కాల్చి పడేసిన సిగరెట్టే బోట్ల దగ్ధానికి కారణం  | CP Ravi Shankar On A case of fire in Visakhapatnam Harbour | Sakshi
Sakshi News home page

కాల్చి పడేసిన సిగరెట్టే బోట్ల దగ్ధానికి కారణం 

Published Sun, Nov 26 2023 5:27 AM | Last Updated on Sun, Nov 26 2023 5:27 AM

CP Ravi Shankar On A case of fire in Visakhapatnam Harbour - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న విశాఖ సీపీ రవిశంకర్‌

దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇద్దరు వ్యక్తుల బాధ్యతా రాహిత్యం, కాల్చి పడేసిన సిగరెట్‌ విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదానికి కారణమైంది. 48 బోట్లను దగ్ధం చేసింది. రూ.కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. వారిద్దరూ మద్యం తాగి, సగం కాల్చిన సిగరెట్‌ను బోటులో విసిరేయడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు నిర్ధారణైంది. సీసీ కెమెరాల దృశ్యాలు, లోతైన దర్యాప్తు ద్వారా వాసుపల్లి నాని (23) అలియాస్‌ దొంగ కోళ్లు, అతని మామ అల్లిపల్లి సత్యం అలియాస్‌ పట్టా ఇందుకు కారణంగా పోలీసులు గుర్తించారు. శనివారం వారిద్దరినీ అరెస్టు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ తెలిపారు.

ఆయన శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాలుగు ప్రత్యేక బృందాలు 47 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, ఆ ఘటన సమయంలో సెల్‌ టవర్‌ ఆధారంగా జట్టీలో ఉన్న వారి వివరాలను సేకరించాయని, పూర్తి ఆధారాలతో నిందితులను గుర్తించామని చెప్పారు. నాని పేరుతో ముగ్గురు ఉండడం వల్ల యూట్యూబర్‌ నానిని కూడా విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నామని, ఈ ఘటనతో అతనికి సంబంధం లేదని నిర్ధారణ అయిన తరువాత పంపించేశామని వివరించారు. కమిషనర్‌ తెలిపిన వివరాల ప్రకారం..  

భీమిలి మండలం ఉప్పాడకు చెందిన వాసుపల్లి నాని వన్‌టౌన్‌ చెంగలరావుపేట బజార్‌ వద్ద ఉంటున్నాడు. నాని ఒక బోటుకు వాచ్‌మేన్‌గా ఆరేళ్లు, మత్స్యకారుడిగా రెండేళ్లు పనిచేశాడు. అతను పనిచేసే పుక్కళ్ల మసేను బోటు మరమ్మతుకు గురవడంతో ఆరు నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. మద్యం సేవించేందుకు నిత్యం హార్బర్‌కు వెళుతున్నాడు. అలాగే ఈ నెల 19న సాయంత్రం 6.30కి నాని అతని మావయ్య అల్లిపల్లి సత్యంతో కలిసి హోండా డియో స్కూటర్‌ మీద వెళ్లి రాణీ బొమ్మ జంక్షన్‌ వద్ద లిక్కర్, జీరో జెట్టీ వద్ద సిగరెట్లు, అగ్గిపెట్టె కొన్నారు.

రాత్రి 8.30కు అల్లిపిల్లి వెంకటేష్ కు చెందిన 887 నంబరు బోటులోకి వెళ్లారు. లోపల గ్యాస్‌ స్టవ్‌పై ఎండు చేపలు గ్రిల్‌ చేసుకొని, మద్యం తాగారు. కొంత సేపటి తరువాత నాని సిగరెట్‌ సగం కాల్చి పక్కన ఉన్న మున్నెం హరి సీతారామ్‌కు చెందిన 815 నంబరు బోటులో విసిరాడు. సిగరెట్‌ అందులోని నైలాన్‌ వలపై పడడంతో నెమ్మదిగా మంట రాజుకుంది. కొంత సేపటికి భారీగా పొగ, మంట రావడంతో వారిద్దరూ భయంతో అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. 

సిలిండర్లు, డీజిల్‌ ఉండడంతో మంటలు వ్యాప్తి 
మరునాడు వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు బోట్లలో సిలిండర్లు, భారీగా డీజిల్‌ సిద్ధం చేసుకున్నారు. వీటి కారణంగా మంటలు మరింత ఎగసిపడ్డాయి. సిలిండర్లు పేలడం, అదే సమయంలో తీవ్రమైన గాలుల కారణంగా మంటలు పక్కన ఉన్న బోట్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా.. 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా రూ.8.9 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 

47 సీసీ కెమెరాలు పరిశీలించి.. 
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ హార్బర్‌ ఏసీపీ మోసెస్‌ పాల్‌ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. స్థానికుల సమాచారం మేరకు కొందరు అనుమానితులను విచారించారు. యూట్యూబర్‌ నాని, అదే పేరుతో ఉన్న మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. మరికొంత మందిని కూడా విచారించారు. యూట్యూబర్‌ నాని ప్రమాద సమయంలో ఒక హోటల్‌లో ఉన్నట్లు గుర్తించి అతని ప్రమేయం లేనట్లు నిర్ధారణకు వచ్చారు.

మిగిలిన వారు చెప్పిన వివరాలతో పాటు ఆ సమయంలో హార్బర్‌లో ఉన్న వారి మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. ఘటన స్థలంలో ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరించారు. ప్రమాద సమయంలో హార్బర్‌ నుంచి హడావుడిగా వెళుతున్న వాసుపల్లి నాని, సత్యంలను సీసీ కెమెరాల్లో గుర్తించారు. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి సాంకేతిక ఆధారాలతో వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ తెలిపారు. వీరిపై 437, 438, 285 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్లు బి.భాస్కరరావు, ఇ.నరసింహారావు, జి.డి.బాబు, వి.వి.సి.ఎం.యర్రంనాయుడు బృందాలను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో డీసీపీ–2 కె.ఆనందరెడ్డి, హార్బర్‌ ఏసీపీ మోసెస్‌ పాల్, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. 

ప్రమేయం లేకుండానే అరెస్టు చేస్తారా? 
డాబాగార్డెన్స్‌: ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదం కేసులో వాసుపల్లి నాని, సత్యం ప్రమేయం లేకుండానే అరెస్టు చేశారంటూ వారి కుటుంబ సభ్యులు శనివారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. మత్స్యకార మహిళలు రోడ్డుపై భైఠాయించారు. ఘటన సమయంలో వాసుపల్లి నాని, సత్యం అక్కడ లేరని, తప్పుడు సాక్ష్యాలతో అరెస్టు చేశారని, వారిని విడిచి పెట్టాలని డిమాండ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement