40 వేల టన్నుల యూరియా, పొటాషియం నీటి పాలు
నిల్వలు బూస్టర్ డోస్‌కి సరిపోతాయి
రబీకి గడ్డు కాలం..
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను ప్రభావం ఎరువుల కంపెనీలనూ తాకింది. తుపానుతో కురిసిన భారీ వర్షాలు, పెనుగాలులకు విశాఖ హార్బర్‌లో నిల్వ చేసిన వేలాది టన్నుల ఎరువులు తడిసి ముద్దయ్యాయి. ఏయే కంపెనీకి ఎంత నష్టం వాటిల్లో ఇంకా స్పష్టం కానప్పటికీ ప్రధాన ఎరువుల కంపెనీలన్నీ తుపాను నష్టాన్ని చవిచూశాయి. నష్టం అంచనాకు ఆయా కంపెనీల అధికారులు ఆందోళనతో విశాఖపట్నం వైపు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్), కోరమాండల్ ఇంటర్నేషనల్, ఇఫ్కో, క్రిబ్కో, నాగార్జున వంటి ప్రముఖ ఎరువుల కంపెనీలన్నీ ప్రధాన ఓడరేవుల ద్వారా ఎరువుల్ని దిగుమతి చేస్తుంటాయి.
వచ్చిన సరుకును ఆయా కేంద్రాలకు పంపే వరకు నిల్వ చేసుకునేలా ఓడరేవుల్లో ఎరువుల కంపెనీలకు గిడ్డంగులు కూడా ఉంటాయి. ఎగసిపడిన అలలకు విశాఖ హార్బర్ గోడలు కూలడంతో ఎరువుల కంపెనీలకు ఇచ్చిన గిడ్డంగులూ ధ్వంసమైయ్యాయి. ఫలితంగా వాటిల్లో నిల్వ ఉంచిన డిఎపీ, పొటాషియం, యూరియా వంటి ఎరువులు పాడై పోగా ఓడల నుంచి కంటైనర్ల నుంచి దించని ఎరువులు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. పాడైన ఎరువుల విలువ సుమారు సుమారు రూ.30 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా.
నష్టం విషయం తెలుసుకున్న ఎరువుల కంపెనీల ప్రతినిధులు హుటాహుటిన విశాఖ బయల్దేరారు. కాకినాడ నుంచి ఇఫ్కో కంపెనీ అధికారులు ఇప్పటికే విశాఖ పట్నం చేరుకుని తమ గిడ్డంగిలో నిల్వ ఉంచిన సూక్ష్మపోషకాల ఎరువులకు కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. తమ వద్ద యూరియా నిల్వలు లేవని తేల్చినట్టు ప్రాథమిక సమాచారం. ఐపీఎల్ కంపెనీకి విశాఖ హార్బర్‌లో మూడు గిడ్డంగులున్నాయి. వాటిల్లో ఏయే సరకు నిల్వ ఉన్నది ఇంకా తేలలేదు. గుజరాత్ నుంచి ప్రతినిధులు రానున్నారు.
నీటిపాలైన క్రిబ్కో యూరియా..
ఈ తుపానులో క్రిబ్కో కంపెనీ ఎక్కువగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే ఒమన్‌లోని తన కర్మాగారం నుంచి 32 వేల టన్నుల యూరియాను తెప్పించింది. ఓడ నుంచి సరకును దించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్న దశలో తుపాను వచ్చింది. దీంతో ఏ ఒక్క బస్తా బయటకు వెళ్లలేదు. నీటిలో నాని కొంత మొత్తం కరిగిపోగా, మరికొంత గడ్డకట్టుకుపోయింది. దీనివల్ల ఈ కంపెనీకి రూ.17 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. ఇదేమాదిరిగా మిగతా కంపెనీల గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 8 వేల టన్నుల పొటాషియం, డీఏపీ తదితర ఎరువులకు నష్టం వాటిల్లింది. దీని విలువ సుమారు రూ.12 నుంచి 13 కోట్ల రూపాయలకుపైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
రబీ సీజన్‌లో యూరియా కొరత తప్పదా?
తుపాను పీడిత ప్రాంతాల్లో వరి, ఇతర ఉద్యానవన పంటలకు బూస్టర్ డోస్ కింద యూరియా, పొటాష్‌ను వాడతారు. ఎకరాకు 20 కిలోల యూరియా, పది కిలోల పొటాష్ అవసరం. అనుకోని ఈ విపత్తుకు ప్రస్తుత నిల్వల నుంచి ఈ ఎరువుల్ని వినియోగించమని వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఇంతవరకు సజావుగానే ఉన్నా అక్టోబర్ నుంచి మొదలయిన రబీ సీజన్ పంటలకు యూరియా కొరత తప్పేలా లేదు. ప్రస్తుత అవసరాల కోసం తెప్పించిన యూరియా తడిసిపోవడంతో ఇప్పటికిప్పుడు తిరిగి తయారుచేయడం కష్టం. దీని ప్రభావం రబీ పంటలపై పడుతుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పోర్టులో కరిగిన యూరియా!
Published Tue, Oct 14 2014 1:34 AM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM
Advertisement