ఇప్పట్లో నిర్మాణాల కూల్చివేతలు వద్దని ప్రభుత్వ నిర్ణయం
వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడంపై హైడ్రా దృష్టి
ఆలోగా చెరువుల సర్వే పూర్తి చేయాలని సర్కారు ఆదేశం
సుమారు మూడు నెలల పాటు ఈ కసరత్తు కొనసాగే చాన్స్
సాక్షి, హైదరాబాద్: వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కలకలం రేపిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలి పరిణామాలు, సంస్థాగత లోపాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం 3 నెలలపాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని సూచించింది. దీనితో హైడ్రా తమ విభాగం అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువులు, కుంటలపై విస్తృత సర్వే చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలతో..
చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే.. జీహెచ్‌ఎంసీ అధీనంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ‘విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం)’రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు.
తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఓఆర్‌ఆర్ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు.
విరామానికి కారణాలెన్నో..
హైడ్రా ప్రభావంతో రాష్ట్రంలో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు పడిపోయాయి. మరో వైపు అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
నది వెంట ఇళ్ల సర్వే, ఖాళీ చేయించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టింది. మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేకపోయినా.. రెండింటి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
‘హైడ్రా’వ్యవస్థ నిర్మాణంపై ఫోకస్
కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఇటీవలే వివిధ విభాగాల నుంచి 169 మందిని డిప్యూటేషన్‌పై నియమించారు. కానీ పోలీసు విభాగం నుంచి వచ్చిన 20 మంది మినహా మరే ఇతర విభాగాల సిబ్బంది హైడ్రా విధుల్లో చేరలేదు.
మరోవైపు హైడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపుతూ కొందరు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వారిని రిలీవ్ చేయడానికి పలువురు శాఖాధిపతులు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైడ్రా వినియోగిస్తున్న కార్యాలయంతోపాటు సిబ్బందిలో దాదాపు అంతా జీహెచ్‌ఎంసీకి సంబంధించిన వారే. ఈ విషయంలో అటు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు, ఇటు హైడ్రాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత అంశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు.
జల వనరుల ‘లెక్క’తేల్చేలా..
జల వనరుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయా చెరువులు, వాటి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడాన్ని ఇటీవల న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. దీనికోసం రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలతోపాటు హెచ్‌ఎండీఏ ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
తొలుత ప్రాథమిక, ఆపై తుది నోటిఫికేషన్లు జారీ చేయాలి. హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లో కలిపి 2,688 జలవనరులు ఉన్నాయి. వీటిలో 2,364 ప్రిలిమినరీ నోటిఫికేషన్ స్థితి దాటగా, 324 మాత్రమే తుది నోటిఫికేషన్ దాకా వెళ్లాయి. 95 చెరువులకు హైడ్రా ఏర్పడిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో అన్ని చెరువుల సర్వే పూర్తి చేసి, తుది నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment