ఏలూరు : వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి రోడ్లమీదుగా ప్రవహిస్తున్నాయి. శనివారం పలుచోట్ల ఇళ్లు, వృక్షాలు నేలకూలాయి. జీలుగుమిల్లి మండలం తాటియాకుల గూడెం ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన మద్దల వెంకటేష్ (50) అనే వ్యవసాయ కూలీ నీట మునిగి గల్లంతయ్యాడు. చాగల్లు మండలం పేముల కాలువ పొంగి కొవ్వూరు రోడ్డు మీదుగా ప్రవహిస్తోంది. జల్లేరువాగు పోటెత్తింది. దేవరపల్లి మండలం బందపురంలో వాగు పొంగి ప్రధాన రహదారిని ముంచెత్తింది.
చాగల్లు మండలం ఊనగట్లలోనూ వాగు పొంగింది. శనివారం ఉదయం 8గంటల సమయానికి గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 77.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ కె.భాస్కర్ అప్రమత్తం చేశారు. కలెక్టరేట్, ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాల యాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాతోపాటు పొరుగు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో తమ్మిలేరు రిజర్వాయర్‌లో వరద నీరు చేరుతోంది. 355 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న తమ్మిలేరులో శనివారం సాయంత్రానికి 327.54 అడుగుల నీటిమట్టం నమోదైంది. జల్లేరు, బైనేరు జలాశయాల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి.
కొవ్వూరులో అత్యధికంగా 169.2 మి.మీ. వర్షపాతం
శనివారం ఉదయం 8 గంటల సమయానికి గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 77.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు జిల్లా ప్రణాళిక శాఖ జాయింట్ డెరైక్టర్ కె.సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కొవ్వూరులో 169.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాళ్లపూడిలో141.6, పోలవరంలో 130.5, జీలుగుమిల్లిలో 87.7, బుట్టాయగూడెంలో109.4, జంగారెడ్డిగూడెంలో 78.2, టి.నర్సాపురంలో 41.2, చింతలపూడిలో 48.1, లింగపాలెంలో 33.5, కామవరపుకోటలో 69.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నల్లజర్లలో 38.8, చాగల్లులో 89.6, నిడదవోలులో73.3, తాడేపల్లిగూడెంలో 49.1, ఉంగుటూరులో 63.6, భీమడోలులో 59.2, పెదవేగిలో 25.1, పెదపాడులో 35.4, ఏలూరులో 26.9, దెందులూరులో 37, నిడమర్రులో 41.9, గణపవరంలో 46.6, పెంటపాడులో 103.4, తణుకులో 82.2, ఉండ్రాజవరంలో 129.5, ఇరగవరంలో 11.5, అత్తిలిలో 87.4, ఉండిలో 58.6, ఆకివీడులో 69.2, కాళ్లలో 75, భీమవరంలో 70, పాలకోడేరులో 75.1, వీరవాసరంలో 82.2, పెనుమంట్రలో 55.1, పెనుగొండలో 99, పోడూరులో 118, పాలకొల్లులో 99.6, యలమంచిలిలో70.2, నరసాపురంలో 44.9, మొగల్తూరులో 41.8, కుకునూరులో 152.2, వేలేరుపాడులో 60.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. ఆర్డీవోల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఐదు ప్రధాన కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మంపుబారిన పడినా.. చెరువులు, కాలువలకు గండ్లు పడినా, విపత్కర పరిస్థితులు తలెత్తినా, ప్రమాదం సంభవించినా సమీపంలోని కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కలెక్టరేట్ వర్గాలు కోరాయి. ఏలూరు కలెక్టరేట్‌లో 08812-230050, ఏలూరు ఆర్డీవో కార్యాలయంలో 08812-232044, నరసాపురం ఆర్డీవో కార్యాలయంలో 08814-276699, కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో 08813-231488, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో 08821-223660 నంబర్లకు ఫోన్‌చేసి పైన పేర్కొన సమాచారం అందించాలని కోరాయి.
గోదారి పరవళ్లు
కొవ్వూరు: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుం డటం, ఉపనది శబరి నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి పోటెత్తి ప్రవహిస్తోంది. మూడు రోజులుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు ఖమ్మం జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఎగువనుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ఇప్పటివరకు నీలివర్ణంలో ఉన్న గోదారి నీరు ఎర్రబడింది. శనివారం సాయంత్రం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 2,47,410 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పశ్చిమ డెల్టాకు నీటి విడుదలను నిలిపివేశారు.
గోదావరికి ఉపనది అయిన శబరి పరివాహక ప్రాంతంలో శుక్రవారం ఒక్కరోజే 201.40 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయానికి భద్రాచలంలో 12 అడుగులున్న నీటిమట్టం సాయంత్రానికి 24 అడుగులకు చేరింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి 2,47,760 క్యూసెక్కుల వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతోంది. రానున్న రెండు రోజుల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వదలని వాన
Published Sun, Jun 21 2015 4:00 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM
Advertisement