సహాయక చర్యల్లో పాల్గొనండి: వైఎస్ జగన్
పార్టీ నేతలకు, శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
సాక్షి, హైదరాబాద్ : పెను తుపాను హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటూ బాధితులకు బాసటగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మానవతా చర్యలన్నింటిలోనూ పాల్గొనాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన కోరారు. పెను తుపాను హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన కోరారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం కూడా హెచ్చరికలు చేసిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో హుదూద్ సృష్టించిన విలయం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల పార్టీ నేతలు సుజయ్‌కృష్ణ రంగారావు, బేబి నాయన, ధర్మాన కృష్ణదాస్, రెడ్డిశాంతి, గుడివాడ అమర్‌నాథ్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయా జిల్లాల్లో తుపాను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులను సమీకరించి సహాయక చర్యలకు ఉపక్రమించాలని వారికి ఆయన సూచించారు.