ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు డాల్బీ విజన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో జర్మనీకి వెళ్లారని అన్నారు. అక్కడే సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారని నాగ్ వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న నాగార్జున సినిమా, థియేటర్ టెక్నాలజీపై మాట్లాడారు.మొట్ట మొదటిసారి ఈ సదుపాయాన్నిఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నామని నాగార్జున తెలిపారు. మనదేశంలో తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా.. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ-2024 ఈవెంట్ ఈనెల 28 వరకు కొనసాగనుంది.