Visakhapatnam Harbour
-
కాల్చి పడేసిన సిగరెట్టే బోట్ల దగ్ధానికి కారణం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇద్దరు వ్యక్తుల బాధ్యతా రాహిత్యం, కాల్చి పడేసిన సిగరెట్ విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదానికి కారణమైంది. 48 బోట్లను దగ్ధం చేసింది. రూ.కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. వారిద్దరూ మద్యం తాగి, సగం కాల్చిన సిగరెట్‌ను బోటులో విసిరేయడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు నిర్ధారణైంది. సీసీ కెమెరాల దృశ్యాలు, లోతైన దర్యాప్తు ద్వారా వాసుపల్లి నాని (23) అలియాస్ దొంగ కోళ్లు, అతని మామ అల్లిపల్లి సత్యం అలియాస్ పట్టా ఇందుకు కారణంగా పోలీసులు గుర్తించారు. శనివారం వారిద్దరినీ అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాలుగు ప్రత్యేక బృందాలు 47 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, ఆ ఘటన సమయంలో సెల్ టవర్ ఆధారంగా జట్టీలో ఉన్న వారి వివరాలను సేకరించాయని, పూర్తి ఆధారాలతో నిందితులను గుర్తించామని చెప్పారు. నాని పేరుతో ముగ్గురు ఉండడం వల్ల యూట్యూబర్ నానిని కూడా విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నామని, ఈ ఘటనతో అతనికి సంబంధం లేదని నిర్ధారణ అయిన తరువాత పంపించేశామని వివరించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమిలి మండలం ఉప్పాడకు చెందిన వాసుపల్లి నాని వన్‌టౌన్ చెంగలరావుపేట బజార్ వద్ద ఉంటున్నాడు. నాని ఒక బోటుకు వాచ్‌మేన్‌గా ఆరేళ్లు, మత్స్యకారుడిగా రెండేళ్లు పనిచేశాడు. అతను పనిచేసే పుక్కళ్ల మసేను బోటు మరమ్మతుకు గురవడంతో ఆరు నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. మద్యం సేవించేందుకు నిత్యం హార్బర్‌కు వెళుతున్నాడు. అలాగే ఈ నెల 19న సాయంత్రం 6.30కి నాని అతని మావయ్య అల్లిపల్లి సత్యంతో కలిసి హోండా డియో స్కూటర్ మీద వెళ్లి రాణీ బొమ్మ జంక్షన్ వద్ద లిక్కర్, జీరో జెట్టీ వద్ద సిగరెట్లు, అగ్గిపెట్టె కొన్నారు. రాత్రి 8.30కు అల్లిపిల్లి వెంకటేష్ కు చెందిన 887 నంబరు బోటులోకి వెళ్లారు. లోపల గ్యాస్ స్టవ్‌పై ఎండు చేపలు గ్రిల్ చేసుకొని, మద్యం తాగారు. కొంత సేపటి తరువాత నాని సిగరెట్ సగం కాల్చి పక్కన ఉన్న మున్నెం హరి సీతారామ్‌కు చెందిన 815 నంబరు బోటులో విసిరాడు. సిగరెట్ అందులోని నైలాన్ వలపై పడడంతో నెమ్మదిగా మంట రాజుకుంది. కొంత సేపటికి భారీగా పొగ, మంట రావడంతో వారిద్దరూ భయంతో అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. సిలిండర్లు, డీజిల్ ఉండడంతో మంటలు వ్యాప్తి మరునాడు వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు బోట్లలో సిలిండర్లు, భారీగా డీజిల్ సిద్ధం చేసుకున్నారు. వీటి కారణంగా మంటలు మరింత ఎగసిపడ్డాయి. సిలిండర్లు పేలడం, అదే సమయంలో తీవ్రమైన గాలుల కారణంగా మంటలు పక్కన ఉన్న బోట్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా.. 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా రూ.8.9 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 47 సీసీ కెమెరాలు పరిశీలించి.. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ హార్బర్ ఏసీపీ మోసెస్ పాల్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. స్థానికుల సమాచారం మేరకు కొందరు అనుమానితులను విచారించారు. యూట్యూబర్ నాని, అదే పేరుతో ఉన్న మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. మరికొంత మందిని కూడా విచారించారు. యూట్యూబర్ నాని ప్రమాద సమయంలో ఒక హోటల్లో ఉన్నట్లు గుర్తించి అతని ప్రమేయం లేనట్లు నిర్ధారణకు వచ్చారు. మిగిలిన వారు చెప్పిన వివరాలతో పాటు ఆ సమయంలో హార్బర్లో ఉన్న వారి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. ఘటన స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ప్రమాద సమయంలో హార్బర్ నుంచి హడావుడిగా వెళుతున్న వాసుపల్లి నాని, సత్యంలను సీసీ కెమెరాల్లో గుర్తించారు. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సాంకేతిక ఆధారాలతో వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. వీరిపై 437, 438, 285 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్లు బి.భాస్కరరావు, ఇ.నరసింహారావు, జి.డి.బాబు, వి.వి.సి.ఎం.యర్రంనాయుడు బృందాలను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో డీసీపీ–2 కె.ఆనందరెడ్డి, హార్బర్ ఏసీపీ మోసెస్ పాల్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ప్రమేయం లేకుండానే అరెస్టు చేస్తారా? డాబాగార్డెన్స్: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో వాసుపల్లి నాని, సత్యం ప్రమేయం లేకుండానే అరెస్టు చేశారంటూ వారి కుటుంబ సభ్యులు శనివారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. మత్స్యకార మహిళలు రోడ్డుపై భైఠాయించారు. ఘటన సమయంలో వాసుపల్లి నాని, సత్యం అక్కడ లేరని, తప్పుడు సాక్ష్యాలతో అరెస్టు చేశారని, వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. -
టగ్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ముంబైకి తరలింపు
సాక్షి, ద్వారకనగర్(విశాఖ దక్షిణం): ఈనెల 13వ తేదీన విశాఖ సాగర తీరానికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన టగ్ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలపాలైన జువిన్ జోషి(24)ని మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఆదేశాల మేరకు బాధితుడిని ఆదివారం ముంబైలోని ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించినట్టు జాయింట్ కలెక్టర్–2 ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరలింపు బాధ్యతలను జేసీ–2, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పర్యవేక్షించారు. చదవండి: టగ్ ఆన్ ఫైర్ -
కడలిలో కల్లోలం
విశాఖ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ల దూరం.. సమయం ఉదయం సుమారు 11.30 గంటలు.. హఠాత్తుగా కడలిలో కల్లోలం.. నీళ్లలో నిప్పు.. హెచ్‌పీసీఎల్‌కు చెందిన భారీ క్రూడ్ నౌక వద్దకు వెళ్లిన టగ్‌లో ఒక్కసారిగా పేలుడు.. ఆ వెంటనే మంటలు క్షణాల్లో నౌకను అంటుకున్నాయి. ఊహించని ఈ పరిణామంతో టగ్‌లోని సిబ్బంది హాహాకారాలు చేశారు. రక్షించమని ఆర్తనాదాలు చేశారు. ఆ సమయంలో అందులో 23 మంది సిబ్బంది ఉండగా.. ఎనిమిది మంది భయంతోనో.. ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకునేందుకో నౌక నుంచి సముద్రంలోకి దూకేశారు. ఆ ప్రయత్నంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరొకరి జాడ తెలియరాలేదు. నౌకలో ఉన్న మిగిలిన 15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డు, పోర్టులకు చెందిన సుమారు ఆరు నౌకలు మంటలను ఆర్పేసి.. క్షతగాత్రులను వేరే బోట్లలో జెట్టీకి చేర్చాయి. వారందరినీ నేవీకి చెందిన ఐఎన్ఎస్ కల్యాణితోపాటు మైక్యూర్ ఆస్పత్రిలో చేర్చారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గాయపడిన వారిలో నలుగురు మన రాష్ట్రానికి చెందినవారు కాగా.. మిగిలిన వారందరూ ఇతర రాష్ట్రాలకు చెందినవారు. ఔటర్ హార్బర్లో లంగరు వేసిన నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకురావడం.. ఔటర్లో ఉన్న భారీ నౌకల్లో నిర్వహణ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్లడానికి వినియోగించే చిన్న నౌకలను టగ్‌లుగా వ్యవహరిస్తుంటారు. సరిగా ఆ పనుల కోపమే హెచ్‌పీసీఎల్ అద్దెకు తీసుకున్న జాగ్వర్ టగ్లోనే దుర్ఘటన జరిగింది. సాక్షి, విశాఖపట్నం/పాత పోస్టాఫీస్(విశాఖ దక్షిణ): సోమవారం ఉదయం 11 గంటలు... అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ హార్బర్లో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. అక్కడికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో సంభవించిన అగ్ని ప్రమాదంతో రోదనలు మిన్నం టాయి. వివరాల్లోకి వెళ్తే... హెచ్‌పీసీఎల్‌కు క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే భారీ నౌకలను నిలిపి ఉంచే ప్రాంతానికి కోమాకో సంస్థ సిబ్బంది కోస్టల్ జాగ్వార్ టగ్‌తో చేరుకుని నిర్వహణ పనులు చేస్తున్నారు. ఈ టగ్‌ను హెచ్‌పీసీఎల్ సంస్థ అద్దెకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చిన భారీ నౌక వద్దకు జాగ్వార్‌తో 23 మంది సిబ్బంది చేరుకుని నిర్వహణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో నౌకకు టగ్‌ను అనుసంధానించే క్రమంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా వ్యాపించాయి. అనూహ్య పరిణామంతో సిబ్బందిలో 8 మంది సముద్రంలో దూకేశారు. మిగిలిన 15 మంది మంటల్లో చిక్కుకున్నారు. నౌకలో మంటలు చెలరేగి దట్టంగా పొగలు కమ్ముకుంటున్న సమయంలో పోర్టు ఛానల్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గమనించి పోర్టు కంట్రోల్ – 1కు సమాచారం అందించారు. అదే సమయంలో సమీపంలో ఉన్న కోస్ట్‌గార్డు సిబ్బందికి జాగ్వార్ ట్రగ్లో ఉన్న సిబ్బంది వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. కోస్ట్‌గార్డు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురిని రక్షించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మరణించగా మరొకరు గల్లంతయ్యారు. టగ్‌లో గాయపడిన 15 మందిని పోర్ట్ ప్రథమ చికిత్సా లాంచీల ద్వారా జీసీబీ జెట్టీ వద్దకు తరలించారు. అక్కడి నుంచి నగరంలోని జిల్లా పరిషత్ వెనుక గల మై క్యూర్ ఆస్పత్రికి, ఐఎన్ఎస్ కల్యాణికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. 15 మంది క్షతగాత్రులో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా ఇద్దరు తూర్పు గోదావరి జిల్లా వాళ్లు, విశాఖ, శ్రీకాకుళంకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, పోర్టు అధికారులు వెంటనే స్పందించి తగిన సహాయ చర్యలు చేపట్టినట్టు పోర్టు వర్గాలు తెలిపాయి. పోర్టు తరపున సీ లయన్ ఏజిల్, సీ లయన్ సెంటినల్, సర్దార్ పటేల్, ఫైర్ ఫ్లోట్, కోస్ట్‌గార్డ్ తరపున రాణి రోష్మణి, చార్లి సీ 432 నౌకలు, వెసల్ సీజీ – 81లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించడంతోపాటు నౌకలోని మంటలను ఆదుపుచేశాయి. తల్లడిల్లిన భరద్వాజ్ తల్లి.. విశాఖపట్నం పాతపోస్టాఫీస్ కోటవీధిలో నివసిస్తున్న కాశారపు భరద్వాజ్(23)కి 90 శాతం శరీరం కాలిపోయి ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు. ఆస్పత్రికి చేరుకున్న అతని తల్లి తీవ్ర మనస్తాపానికి గురై సొమ్మసిల్లి పోయింది. కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది. మెరుగైన చికిత్సకు చర్యలు అగ్ని ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి వర్గాలకు తెలియజేశాం. ప్రభుత్వం తరపున చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ – 2 మైక్యూర్లో చికిత్స పొందుతున్న వారు 1. కన్నయ్య (44)..గుజరాత్ 2. వై.సత్తిబాబు (39)..తూర్పు గోదావరి 3. రామ్ నివాస్ యాదవ్ (64)..హర్యానా 4. రోహిత్ చౌహాన్ (31)..ఉత్తర ప్రదేశ్ 5. శ్యాం కె.అర్జున్ (25)..కేరళ 6. మంజిత్ కుమార్ (27)..ఉత్తర ప్రదేశ్ 7. రాకేష్ కుమార్ (27)..జార్ఖండ్ 8. ముఖేష్ కుమార్ (35)..హర్యానా 9. కమల్‌కాంత్ (24)...బీహార్ -
పోర్టులో కరిగిన యూరియా!
40 వేల టన్నుల యూరియా, పొటాషియం నీటి పాలు నిల్వలు బూస్టర్ డోస్‌కి సరిపోతాయి రబీకి గడ్డు కాలం.. సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను ప్రభావం ఎరువుల కంపెనీలనూ తాకింది. తుపానుతో కురిసిన భారీ వర్షాలు, పెనుగాలులకు విశాఖ హార్బర్లో నిల్వ చేసిన వేలాది టన్నుల ఎరువులు తడిసి ముద్దయ్యాయి. ఏయే కంపెనీకి ఎంత నష్టం వాటిల్లో ఇంకా స్పష్టం కానప్పటికీ ప్రధాన ఎరువుల కంపెనీలన్నీ తుపాను నష్టాన్ని చవిచూశాయి. నష్టం అంచనాకు ఆయా కంపెనీల అధికారులు ఆందోళనతో విశాఖపట్నం వైపు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్), కోరమాండల్ ఇంటర్నేషనల్, ఇఫ్కో, క్రిబ్కో, నాగార్జున వంటి ప్రముఖ ఎరువుల కంపెనీలన్నీ ప్రధాన ఓడరేవుల ద్వారా ఎరువుల్ని దిగుమతి చేస్తుంటాయి. వచ్చిన సరుకును ఆయా కేంద్రాలకు పంపే వరకు నిల్వ చేసుకునేలా ఓడరేవుల్లో ఎరువుల కంపెనీలకు గిడ్డంగులు కూడా ఉంటాయి. ఎగసిపడిన అలలకు విశాఖ హార్బర్ గోడలు కూలడంతో ఎరువుల కంపెనీలకు ఇచ్చిన గిడ్డంగులూ ధ్వంసమైయ్యాయి. ఫలితంగా వాటిల్లో నిల్వ ఉంచిన డిఎపీ, పొటాషియం, యూరియా వంటి ఎరువులు పాడై పోగా ఓడల నుంచి కంటైనర్ల నుంచి దించని ఎరువులు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. పాడైన ఎరువుల విలువ సుమారు సుమారు రూ.30 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. నష్టం విషయం తెలుసుకున్న ఎరువుల కంపెనీల ప్రతినిధులు హుటాహుటిన విశాఖ బయల్దేరారు. కాకినాడ నుంచి ఇఫ్కో కంపెనీ అధికారులు ఇప్పటికే విశాఖ పట్నం చేరుకుని తమ గిడ్డంగిలో నిల్వ ఉంచిన సూక్ష్మపోషకాల ఎరువులకు కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. తమ వద్ద యూరియా నిల్వలు లేవని తేల్చినట్టు ప్రాథమిక సమాచారం. ఐపీఎల్ కంపెనీకి విశాఖ హార్బర్లో మూడు గిడ్డంగులున్నాయి. వాటిల్లో ఏయే సరకు నిల్వ ఉన్నది ఇంకా తేలలేదు. గుజరాత్ నుంచి ప్రతినిధులు రానున్నారు. నీటిపాలైన క్రిబ్కో యూరియా.. ఈ తుపానులో క్రిబ్కో కంపెనీ ఎక్కువగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే ఒమన్‌లోని తన కర్మాగారం నుంచి 32 వేల టన్నుల యూరియాను తెప్పించింది. ఓడ నుంచి సరకును దించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్న దశలో తుపాను వచ్చింది. దీంతో ఏ ఒక్క బస్తా బయటకు వెళ్లలేదు. నీటిలో నాని కొంత మొత్తం కరిగిపోగా, మరికొంత గడ్డకట్టుకుపోయింది. దీనివల్ల ఈ కంపెనీకి రూ.17 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. ఇదేమాదిరిగా మిగతా కంపెనీల గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 8 వేల టన్నుల పొటాషియం, డీఏపీ తదితర ఎరువులకు నష్టం వాటిల్లింది. దీని విలువ సుమారు రూ.12 నుంచి 13 కోట్ల రూపాయలకుపైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రబీ సీజన్లో యూరియా కొరత తప్పదా? తుపాను పీడిత ప్రాంతాల్లో వరి, ఇతర ఉద్యానవన పంటలకు బూస్టర్ డోస్ కింద యూరియా, పొటాష్‌ను వాడతారు. ఎకరాకు 20 కిలోల యూరియా, పది కిలోల పొటాష్ అవసరం. అనుకోని ఈ విపత్తుకు ప్రస్తుత నిల్వల నుంచి ఈ ఎరువుల్ని వినియోగించమని వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఇంతవరకు సజావుగానే ఉన్నా అక్టోబర్ నుంచి మొదలయిన రబీ సీజన్ పంటలకు యూరియా కొరత తప్పేలా లేదు. ప్రస్తుత అవసరాల కోసం తెప్పించిన యూరియా తడిసిపోవడంతో ఇప్పటికిప్పుడు తిరిగి తయారుచేయడం కష్టం. దీని ప్రభావం రబీ పంటలపై పడుతుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.