పాలకొండ/రూరల్: హుదూద్ తుపాను పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో పెనుబీభత్సం సృష్టించింది. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు తోడు పెను గాలులు భయంకరమైన శబ్ధాలతో రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. పాలకొండలోని ఏలాం కూడలిలో భారీ వృక్షం నివాస గృహాలపై కూలింది. సబ్‌కోర్టు భవనాలపై ఓ వృక్షం కూలిపోయింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సర్వీసులు నిలిపివేయడంతో ఒక్క ప్రయాణికుడు కూడా లేక వెలవెలబోయింది.
1300 ఎకరాల్లో అరటి, కాలిఫ్లవర్‌కు నష్టం
వీరఘట్టం: హుదూద్ తుపాను ధాటికి వీరఘట్టం నుంచి పాలకొండ రోడ్డులోని సీఎస్‌పీ ప్రధాన రోడ్డులో 10 భారీ వృక్షాలు నేలకొరిగాయి. తూడి, వెంకమ్మపేట, రేగులపాడు, వండువ జంక్షన్‌ల వద్ద ఒక్కొక్క భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. అలాగే వరి వేల ఎకరాల్లో నేలవాలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే సుమారు 600 ఎకరాల్లో అరటి పంట, సుమారు 700 సాగవుతున్న కాలిఫ్లవర్ పంట కూడా నాశనం కావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అలాగే పాలకొండ, పార్వతీపురం డిపోల నుంచి నడుపుతున్న అన్ని ఆర్టీసీ సర్వీసులను రద్దు చేయడంతో ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురయ్యాయి. మండల కేంద్రంలోని ముచ్చర్లవీధిలోని అలజంగి నారాయణరావుకు చెందిన పూరిళ్లు నేలమట్టమైంది. ఆటోలు ఇతర వాహనాలు తిరగకపోవడంతో జనజీవనం స్తంభించింది. రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. తుపాను సమాచారాన్ని అధికారులు ఏప్పటికప్పడు తెలుసుకుంటూ అప్రమత్తమయ్యారు. నదీతీర ప్రాంతాల్లో తహశీల్దార్ ఎం.వి.రమణ, ఎంపీడీవో బాణం వెంకటరమణ, ఎస్సై ఆర్.శ్రీనువాసరావు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
నిలకడగా వంశధార
భామిని: తుపాను ధాటికి మండలం అతలాకుతలమైంది. అరటి తోటలు నేలమట్టమయ్యాయి. పత్తినీటమునిగింది. చెట్లు కూలిపోయాయి. ఈదురు గాలులకు విదు ్యత్ లైన్లు దెబ్బతిని కరెంట్ సరఫరా నిలిచి పోయింది. బస్సులతో పాటు ఇతర వాహనాలు తిరగలేదు. తహశీ ల్దార్ జలారి చలమయ్య, ఎంపీడీవో విజయలక్ష్మి, బత్తిలి ఎస్‌ఐ సీహెచ్ రామారావు, ఏఎస్‌ఐ బాలుడు, ఆర్‌ఐ కూ ర్మారావు తదితరులు పరిస్థితిని పర్యవేక్షించి ఏర్పాట్లు చేశారు.
గెడ్డలను పరిశీలించిన అధికారులు
సీతంపేట: పాలకొండ-హడ్డుబంగి రోడ్డు మధ్యలో పొంగి పొర్లుతున్న గెడ్డలను మండల ప్రత్యేకాధికారి సుదర్శనదొర, తహశీల్దార్ జి.మంగు, ఎంపీడీవో గార రవణమ్మ పరిశీలించారు. చంద్రమ్మగాటి గెడ్డ, వాబగెడ్డను పరిశీలించారు. రోడ్డుపై పడిపోయిన చెట్లను పరిశీలించి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేశారు.
ఆరుచోట్ల కూలిన భారీ వృక్షాలు
పాతపట్నం(ఎల్.ఎన్.పేట): పాతపట్నం మండలంలోని నీలమణిదుర్గ అమ్మవారి గుడి సమీపంలో, అచ్చుతాపురంతో పాటు మరో ఆరుచోట్ల భారీ వృక్షాలు నేలకూలిపోయాయి. పాతపట్నం మేజర్ పంచాయతీతో పాటు పలు గ్రామాల్లో ఏడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగిపోయాయి. వీటిని పునరుద్ధరించే పనులు ఏఈ ధర్మారావు ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ప్రజలకు సహాయపడే పనులు చేపట్టడంలో పోలీసులు ముందుగా ఉండాలని ఎస్సై బి.సురేష్‌బాబు సిబ్బందికి పిలుపునిచ్చారు.
నేలవాలిన వరి
ఎల్.ఎన్.పేట: మండలంలోని లక్ష్మీనర్సుపేట, వాడవలస, దబ్బపాడు, బసవరాజుపేట, మిరియాప్పల్లి, మోదుగువలస, స్కాట్‌పేట గ్రామాల్లో వరికి తీరని నష్టం వాటిల్లింది. ప్రస్తుతం కోతదశలో ఉన్న వరిపంట నేలకొరిగిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జంబాడ, కొత్తబాలేరు, మురగడలోవ, కొత్తవలస, గోలుకుప్ప, జోగివలస, రోలుగుడ్డి, మెట్టుగూడ, కొత్తజోగివలస, కారిగూడతో పాటు పలు గ్రామాల్లో గిరిజనులు పండిస్తున్న పోడు పంటలకు అపార నష్టం జరిగింది. అరటి, బొప్పాయి, కంది పసపు పంటలకు తీరని నష్టం జరిగిందని గిరిజనులు చెప్పారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫోన్లు పనిచేయలేదు. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.
నాలుగు పూరిళ్లు నేలమట్టం
హిరమండలం: మండలంలోని పాతహిరమండ లంలో నాలుగు, గొండిగోడలో నాలుగు పూరిళ్లు నేలమట్టమయ్యాయని తహశీల్దార్ డి.చంద్రశేఖర్ తెలిపారు. అలికాం-బత్తిలి, హిరమండలం-పాతపట్నం రోడ్లపై అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. అధికారులు వాటిని తొలగించి రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించారు. అత్తరాపల్లి, అంబావిల్లి గ్రామాల్లో ఐదు స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తహశీల్దార్ డి.చంద్రశేఖర్, ఇతర అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
చెట్టు విరిగి ఇద్దరికి గాయాలు
మెళియాపుట్టి: మండలంలో పెద్దలక్ష్మీపురంలో చెట్టుకొమ్మలు విరిగిపడి మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. గంగరాజుపురంలో డాబా ఇళ్లపై మర్రిచెట్టు విరిగిపడింది. అయితే ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. గోపీనాథపురం వద్ద టాటాఏసీ వాహనంపై చెట్టు విరిగిపడింది. ఎంసీపీ కొత్తూరులో మునగచెట్టు విరిగిపడి ఇంట్లో ఉన్న సవర భారతి, సవర నవీన్‌కుమార్ గాయాలకు గురయ్యారు. వీరిని వైద్యం నిమిత్తం 108 సహాయంతో పర్లాకిమిడి ఆస్పత్రికి తరలించారు. కొసమాల గ్రామంలో చెట్టు విరిగిపడడంతో ఒక గేదె మృతి చెందగా, మరో గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. మెళియాపుట్టి, ముకుందపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 500 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 20 ఎకరాల్లో చెరుకు పంట నేలకొరిగింది. పలాస-మందస, టెక్కలి-పర్లాకిమిడి రోడ్లపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
గెడ్డలకు గండ్లు
కొత్తూరు: మండలంలోని హడ్డుబంగిగెడ్డ, కారిగెడ్డ, కురుడుబట్టి, బలిజవాని గెడ్డతో పాటు పలు గెడ్డలు పొంగిపొర్లాయి. పలు గెడ్డలకు గండ్లు పడ్డాయి. కొత్తూరు వద్ద హడ్డుబంగి గెడ్డకు గండి పడింది. కుద్దిగాం గ్రామంలో కొబ్బరి చెట్టు కూలింది. ఇదే గ్రామంలో తవిటినాయుడు ఇంటిమీదను చెట్టుకూలింది. ఈ ప్రమాదంలో కరిమి కాంతమ్మకు గాయాలు తగిలాయి. వైఆర్‌పేట-నీలకంఠాపురం గ్రామాల మధ్య భారీ వృక్షం కూలింది. కుద్దిగాం వద్ద మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరి, పత్తి, అరటి పంటలు వందలాది ఎకరాల్లో నేలకొరిగాయి. వంశధార నదిలో ఆదివా రం నాటికి స్వల్పంగా వరద నీరు చేరింది. దీంతో వసప కాలనీ, కుంటిభద్ర, మాతల, పెనుగోటి వాడ తది తర గ్రామాలు వద్ద వరి నీట ము నింది. ఐటీడీఏ పీవో సత్యనారాయణ, మండల ప్రత్యే క అధికారి లక్ష్మణరావు నేతృత్వంలో స్థానిక తహశీల్దార్ శ్యామ్‌సుందరావు, ఎంపీడీవో రావడ వెంకట్రామన్, ఎస్‌ఐ వి.రమేష్ తహశీల్దార్ కార్యాలయంలో బసచేసి తుపాను వివరాలు సేకరించారు. అలాగే కుద్దిగాం, మాకవరం తదితర గ్రామాల్లో కాంగ్రెస్ ఓబీసీ జిల్లా శాఖ అధ్యక్షుడు పాలవలస కరుణాకర్ పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలను కోరారు.
బాధితులను ఆదుకోవాలి
ఎల్.ఎన్.పేట: హుదూద్ తుపాను కారణంగా పంట, ఇళ్లు కోల్పోయిన, గాయాలపాలైన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరారు. హిరమండలం మండలంలోని పలుగ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇళ్లు కూలిపోయిన బాధితులకు తక్షణ సహాయంగా బియ్యం, కిరోసిన్ వంటి సరుకులు సరఫరా చేయాలని జిల్లా అధికారులను కోరారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు జి.జగన్మోహనరావు, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
స్తంభించిన వ్యవస్థ
Published Mon, Oct 13 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement