గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఏంటో? | Ganta Srinivasa Rao Confusing On Constituency Change Ahead Of Assembly Elections In AP - Sakshi
Sakshi News home page

గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఏంటో?

Published Mon, Jan 15 2024 9:26 PM | Last Updated on Fri, Feb 2 2024 6:57 PM

Ganta Srinivasa Rao Confusing On Constituency Change - Sakshi

ప్రతీ ఎన్నికలోనూ పార్టీనీ నియోజక వర్గాన్నీ మారుస్తూ  పోయే అరుదైన రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు ఈ సారి మారడానికి నియోజక వర్గం దొరకడం లేదు. ఉన్న నియోజక వర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న గంటా గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన నియోజక వర్గానికే బదలీ అవుదామని అనుకుంటోన్నా అక్కడి టిడిపి-జనసేన నేతలు గంటాకు టికెట్ ఇవ్వనే ఇవ్వద్దని తెగేసి చెబుతున్నారు. దీంతో గంటాకు రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్ధం కావడం లేదు.

చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న నారాయణ కాలేజీల అధినేత నారాయణకు వియ్యంకుడు అయిన విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజక వర్గం దొరికేలా కనిపించడం లేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నియోజక వర్గాలను సామాజిక సమీకరణలకోసం మారిస్తే.. ఎమ్మెల్యేలను కూడా బదలీ చేస్తారట అంటూ  డ్రామాలాడిన చంద్రబాబు తన పార్టీలో ఉంటూ ప్రతీ ఎన్నికలోనూ కొత్త నియోజక వర్గానికి బదలీ అయ్యే గంటా శ్రీనివాసరావు గుర్తుకు రాలేదు కాబోలు.

రెండున్నర దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు 1999లో మొదటి సారి టిడిపి తరపున అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. అయిదేళ్ల కాలంలో నియోజక వర్గానికి చేసిందేమీ లేకపోవడంతో వ్యతిరేకత మూటకట్టుకున్నారు. అంతలో 2004 ఎన్నికల  నగారా మోగింది. అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తే  డిపాజిట్లు కూడా రావని భయపడ్డ గంటా  చోడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి  ట్రాన్స్ ఫర్ అయ్యారు. అది కూడా చంద్రబాబు ఆశీస్సులతోనే. అలా ఆ ఎన్నికల్లో చోడవరంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

అయిదేళ్ల పాటు నియోజక వర్గ ప్రజలను పట్టించుకోకుండా కాలక్షేపం చేశారు. చూస్తూ ఉండగానే 2009 ఎన్నికలు వచ్చాయి. ఈ సారి చోడ వరం నుండి పోటీ చేస్తే ఘోర పరాజయం తప్పదని గ్రహించారు. అంతే కాదు టిడిపి లోనే ఉంటే  డిపాజిట్లు రావని గమనించారు. అంతే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి  నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.

అయిదేళ్లు పాటు నియోజక వర్గాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్ర విభజన జరిగింది. గత ఎన్నికల్లో తాను గెలిచిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చెందింది. దాంతో 2014 ఎన్నికల్లో మళ్లీ పార్టీ మార్చి టిడిపిలో చేరారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజక వర్గానికి తాను చేసిందేమీ లేకపోవడంతో గెలిచే అవకాశాలు శూన్యమని తెలుసుకున్నారు. అంతే మరోసారి తన నియోజక వర్గాన్ని భీమిలికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ ఎన్నికల్లోనూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ అయిదేళ్లు పూర్తయ్యింది. భీమిలిలోనూ గంటా పనితీరుగురించి మాట్లాడుకోడానికి ఏమీ లేకపోయింది. 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారుద్దామనుకున్నారు కానీ ఆయనకు అక్కడ ఎంట్రీ లేకపోవడంతో టిడిపిలోనే కొనసాగారు. కాకపోతే మరోసారి నియోజక వర్గం మార్చారు. భీమిలి నుండి విశాఖ నార్త్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈవీఎంలు మార్చాయన్న ఆరోపణల నేపథ్యంలో వివాదస్సద విజయాన్ని మూటకట్టుకున్నారు.

అయదేళ్లు  కాలిమీద కాలేసుకుని కాలక్షేపం చేశారేతప్ప నియోజక వర్గాన్ని పట్టించుకోలేదు. దాంతో విశాఖ^నార్త్ ప్రజలు గంటా పేరు చెబితేనే నిప్పులు చెరుగుతున్నారు. ఈ సారి అక్కడి నుండి పోటీ చేస్తే నోటాకి వచ్చే ఓట్లు కూడా రావని గంటా భయపడుతున్నారు. అందుకే మళ్లీ ట్రాన్స్ ఫర్ కావాలని చూస్తున్నారు. 2014లో పోటీ చేసిన భీమిలికే మారాలని అనుకుంటున్నారు. అయితే  అది అంత వీజీగా కనపడ్డం లేదు. భీమిలిలో టిడిపి నేత రాజబాబు, జనసేన నేత పంచకర్ల సందీప్ లు ఇద్దరూ కూడా గంటాకు భీమిలి నుండి టికెట్ ఇవ్వద్దని నారా లోకేష్ చెవులు రెండూ కొరికేస్తున్నారట. ఒక వేళ గంటాకే టికెట్ ఇస్తే తామే దగ్గరుండి ఓడిస్తామని వారు ఆఫర్ కూడా ఇచ్చారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకు పోటీ చేద్దామంటే అనువైన నియోజక వర్గమే కనపడ్డం లేదని  పార్టీలో గుస గుసలు వినపడుతున్నాయి. భీమిలి నియోజక వర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి. మరి నియోజక వర్గంతో పాటు పార్టీకూడా మార్చే అలవాటున్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో జనసేనలోకి ట్రాన్స్ పర్ అయ్యి భీమిలి టికెట్ కొనుక్కుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే చాలా కాలంగా భీమిలిలో జనసేన కోసం పనిచేస్తోన్న పంచకర్ల సందీప్ మాత్రం  తనకు టికెట్ ఇవ్వకపోతే జనసేనకు గుడ్ బై చెప్పి గంటాను ఓడించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరి గంటా ఏం చేస్తారనేది చూడాలి.

చదవండి: ఏపీ బీజేపీకి కొత్త టెన్షన్‌.. డ్యామేజ్‌ తప్పదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement