హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ కాకినాడ యూనిట్‌లో ఫాస్ఫరిక్, సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదం పొందింది. రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 750 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 1,800 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నూతన కేంద్రాలను జోడించనున్నారు. ఇందుకోసం రూ.1,029 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది.
24 నెలల్లో ఈ విస్తరణ పూర్తి కానున్నట్టు వెల్లడించింది. కాకినాడ యూనిట్ సామర్థ్యం రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 1,550 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 4,200 టన్నులు ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యాన్ని కంపెనీ వినియోగించుకుంటోంది. ఎరువుల తయారీలో ఈ యాసిడ్స్‌ను ఉపయోగిస్తారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, తయారీ సామర్థ్యం పెంపొందించుకునేందుకు విస్తరణ చేపడుతున్నట్టు కంపెనీ వెల్లడించింది.
పూర్తి స్థాయి ప్లాంటుగా..
పాస్ఫేటిక్ ఎరువుల తయారీ, విక్రయంలో భారత్‌లో కోరమాండల్ రెండవ స్థానంలో నిలిచింది. ముడిసరుకు, ఎరువుల తయారీలో పూర్తి స్థాయి ప్లాంటుగా కాకినాడ కేంద్రాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. ప్రతిపాదిత విస్తరణతో కంపెనీ వ్యయ సామర్థ్యాలను, ముడిసరుకు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వివరించారు. డ్రోన్స్ తయారీలో ఉన్న తమ అనుబంధ కంపెనీ ధక్ష బలమైన ఆర్డర్ బుక్ నమోదు చేసిందని చెప్పారు. రక్షణ రంగం, వ్యవసాయంతోపాటు వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు పొందామన్నారు. గ్రోమోర్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కంపెనీ ప్రోత్సహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment