
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ (Andhrula Annapurna Dokka Seethamma). టి.వి. రవి నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతం అందించారు. ఎం.రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం..
400 ఎంకరాలు అమ్మేసి..
అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయులైన కథతో సినిమా తీస్తుండటం గొప్ప విషయం. ఇలాంటి వారి గురించి జనాలకు తెలియాలి. నాలుగు వందల ఎకరాలు అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు. ఆమని గారు చేస్తున్న ఈ పాత్రతో ఆమె మీద అందరికీ గౌరవం పెరుగుతుంది’ అని అన్నారు. దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ.. ‘అందరిలాగే చిరంజీవి గారిని చూసి అభిమానిగా మారి 2012లో ఇండస్ట్రీకి వచ్చాను.
నా అదృష్టం: దర్శకుడు
మొదటి సినిమానే డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలైన కథతో చేస్తుండటం నా అదృష్టం. నా మొదటి చిత్రానికి సుచిత్రమ్మతో ఓ పాట చేయించాలని అనుకున్నాను. చంద్రబోస్ గారు ఇచ్చిన మాట సాయంతోనే ఈ సినిమా స్థాయి పెరిగింది. ఆమని గారు అద్భుతంగా నటించారు. మురళీ మోహన్ గారు అందించిన సహకారాన్ని మర్చిపోలేను. ఆర్ట్ డైరెక్టర్ రవన్న అద్భుతంగా సెట్స్ వేశారు. త్వరలోనే ట్రైలర్‌తో వస్తాం’ అని అన్నారు.

ఆమనికి జాతీయ అవార్డు రావాలి
మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు. ఇలాంటి గొప్ప వారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. ఆమని చాలా మంచి ఆర్టిస్ట్. అలాంటి గొప్ప ఆర్టిస్ట్‌కు డొక్కా సీతమ్మ పాత్ర వచ్చింది. ఆమని గారికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి’ అని అన్నారు. ఆమని మాట్లాడుతూ .. ‘దర్శకుడు వచ్చి డొక్కా సీతమ్మ గారి కథ చెప్పారు. నేను బెంగళూర్‌కు చెందిన వ్యక్తిని. నాకు ఆమె గురించి ఎక్కువగా తెలీదు.
రాసిపెట్టి ఉండాలి: ఆమని
దర్శకుడు కథ చెప్పిన తరువాత గూగుల్‌లో ఆమె గురించి సర్చ్ చేశాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకర్థమైంది. ఇలాంటి పాత్ర చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. ఈ పాత్ర దొరకడం నా అదృష్టం’ అని అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయుల కథను సినిమాగా అనుకోవడమే పెద్ద సాహసం. డొక్కా సీతమ్మ అంటే బ్రిటీష్ వారికి కూడా తెలుసు. లండన్ రాజు గారి ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి ఇక్కడే ఉండి అందరికీ సేవ చేశారు. ఇలాంటి చిత్రంలో డొక్కా జోగన్న పాత్రను మురళీ మోహన్ గారు, డొక్కా సీతమ్మగా ఆమని గారు నటిస్తుండటం వారి అదృష్టం’ అన్నారు.
చదవండి: నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్ల పంపిణీ