ముప్పు తప్పింది గానీ..
ఏలూరు:రెండు రోజులపాటు జిల్లా ప్రజలను వణికించిన హుదూద్ తుపాను ముప్పు తప్పింది. అయితే, తుపాను అల్పపీడనంగా మారడంతో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తుపాను తప్పినందుకు రైతులు సంతోషిస్తున్నా.. వర్షాలు కురుస్తాయనడంతో పంటలు ఏమైపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా తుపాను ప్రభావంతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకూ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులు వీయగా, ఆదివారం సాయంత్రం నుంచి గాలుల తీవ్రత పెరిగింది. దీంతో చాలాచోట్ల వరి చేలు నేలవాలాయి. అక్కడక్కడా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాల్లో అలలు ఎగిసిపడ్డాయి. రెండు గ్రామాల్లోనూ సముద్ర తీరం కోతకు గురికాగా, తాడిచెట్లు కొట్టుకుపోయూరుు. పెద్దగా వర్షం కురవకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కొనసాగుతున్న అప్రమత్తత
తుపాను కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెండు రోజులపాటు రేరుుంబవళ్లు అప్రమత్తంగా పనిచేసిన అధికారులు.. విధుల్లోనే కొనసాగు తున్నారు. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించారు. ముంపు పరిస్థితులు తలెత్తితే తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలావుండగా, తీరప్రాంతాలైన నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, యలమంచిలి మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నారుు. నరసాపురం మండలానికి చెందిన 5,275 మంది, మొగల్తూరు మండలానికి చెందిన 1,250 మంది, యలమంచిలి మండలంలో 815 మంది, కాళ్లలో 485 మంది, భీమవరం మండలంలో 354 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
తీర గ్రామాలకు ప్రజాప్రతినిధులు
రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి నరసాపురం మండలం తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాల్లో ఆదివారం పర్యటించారు.
నేడు, రేపు జన్మభూమి సభలు రద్దు
తుపాను తప్పినా.. అల్పపీడనం జిల్లాపై ప్రభావం చూపే పరిస్థితి ఉండటంతో సోమ, మంగళవారాల్లో జరిగే జన్మభూమి గ్రామ సభలను రద్దు చేశారు. పరిస్థితులు చక్కబడిన అనంతరం తిరిగి సభలు నిర్వహించాలని నిర్ణరుుంచారు. ఇదిలావుండగా, పాఠశాలలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు.