* హుదూద్ తుపాను ప్రభావంతో రైల్వేశాఖ ముందస్తు చర్యలు
* విశాఖపట్నం, భువనేశ్వర్‌వైపు లైన్ బ్లాక్
* ముఖ్యమైన రైళ్లు బలార్షా మీదుగా మళ్లింపు
* పమాదకర వంతెనలు, చెరువు సమీప లైన్ల వద్ద వాచ్‌మెన్ ఏర్పాటు
* నిరంతర నిఘాకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను భీకరంగా విరుచుకుపడుతుందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పకడ్బందీగా వ్యవహరించింది. గతంలో ఇలాంటి హెచ్చరికలు వెలువడ్డా... రైళ్లను నడిపేది. తీరా తుపాను విరుచుకుడ్డాక రైళ్లు నిలిచిపోయి ప్రయాణికులు నరకయాతనపడేవారు. ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకావద్దన్న ఉద్దేశంతో తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో ఒక్కరైలునూ నడపకుండా పూర్తిగా నిలిపివేసింది. ముఖ్యమైన రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారిమళ్లించి వాటిల్లో ప్రయాణించేవారికి ఇబ్బందిలేకుండా వ్యవహరించింది.
తుపాను భీకరంగా ఉండబోతుందం టూ నాసా హెచ్చరించిన నేపథ్యంలో చిన్న ప్రమాదం కూడా లేకుండా చూడాలని, రెలైక్కినందుకు ప్రయాణికులు ఇబ్బందిపడే పరిస్థితి రానీయొద్దని రైల్వే ఆదేశించటంతో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడ-విశాఖపట్నం దారిలో రాజమండ్రి-విశాఖపట్నం మధ్య ఆదివారం తెల్లవారుజాము నుంచి రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తుపాను తీరం దాటినా విశాఖపట్నం, భువనేశ్వర్‌లకు వెళ్లే రైళ్లను ముందుజాగ్రత్తగా సోమవారం సాయంత్రం వరకు రద్దు చేశారు. హౌరావైపు వెళ్లాల్సిన ముఖ్యమైన రైళ్లను విజయవాడ, బలార్షాల మీదుగా మళ్లించారు.
ఫలితంగా 62 రైళ్లు పూర్తిగా రద్దు కాగా, ఐదు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 51 రైళ్లను దారిమళ్లించి నడిపారు. మరోవైపు రైలు మార్గాల పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రైల్ నిలయంలో అత్యవసర కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ బాధ్యతను అదనపు జీఎం అగర్వాల్, చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ ఝాలకు అప్పగించారు. అలాగే విజయవాడలో మరో అత్యవసర కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అక్కడి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీటితోపాటు అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ, రాజమండ్రి, నిడదవోలు, నూజి వీడు, భీమవరం, మచిలీపట్నం, నర్సాపూర్, గుడివాడ, ఏలూరు, గుంటూరు, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్ స్టేషన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.