పల్లా శ్రీనివాసరావు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని విశాఖ మహానగర పాలకసంస్థ (జీవీఎంసీ) అధికారులు ఆదివారం కూల్చివేశారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆక్రమణలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాత గాజువాక జంక్షన్‌లోని 1,033 చదరపు గజాల స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణానికి నిబంధనల ప్రకారం మినహాయింపులు పోను 221.45 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జీ+4 భవన నిర్మాణానికి అనుమతి పొందిన ఆయన ప్రస్తుతం సెల్లార్+జీ+1 అంతస్తులకు శ్లాబులను పూర్తిచేశారు.
అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం సాగుతుండటంతో.. పరిశీలించిన అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మాస్టర్‌ప్లాన్ రోడ్డును సైతం ఆక్రమించి ఎలాంటి సెట్‌బ్యాక్‌లు లేకుండా అడ్డగోలుగా కడుతున్నట్లు నిర్ధారించారు. ఆదివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాల్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు కాసేపు హడావుడి చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పల్లా అక్కడ నుంచి నిష్క్రమించారు. దీంతో అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు.
ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
మరోవైపు..నగరంలోని ఫుట్‌పాత్‌లన్నింటినీ టీడీపీ నేతలు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. ‘రైట్ టు వాక్’ పేరుతో తొలగింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న 305 దుకాణాలు తొలగించారు. బీచ్‌రోడ్డులో అడ్డగోలుగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఏర్పాటు చేసిన 70 దుకాణాల్ని జీవీఎంసీ అధికారులు ఆదివారం తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment