హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.800 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రెండు నూతన ప్లాంట్ల ఏర్పాటుకు రూ.677 కోట్లు వెచ్చించాలని గురువారం సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన మొత్తాన్ని మూలధన అవసరాలకు వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంటును రూ.513 కోట్లతో విస్తరిస్తోంది.
ఇందులో భాగంగా 7,50,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రాన్యులేషన్ ట్రైన్‌ను 24 నెలల్లో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కాకినాడ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22,50,000 టన్నులు ఉంది. వినియోగం 93 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది. ‘ఈ విస్తరణతో కాకినాడ ప్లాంట్‌ను భారత్‌లో అతిపెద్ద ఎరువుల తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారుస్తుంది. ఎరువుల రంగంలో సంస్థ నాయకత్వాన్ని సుస్థిరం చేస్తుంది’ అని కోరమాండల్ తెలిపింది.
ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్..
అలాగే గుజరాత్‌లోని అంకలేశ్వర్ వద్ద 600 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్ ప్లాంట్‌ను రూ.164 కోట్లతో నెలకొల్పాలని నిర్ణయించింది. 18 నెలల్లో ఇది కార్యరూపంలోకి రానుంది. క్రాప్ ప్రొటెక్షన్ టెక్నికల్స్‌ను ఇక్కడ తయారు చేస్తారు. కోరమాండల్ క్రాప్ ప్రొటెక్షన్ ఫిలిప్పైన్స్‌లో (సీసీపీపీ) అదనంగా 6.67 శాతం వాటాను రూ.76 లక్షలతో కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది. తద్వారా సీసీపీపీ పూర్తి అనుబంధ కంపెనీగా మారుతుందని వివరించింది.
తగ్గిన నికర లాభం..
సెప్టెంబర్ త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం క్షీణించి రూ.659 కోట్లకు చేరింది. ఎబిటా 8 శాతం తగ్గి రూ.975 కోట్లు నమోదైంది. టర్నోవర్ 6.4 శాతం ఎగసి రూ.7,433 కోట్లను తాకింది.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోరమాండల్ షేరు ధర 2.46 శాతం లాభపడి రూ.1,640 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment