ఆ‘పాత’ కష్టాలు!
దీపం బుడ్డీల గుడ్డి వెలుగులో పనులు..ఇళ్లలో రుబ్బురోళ్ల చప్పుళ్లు..బావులు, బోర్ల వద్ద నీటి కోసం మహిళల పాట్లు.. రేడియోలతో కాలక్షేపం..సైకిళ్లపై ప్రయాణాలు.. ఎప్పుడో నాలుగైదు దశాబ్దాల నాటి కబర్లు చెబుతున్నారేటీ!.. అని విస్తపోకండి..ఇవన్నీ ఇప్పుడు కళ్లెదురుగానే కనిపిస్తున్నాయి మరి.. జనం అవస్థలను కళ్లకు కడుతున్నాయి. పాతకాలంలోకి వెళ్లిపోయామన్న భావన కలిగిస్తున్నాయి.ఈ ఆధునిక కాలంలో ఎందుకీ దుస్థితి ఏర్పడిదంటే?..హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసం.. తత్ఫలితంగా తలెత్తిన కరెంటు కష్టాలు.. జనాన్ని మళ్లీ పాత కాలంలోకి తీసుకెళ్లాయి.ఫ్యాన్లు, ఏసీలు, మిక్సీలు, గ్రైండర్లు, బైకులతో కూడిన ఆధునిక జీవన సరళికి అలవాటు పడిన ప్రజలు గత మూడు నాలుగు రోజులుగా రెక్కలు ముక్కలు చేసుకొని నరకయాతన అనుభవిస్తున్నారు.
శ్రీకాకుళం సిటీ:హుదూద్ తుపాను ఎంత ప్రచండ వేగంతో విరుచుకుపడిందో.. అంతే వేగంతో వెళ్లిపోయింది. కానీ అది సృష్టించిన పెను విధ్వంసం.. తీవ్ర కష్టాలు ప్రజలను ఇప్పట్లో వీడేలా లేవు. ముఖ్యంగా ప్రచండ వేగంతో వీచిన గాలుల దాటికి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడం.. శనివారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత కాలంలో ప్రతి దానికీ విద్యుత్ అవసరం కావడం.. ప్రస్తుతం అదే లేకపోవడంతో వేరే మార్గాంతరం లేక ప్రజలు పాతకాలం పద్ధతులను గుర్తుకు తెచ్చుకొని మరీ ఆచరిస్తున్నారు. పెట్రోల్, గ్యాస్ కొరత సైకిళ్లు, కట్టెపొయ్యిలను తెరపైకి తెస్తే.. కరెంటు సమస్య విసనకర్రలు, రుబ్బురోళ్లు, బావు లు, బోర్లకు పని కల్పించింది. ఇక ఎల్‌ఈడీ వెలుగులకు అలవాటు పడిన ప్రజలు ఇప్పుడు మూలన పడిన దీపపు బుడ్డీల మసి తుడిచారు. కొందరు కొవ్వొత్తులను వినియోగిస్తున్నారు. ఇక ఫ్యాన్లు, ఏసీల స్థానంలో విసనకర్రలు ప్రజల చేతిలో కనిపిస్తున్నాయి.
అంతా పాత పద్ధతుల్లోనే
ఈనెల 11, 12 తేదీల్లో విరుచుకుపడిన పెను తుపాను కారణంగా జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు వేల సంఖ్యలో కూలిపోయి, విద్యుత్ వైర్లు తె గిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు, సెల్ టవర్లు కూడా నాశనమయ్యాయి. ఫలితంగా ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి సుమారు 78 గంటలుగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కమ్యూనికేషన్లు కూడా చాలావరకు స్తంభించిపోయాయి. మరో రెండు రోజులకు గానీ ఇవి పునరుద్ధరణకు నోచుకునే పరిస్థితి లేదు. దీంతో జిల్లాకు చెందిన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనజీవనమంతా గత కాలాన్ని గుర్తుకు తెస్తోంది. విద్యుత్ సరఫరా సౌకర్యం లేని రోజుల్ని తలపిస్తోంది.
ఇంట్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో టీవీలు, కంప్యూటర్లు మూగబోయాయి. విద్యుత్ ఉపకరణాలు తాత్కాలికంగా మూలన పడ్డాయి. వాటి స్థానంలో రుబ్బురోళ్లు, తిరగళ్లు తెరపైకి వచ్చాయి. కాసింత గాలి కోసం విసనకర్రలతో కుస్తీ పడుతున్నారు. మోటార్లతో ట్యాంకులు నింపుకొని నిరంతర నీటి సౌకర్యానికి అలవాటు పడిన ప్రజలు ఇప్పుడు వీధి మలుపుల్లో ఉన్న బోర్లు, బావులను ఆశ్రయిస్తున్నారు. ఇక సమాచారం కోసం బ్యాటరీ రేడియోల దుమ్ము దులిపారు. ఇంతవరకు క్రెడిట్, డెబిట్ కార్డులతో నిమిషాల్లో నగదు లావాదేవీలు చక్కబెట్టినవారు.. ఇప్పుడు పాస్‌పుస్తకాలు పట్టుకొని బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. అయితే జనరేటర్ సౌకర్యం ఉన్న కొన్ని బ్యాంకుల్లోనే లావాదేవీలు జరుగుతుండటంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు.
అన్ని ప్రాంతాలు.. వర్గాలదీ ఒకటే కష్టం
పేద- ధనిక, పట్టణం- గ్రామం అన్న తేడాల్లేకండా అన్ని వర్గాలు సమానంగా ఈ కష్టాలను అనుభవిస్తున్నారు. అన్ని స్థాయి వర్గాలవారికీ విద్యుత్ షాకిచ్చింది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న కొంతమంది మాత్రం జనరేటర్లు వంటి వాటితో ఈ కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. అపార్ట్‌మెంటు జీవనానికి అలవాటుపడిన ఎగువ మధ్య తరగతి ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఇన్వెర్టర్లు వినియోగిస్తున్న చోట్ల కూడా బ్యాటరీలు డౌన్ కావడంతో మరో మార్గం లేక పాత పద్ధతులు అనుసరిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. ఇంకో రెండుమూడు రోజులు ఈ అవస్థలు తప్పవేమో!