సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుతో నష్టపోయిన రైతన్నలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కొండంత భరోసానిస్తోంది. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు తడిసి, తేమ శాతం, రంగు మారిన ధాన్యాన్ని సాంకేతిక కారణాలను పట్టించుకోకుండా, నిబంధనలు సడలించి మరీ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అదీ రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా మద్దతు ధరకే కొని, మిల్లులకు తరలించింది.
మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు సన్నద్ధమయ్యాయి. రెవెన్యూ శాఖతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఒకటి రెండ్రోజుల్లో ముంపు నీరు దిగిపోయిన వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలకు ఈ బృందాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల మూడో వారంలోగా పంట నష్టం అంచనాలు కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. నెలాఖరులోగా లేదా జనవరి మొదటి వారంలో పరిహారం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి
ఖరీఫ్ సీజన్‌లో 64.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 28.94 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 14.91 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇక మిగిలిన విస్తీర్ణంలో 17 లక్షల ఎకరాల్లో పంటలు కోతలు పూర్తయ్యాయి. మరో 14.37 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసాయి. ప్రాథమికంగా సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురి కాగా, మరో లక్ష ఎకరాలకు పైగా కోతకు సిద్ధంగా ఉన్న పంట నేల కొరిగినట్టు అంచనా వేశారు.
వరితో పాటు మిరప, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలపై ప్రభావం చూపినట్టుగా గుర్తించారు. అయితే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తుపాను ప్రారంభమైంది మొదలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఆర్బీకే సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆర్బీకే సిబ్బంది రైతులతో నిత్యం మమేకమవుతూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు.
స్వయంగా చేలకు వెళ్లి నష్ట నివారణకు తీసుకోవల్సిన చర్యలపై సూచనలు చేశారు. కోతలు పూర్తయిన పంటను కల్లాల నుంచే కొనుగోలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకునేలా రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. ముంపునకు గురైన పొలాల్లో నీరు నిలవకుండా యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. వర్షాలు తెరిపినిచ్చిన కొద్ది గంటల్లోనే చేలల్లోని నీరు కిందకు దిగిపోవడం మొదలైంది.
మరో వైపు నేలకొరిగిన వరి, ఇతర పంటలను కాపాడుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరి పంటను కోయకుండా రైతులను అప్రమత్తం చేశారు. నేలకొరిగిన వరిచేలలో కూడా ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. వేరుశనగ, పత్తి, మిరప, శనగ, మినుము, పెసర తదితర పంటలు సాగు చేసిన రైతులను కూడా ఇదే రీతిలో అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment