తుపాను నష్టం ఆపారం | Phailin cyclone destroyed paddy crops | Sakshi
Sakshi News home page

తుపాను నష్టం ఆపారం

Published Wed, Oct 16 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

తుపాను నష్టం ఆపారం

తుపాను నష్టం ఆపారం

ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను సృష్టించిన విలయంతో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు విలవిల్లాడుతున్నాయి. వందల కోట్ల పంట, ఆస్తి నష్టం వాటిల్లింది. ఉద్దానం జీవనాధారమైన కొబ్బరి, జీడి తోటలు ధ్వంసమయ్యాయి. రైతులు, మత్స్యకారులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు.. ఇలా అన్ని వర్గాలవారు తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయారు. మంత్రులు రఘువీరారెడ్డి, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీమోహన్, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తదితరులు తుపాను ప్రాంతాల్లో నామమాత్రంగా పర్యటించి, మొసలి కన్నీరు కార్చి వెళ్లిపోయారే తప్ప సహాయ చర్యలు ఎలా అమలవుతున్నాయన్న విషయాన్ని అసలు పట్టించుకోలేదు. సహాయం గురించి ముఖ్యమంత్రి వైపు నుంచి ఇంతవరకు కనీస ప్రకటన లేకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 కుదేలైన కొబ్బరి రైతు
 రెండు నియోజకవర్గాల్లో విస్తరించిన ఉద్దానం ప్రాంతంలో 9 వేల హెక్టార్లకు పైగా కొబ్బరి పంట ఉండగా 3,500కు పైగా హెక్టార్లల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా. కొబ్బరి రైతులు రూ.450 కోట్ల మేర నష్టపోయారు. పదేళ్లయినా కొబ్బరి రైతు తేరుకోలేడని, నష్టం అంత తీవ్రంగా ఉందని కొబ్బరి బోర్డు సీనియర్ కన్సల్టెంట్ జోహార్‌ఖాన్ చెప్పారు. కొబ్బరితోపాటు అంతర పంటలైన జీడి, మామిడి, అరటి తోటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వీటి నష్టం మరో రూ.100 కోట్ల వరకు ఉంటుంది. 400 హెక్టార్లలో కాయగూరలు, వందల హెక్టార్లలో వేసిన పనస, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వరి, ఇతర పంటలు సాగు చేస్తున్న సుమారు 15 వేల ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. దాదాపు వంద ఎకరాల్లో వేసిన టేకు చెట్లు కూడా కూలిపోయాయి.
 
 కోట్ల విలువైన బోట్లు, వలల ధ్వంసం
 వందల సంఖ్యలో విలువైన బోట్లు, వలలు కొట్టుకుపోవడమో, పాడైపోవడమో జరిగి, మత్స్యకారులు పది కోట్ల రూపాయలకుపైనే నష్టపోయివుంటారని అంచనా. దాచుకున్న చేపలను సైతం సముద్రం లాగేసుకోవడంతో మరో కోటి రూపాయలకు పైగానే నష్టం వాటిల్లింది. సుమారు 20 రొయ్యల చెరువులు కూడా ధ్వంసమయ్యాయి. సుమారు 3వేలకు పైగా ఇళ్లు పూర్తిగానో, పాక్షికంగానో  దెబ్బతినగా 400 ఇళ్ల లెక్కే చూపిస్తున్నారు.
 
 జల దిగ్బంధంలో 3 గ్రామాలు
 ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇప్పటికీ మూడు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇచ్ఛాపురం మండలంలోని ఇన్నీసుపేట, బొడ్డబడ, కవిటి మండలంలోని ఒంటూరు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. బాహుదా నది వరద కారణంగా బొడ్డబడ గ్రామానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఒంటూరు గ్రామస్తులు సరైన ఆహారం, పారిశుద్ధ్యం లేక అనారోగ్యం పాలవుతున్నారు.
 
 విద్యుత్ పునరుద్ధరణ చర్యలు ముమ్మరం
 విశాఖపట్నం: పై-లీన్ తుపాను నష్ట నివారణకు ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్) చర్యలు చేపట్టింది. ఉత్తరాంధ్ర జిల్లా పరిధిలోని 33/11 కేవీ సామర్థ్యమున్న 81 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. 1010 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్టు లెక్కతేల్చారు. అయితే నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న దానిపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, పలాస, వజ్రపుకొత్తూరు పరిధిలో బాగా నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్తున్నారు. టెక్కలి డివిజన్లో ప్రస్తుతం 33/11 కేవీ సామర్థ్యమున్న 34 సబ్‌స్టేషన్లను ప్రస్తుతం పునరుద్ధరించారు. 11 కేవీ ఫీడర్లు, ఎల్‌టీ లైన్ల పునరుద్ధరణకు మరో రెండు రోజులు పడుతుందని చెప్తున్నారు. దీంతో సుమారు 270 గ్రామాలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ చేస్తామని చెప్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్స్ విభాగంలో అనుభవమున్న సీనియర్ ఇంజనీరు, ఈపీడీసీఎల్ జనరల్ మేనేజర్(ప్రాజెక్ట్సు) పి.వి.వి.సత్యనారాయణను పర్యవేక్షక ఇంజనీరు(ఎస్‌ఈ)గా సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 విద్యుత్తు పునరుద్ధరణకు ఆదేశాలు
 తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణ, ఇతర సహాయ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను వల్ల నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ, మంచినీటి సరఫరా పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపానులో దెబ్బతిన్న 112 (33/11) సబ్‌స్టేషన్లలో 111 సబ్‌స్టేషన్లకు మరమ్మతులు పూర్తి చేశామని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 323 దెబ్బతినగా 295 మరమ్మతులు చేశామని వివరించారు. 2,061 గ్రామాలకు విద్యుత్తు సరఫరా దెబ్బతినగా 1,811 గ్రామాలకు పునరుద్ధరించామని తెలిపారు. రహదారులు పునరుద్ధరించామని, బావుల్లో కలుషితమైన నీటిని శుద్ధి చేశామని సంబంధిత శాఖల అధికారులు తెలియజేశారు.  
 
 పొంచి ఉన్న మరో ముప్పు?
 సాక్షి, విశాఖపట్నం: పై-లీన్ తుపాను తీరం దాటిపోవడంతో అన్నివర్గాలూ ఊపిరిపీల్చుకున్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్ ప్రాంతంలో అల్పపీడన ం ఏర్పడడం, ఇది కాస్త బలపడే అవకాశం ఉండడంతో మరో తుపాను ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. అండమాన్ నికోబార్ ప్రాంతం నుంచి బంగ్లాదేశ్/థాయ్‌లాండ్ ప్రాంతాల మీదుగా బంగాళాఖాతం వైపు గాలులు వీస్తుండడంతో నాలుగైదు రోజుల్లో ప్రభావం కనిపించవచ్చనే ప్రచారం ఊపందుకుంది. తూర్పు తీరంపై తుపాను ప్రభావం ఉంటుందనే విషయమై.. ఇది వాస్తవం కాదని, ప్రస్తుత వాతావరణం.. కొన్ని చోట్ల వర్షాలు పడేందుకే కారణమవుతోంది తప్పితే తుపాను అవకాశాలేవీ లేవని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు స్పష్టం చేశారు.
 
 కాగా,  ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అయితే ఇది కాస్త బలహీనంగానే ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పై-లీన్ తుపాను జార్ఖండ్ ప్రాంతంలో పూర్తిస్థాయిలో బలహీనపడిపోయిందని, దీని ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టేనని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రంలోపు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement