజయ్‌కృష్ణ రంగారావు (విజయనగరం), కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖపట్టణం), టి.బాలరాజు (పశ్చిమగోదావరి), కుడిపూడి చిట్టెబ్బాయ్ (తూర్పు గోదావరి) తదితరులతో జగన్ మాట్లాడారు. పై-లీన్ ప్రభావిత జిల్లాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, నాయకులతో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా మాట్లాడారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుని అవసరమైన సాయాన్ని అందించాలని కోరారు.