నేలమట్టం అయిన గోకార్టింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్
తగరపువలస/కొమ్మాది(భీవిులి): విశాఖ జిల్లా మంగమారిపేటలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జెడ్) నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గోకార్టింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్‌పై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) అధికారులు కొరడా ఝుళిపించారు. డిప్యూటీ సిటీ ప్లానర్ డి.రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం గోకార్టింగ్ సెంటర్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. జేసీబీతో గోడలు, హట్‌లు, కంటైనర్ రెస్టారెంట్‌లను నేలమట్టం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడైన కాశీవిశ్వనాథ్, అతని కుటుంబ సభ్యులు మెస్సర్స్ కాశీ ఎంటర్‌ప్రైజెస్ అండ్ రిసార్ట్స్ పేరుతో 2014లో కాపులుప్పాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 299/1, 302/1సీ, 302/5సీలో ఉన్న 5.05 ఎకరాల్లో గోకారి్టంగ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఇందుకు అప్పట్లో కె.నగరపాలెం పంచాయతీ అనుమతి తీసుకున్నారు. ఇక్కడ కార్ రేసింగ్, స్పోర్ట్స్ క్లబ్, రెస్టారెంట్ తదితరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన 0.44 ఎకరాల స్థలాన్ని కూడా ఆక్రమించారు. అయితే భీమిలి మండలంలోని ఐదు తీరప్రాంత పంచాయతీల్లో ఒకటైన కె.నగరపాలెం జీవీఎంసీలో విలీనమయ్యింది. గోకార్టింగ్ సెంటర్‌ను నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినందున విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్వాహకులకు ఏడాది కాలంలో 2సార్లు నోటీసులిచ్చారు. అయినా వారి నుంచి స్పందన రాలేదు.
మరోవైపు ఇక్కడ జూదానికి సంబంధించిన కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా, సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘనతో పాటు ప్రభుత్వ భూమి ఆక్రమణ, సరైన అనుమతులు లేకపోవడం వల్ల చట్టప్రకారం నిర్మాణాలు తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సాగర తీరంలోని నిర్మాణాలకు అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ అవి లేకపోయినా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment