టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశారు. మనదేశంలోనే మొట్టమొదటిసారి ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన డాల్బీ పోస్ట్ ప్రొడక్షన్(Dolby Technology)ను ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలో ఇండియాలో ఇప్పటివరకు అందుబాటులో లేని డాల్బీ-సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. చిత్ర నిర్మాణంలో ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఆడియో, విజువల్ ఎఫెక్ట్స్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో సినిమాటిక్ అనుభూతిని కలిగించేలా సినిమాలను తెరకెక్కించనున్నారు. ఆడియన్స్‌కు సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. అది కూడా మన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించడం మరో విశేషం.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. 'ఆర్‌ఆర్‌ఆర్ సమయంలో డాల్బీ విజన్‌లో సినిమాను అప్ గ్రేడ్ చేయాలనుకున్నా. కానీ ఆ టెక్నాలజీ మనదగ్గర లేదు. దాని కోసం మేము జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. ఇది నాకు కొంత వరకు నిరుత్సాహానికి గురిచేసింది. నా సొంత దేశంలో నా సినిమాని డాల్బీ విజన్‌లో చూడలేకపోయానని నిరాశకు గురయ్యా. కానీ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ సదుపాయాన్ని చూసి థ్రిల్ అయ్యా. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నా నెక్ట్స్ మూవీ విడుదలయ్యే సమయానికి భారతదేశం అంతటా బహుళ డాల్బీ సినిమాలు ఉంటాయి. డాల్బీ విజన్‌లో సినిమా చూడటం పూర్తిగా ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోని కథనాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రేక్షకులు ఈ డాల్బీ సదుపాయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
అనంతరం నాగార్జున మాట్లాడుతూ..'వర్చువల్ ప్రొడక్షన్‌లో అగ్రగామిగా ఉండటం కోసం ఎల్లప్పుడు ముందుంటాం. దేశంలోనే మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సినిమాను వరల్డ్ మ్యాప్‌లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ తన 50వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డాల్బీని ఏర్పాటు చేయడం విశేషం. అత్యాధునికి టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలకు మరో ముందడుగు"అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన స్పెషల్ ఫుటేజ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రదర్శించారు.
మహేశ్ బాబుతో రాజమౌళి..
కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. జనవరి 2న హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.
హీరోయిన్‌పై చర్చ..
కాగా.. మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment