ఈ నెల 30న...పన్నెండు గంటల పాటు మేము సైతం
హుదూద్ తుపాన్ బీభత్సం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సుందర నగరం విశాఖకి పూర్వ శోభను తెచ్చే ప్రయత్నంలో ‘మేము సైతం’ అంటూ తెలుగు చిత్రపరిశ్రమ నడుం బిగించింది. సినిమా స్టార్లందరూ ఒకే వేదికపైకి వచ్చి, 12 గంటల పాటు నిర్విరామంగా సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పరిశ్రమలోని వివిధ శాఖల ప్రతినిధులు ఈ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ -‘‘గత నెల 12న జరిగిన ప్రకృతి వైపరీత్యం అందరికీ తెలిసిందే. హుదూద్ తుపాన్ ధాటికి ఉత్తరాంధ్ర తీవ్రంగా దెబ్బతిన్నది.
ఇలాంటి విపత్తు పరిణమించిన ప్రతిసారీ... బాధితుల్ని ఆదుకోవడానికి ‘మేము సైతం’ అంటూ సినీ పరిశ్రమ ముందుకొస్తూనే ఉంది. ఆ సంప్రదాయానికి కొనసాగింపుగా ఈ నెల 30న హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో ‘మేము సైతం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’’ అని తెలిపారు. ‘‘ఈ నెల 30ని సినీపరిశ్రమకు సెలవు దినంగా, వచ్చే నెల రెండో ఆదివారం పనిదినంగా ప్రకటించాం. మంచి దృక్పథంతో 12 గంటల పాటు నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమం.. అంద రికీ కావల్సినంత వినోదాన్ని పంచుతుంది’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ -‘‘ఈ కార్యక్రమానికి పరిశ్రమ వారు మాత్రమే ఆహ్వానితులు. బయటవారికీ టికెట్లు అమ్ముతాం.
అయితే, టికెట్ కొన్నంత మాత్రాన లోపలికి అనుమతించం. లక్కీ డీప్ ద్వారా కొందరిని ఎంపిక చేసి, వారినే అనుమతిస్తాం. టికెట్ ధర రూ. 500. పరిశ్రమనే కమిటీగా భావించి సమష్టిగా చేస్తున్న కార్యక్రమం ఇది. ‘మేము సైతం డాట్ కామ్’ ద్వారా కార్యక్రమ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బు సేకరించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తాం. సినీ పరిశ్రమకు చెందిన స్టార్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అన్నారు. ఇంకా ఏపీ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్, నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎ.శ్యామ్‌ప్రసాదరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, జెమినీ కిరణ్, మధుర శ్రీధర్, కెవీరావు తదితరులు మాట్లాడారు.