Visakhapatnam North Assembly constituency
-
గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఏంటో?
ప్రతీ ఎన్నికలోనూ పార్టీనీ నియోజక వర్గాన్నీ మారుస్తూ పోయే అరుదైన రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు ఈ సారి మారడానికి నియోజక వర్గం దొరకడం లేదు. ఉన్న నియోజక వర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న గంటా గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన నియోజక వర్గానికే బదలీ అవుదామని అనుకుంటోన్నా అక్కడి టిడిపి-జనసేన నేతలు గంటాకు టికెట్ ఇవ్వనే ఇవ్వద్దని తెగేసి చెబుతున్నారు. దీంతో గంటాకు రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్ధం కావడం లేదు. చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న నారాయణ కాలేజీల అధినేత నారాయణకు వియ్యంకుడు అయిన విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజక వర్గం దొరికేలా కనిపించడం లేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నియోజక వర్గాలను సామాజిక సమీకరణలకోసం మారిస్తే.. ఎమ్మెల్యేలను కూడా బదలీ చేస్తారట అంటూ డ్రామాలాడిన చంద్రబాబు తన పార్టీలో ఉంటూ ప్రతీ ఎన్నికలోనూ కొత్త నియోజక వర్గానికి బదలీ అయ్యే గంటా శ్రీనివాసరావు గుర్తుకు రాలేదు కాబోలు. రెండున్నర దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు 1999లో మొదటి సారి టిడిపి తరపున అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. అయిదేళ్ల కాలంలో నియోజక వర్గానికి చేసిందేమీ లేకపోవడంతో వ్యతిరేకత మూటకట్టుకున్నారు. అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని భయపడ్డ గంటా చోడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. అది కూడా చంద్రబాబు ఆశీస్సులతోనే. అలా ఆ ఎన్నికల్లో చోడవరంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయిదేళ్ల పాటు నియోజక వర్గ ప్రజలను పట్టించుకోకుండా కాలక్షేపం చేశారు. చూస్తూ ఉండగానే 2009 ఎన్నికలు వచ్చాయి. ఈ సారి చోడ వరం నుండి పోటీ చేస్తే ఘోర పరాజయం తప్పదని గ్రహించారు. అంతే కాదు టిడిపి లోనే ఉంటే డిపాజిట్లు రావని గమనించారు. అంతే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయిదేళ్లు పాటు నియోజక వర్గాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్ర విభజన జరిగింది. గత ఎన్నికల్లో తాను గెలిచిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చెందింది. దాంతో 2014 ఎన్నికల్లో మళ్లీ పార్టీ మార్చి టిడిపిలో చేరారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజక వర్గానికి తాను చేసిందేమీ లేకపోవడంతో గెలిచే అవకాశాలు శూన్యమని తెలుసుకున్నారు. అంతే మరోసారి తన నియోజక వర్గాన్ని భీమిలికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ ఎన్నికల్లోనూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ అయిదేళ్లు పూర్తయ్యింది. భీమిలిలోనూ గంటా పనితీరుగురించి మాట్లాడుకోడానికి ఏమీ లేకపోయింది. 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారుద్దామనుకున్నారు కానీ ఆయనకు అక్కడ ఎంట్రీ లేకపోవడంతో టిడిపిలోనే కొనసాగారు. కాకపోతే మరోసారి నియోజక వర్గం మార్చారు. భీమిలి నుండి విశాఖ నార్త్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈవీఎంలు మార్చాయన్న ఆరోపణల నేపథ్యంలో వివాదస్సద విజయాన్ని మూటకట్టుకున్నారు. అయదేళ్లు కాలిమీద కాలేసుకుని కాలక్షేపం చేశారేతప్ప నియోజక వర్గాన్ని పట్టించుకోలేదు. దాంతో విశాఖ^నార్త్ ప్రజలు గంటా పేరు చెబితేనే నిప్పులు చెరుగుతున్నారు. ఈ సారి అక్కడి నుండి పోటీ చేస్తే నోటాకి వచ్చే ఓట్లు కూడా రావని గంటా భయపడుతున్నారు. అందుకే మళ్లీ ట్రాన్స్ ఫర్ కావాలని చూస్తున్నారు. 2014లో పోటీ చేసిన భీమిలికే మారాలని అనుకుంటున్నారు. అయితే అది అంత వీజీగా కనపడ్డం లేదు. భీమిలిలో టిడిపి నేత రాజబాబు, జనసేన నేత పంచకర్ల సందీప్ లు ఇద్దరూ కూడా గంటాకు భీమిలి నుండి టికెట్ ఇవ్వద్దని నారా లోకేష్ చెవులు రెండూ కొరికేస్తున్నారట. ఒక వేళ గంటాకే టికెట్ ఇస్తే తామే దగ్గరుండి ఓడిస్తామని వారు ఆఫర్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకు పోటీ చేద్దామంటే అనువైన నియోజక వర్గమే కనపడ్డం లేదని పార్టీలో గుస గుసలు వినపడుతున్నాయి. భీమిలి నియోజక వర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి. మరి నియోజక వర్గంతో పాటు పార్టీకూడా మార్చే అలవాటున్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో జనసేనలోకి ట్రాన్స్ పర్ అయ్యి భీమిలి టికెట్ కొనుక్కుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే చాలా కాలంగా భీమిలిలో జనసేన కోసం పనిచేస్తోన్న పంచకర్ల సందీప్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోతే జనసేనకు గుడ్ బై చెప్పి గంటాను ఓడించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరి గంటా ఏం చేస్తారనేది చూడాలి. చదవండి: ఏపీ బీజేపీకి కొత్త టెన్షన్.. డ్యామేజ్ తప్పదా? -
విశాఖలో బడుగుల విజయవిహారం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం విశాఖ తీరంలో విజయ విహారం చేశారు. వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం జగన్ అందించిన పథకాలతో తాము సాధించిన విజయాలను, సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. నెడ్‌క్యాప్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో మాధవధార నుంచి కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ వరకూ వందలాది బైకులు, కార్ల ర్యాలీతో యాత్ర సాగింది. జై జగన్.. జై జై జగన్ అంటూ వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. కైలాసపురం వద్ద జరిగిన బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం జనసంద్రమే అయింది. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. పేదల అభ్యున్నతి జగన్‌తోనే సాధ్యం: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పేద ప్రజల అభ్యున్నతి సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారిని సాధికారత దిశగా నడిపించిన సీఎం జగన్ ఒక్కరేనని తెలిపారు. ఈ వర్గాలను చంద్రబాబు ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే భావించారని, అధికారంలోకి వచ్చాక అవహేళన చేశారని అన్నారు. ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు మరో మారు మాయల పకీరులా మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అదే రైతులు, అక్కచెల్లెమ్మలను సీఎం వైఎస్ జగన్ ఆదుకొని, వారి కుటుంబాలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్లు 3 వేలకు పెంచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి దేశ చరిత్రలో రికార్డు నెలకొల్పారన్నారు. అసమానతలు రూపుమాపుతున్నసీఎం జగన్ : మంత్రి మేరుగు సీఎం వైఎస్ జగన్ సమాజంలో అసమానతలను రూపుమాపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అందరూ సమానంగా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచనైతే.. దళితులపై దాడులు, బీసీలను తోకలు కత్తిరిస్తానని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆర్ధి కంగా బలోపేతమయ్యాడని చెప్పారు. చంద్రబాబు పాలనలో 12 శాతం ఉన్న పేదరికం సీఎం జగన్ పాలనలో 6 శాతానికి తగ్గిందన్నారు. అంబేడ్కర్ కలలు నిజమవుతున్నాయి: మేయర్ హరి వెంకట కుమారి పేదలు అభ్యున్నతి చెందాలన్న అంబేడ్కర్, జ్యోతిరావు పూలే వంటి మహానుభావులు కన్న కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేస్తున్నారని గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకటకుమారి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అభివృద్ధి చెందిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ వర్గాలకు చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో రాజకీయంగా సముచిత స్థానం కల్పించారన్నారు. నియోజకవర్గంలో రూ.3467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: కె.కె.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రూ.3,467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు తెలిపారు. విశాఖను పారిశ్రామిక, పర్యాటక, విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే అగ్ర నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 17 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఇనార్బిట్‌మాల్, ఐటీ టవర్, మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది పూర్తయితే 2 వేల మందికి ఉద్యోగావకాశాలు, కంచరపాలెం ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ప్రాంతంలో ఎఎస్ఎన్ మెఘా మాల్ ద్వారా 1500 మందికి పైగా ఉపాధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, కంబాల జోగులు, తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర గణేష్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, కుంభా రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ. రెహా్మన్ తదితరులు పాల్గొన్నారు.