ఒంగోలు టౌన్ : హుదూద్ తుపాను కారణంగా పూర్తిగా దెబ్బతిన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రకాశం జిల్లా నుంచి 100 టన్నుల కూరగాయలు పంపుతున్నట్లు కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. కందుకూరు నుంచి రెండు, ఒంగోలు నుంచి మూడు, మార్టూరు నుంచి ఐదు లోడ్ల కూరగాయలు పంపించేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. మరో 150 టన్నులు పంపించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కూరగాయలు పండించే రైతులు ఎక్కువ మంది ఉన్నారని, ఉత్పత్తి కూడా ఎక్కువగా వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
కూరగాయలు పండించే రైతులు మూడు జిల్లాల్లో తుపాను బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడివారిని ఆదుకునేందుకు మానవతా దృ క్పథంతో ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. ‘నో లాస్.. నో ప్రాఫిట్’ కింద రైతులు తాము పండించిన కూరగాయలను ఒంగోలు, మార్టూరు, కందుకూరు మార్కెట్ యార్డులకు తీసుకురావాలన్నారు. లాభం కోసం ఆశించకుండా తుపాను బాధితులను ఆదుకోవాలన్నారు. తుపాను తాకిడికి దెబ్బతిన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభుత్వం సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నప్పటికీ, కొన్ని కుటుంబాలు అక్కడకు వెళ్లలేని పరిస్థితులున్నాయని, అలాంటి వారిని కూడా ఆదుకునేందుకు ఇక్కడ నుంచి కూరగాయలు పంపిస్తున్నామని కలెక్టర్ వివరించారు.
జిల్లా నుంచి వెళ్లిన అధికారులు, సిబ్బంది బృందాలు...
హుదూద్ తుపానుకు దెబ్బతిన్న విజయనగరం జిల్లాలో సహాయక చర్యలతోపాటు నష్టం అంచనా వేసేందుకు జిల్లా నుంచి అధికారులు, సిబ్బంది బృందాలు వెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. 450 మందితో కూడిన 50 బృందాలు మంగళవారం ఉదయానికి విజయనగరం జిల్లా చేరుకున్నాయని, బుధ, గురువారాలు అక్కడే ఉంటాయని, అవసరమైతే శుక్రవారం కూడా ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రతి బస్సులో నిత్యావసర వస్తువులతో పాటు కుక్, అసిస్టెంట్ కుక్‌లను కూడా పంపించామన్నారు.
ఆ 42 వేల మంది పింఛన్లు రద్దు కాలేదు...
జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు సంబంధించి 79 వేల పింఛన్లు పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వాటిలో 37 వేల మందిని అనర్హులుగా గుర్తించామని, మిగిలిన 42 వేలమంది పింఛన్లు రద్దు కాలేదని స్పష్టం చేశారు. వారిని విచారించిన తరువాత అర్హులని తేలితే పింఛన్‌దారుల జాబితాలో చేరుస్తామన్నారు. గ్రామస్థాయిలో పింఛన్లు పొందుతున్నవారి పేర్లు జాబితాలో లేకుంటే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి విన్నవించుకోవాలని సూచించారు.
మండల స్థాయిలో పింఛన్లకు సంబంధించి సమస్యలు తలెత్తితే జిల్లాస్థాయి కమిటీ వాటిని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్, సీపీఓ పీబీకే మూర్తి, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ పోలప్ప, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మూర్తి, డీఎంహెచ్‌ఓ చంద్రయ్య పాల్గొన్నారు.
తుపాను బాధితులకు చేయూత
Published Wed, Oct 15 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM
Advertisement
Advertisement