విశాఖ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ల దూరం.. సమయం ఉదయం సుమారు 11.30 గంటలు.. హఠాత్తుగా కడలిలో కల్లోలం.. నీళ్లలో నిప్పు.. హెచ్‌పీసీఎల్‌కు చెందిన భారీ క్రూడ్ నౌక వద్దకు వెళ్లిన టగ్‌లో ఒక్కసారిగా పేలుడు.. ఆ వెంటనే మంటలు క్షణాల్లో నౌకను అంటుకున్నాయి. ఊహించని ఈ పరిణామంతో టగ్‌లోని సిబ్బంది హాహాకారాలు చేశారు. రక్షించమని ఆర్తనాదాలు చేశారు. ఆ సమయంలో అందులో 23 మంది సిబ్బంది ఉండగా.. ఎనిమిది మంది భయంతోనో.. ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకునేందుకో నౌక నుంచి సముద్రంలోకి దూకేశారు. ఆ ప్రయత్నంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరొకరి జాడ తెలియరాలేదు. నౌకలో ఉన్న మిగిలిన 15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డు, పోర్టులకు చెందిన సుమారు ఆరు నౌకలు మంటలను ఆర్పేసి.. క్షతగాత్రులను వేరే బోట్లలో జెట్టీకి చేర్చాయి. వారందరినీ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ కల్యాణితోపాటు మైక్యూర్ ఆస్పత్రిలో చేర్చారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గాయపడిన వారిలో నలుగురు మన రాష్ట్రానికి చెందినవారు కాగా.. మిగిలిన వారందరూ ఇతర రాష్ట్రాలకు చెందినవారు. ఔటర్ హార్బర్‌లో లంగరు వేసిన నౌకలను ఇన్నర్ హార్బర్‌లోకి తీసుకురావడం.. ఔటర్‌లో ఉన్న భారీ నౌకల్లో నిర్వహణ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్లడానికి వినియోగించే చిన్న నౌకలను టగ్‌లుగా వ్యవహరిస్తుంటారు. సరిగా ఆ పనుల కోపమే హెచ్‌పీసీఎల్ అద్దెకు తీసుకున్న జాగ్వర్ టగ్‌లోనే దుర్ఘటన జరిగింది.
సాక్షి, విశాఖపట్నం/పాత పోస్టాఫీస్(విశాఖ దక్షిణ): సోమవారం ఉదయం 11 గంటలు... అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ హార్బర్‌లో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. అక్కడికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో సంభవించిన అగ్ని ప్రమాదంతో రోదనలు మిన్నం టాయి. వివరాల్లోకి వెళ్తే... హెచ్‌పీసీఎల్‌కు క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే భారీ నౌకలను నిలిపి ఉంచే ప్రాంతానికి కోమాకో సంస్థ సిబ్బంది కోస్టల్ జాగ్వార్ టగ్‌తో చేరుకుని నిర్వహణ పనులు చేస్తున్నారు. ఈ టగ్‌ను హెచ్‌పీసీఎల్ సంస్థ అద్దెకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చిన భారీ నౌక వద్దకు జాగ్వార్‌తో 23 మంది సిబ్బంది చేరుకుని నిర్వహణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో నౌకకు టగ్‌ను అనుసంధానించే క్రమంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా వ్యాపించాయి. అనూహ్య పరిణామంతో సిబ్బందిలో 8 మంది సముద్రంలో దూకేశారు. మిగిలిన 15 మంది మంటల్లో చిక్కుకున్నారు.
నౌకలో మంటలు చెలరేగి దట్టంగా పొగలు కమ్ముకుంటున్న సమయంలో పోర్టు ఛానల్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గమనించి పోర్టు కంట్రోల్ – 1కు సమాచారం అందించారు. అదే సమయంలో సమీపంలో ఉన్న కోస్ట్‌గార్డు సిబ్బందికి జాగ్వార్ ట్రగ్‌లో ఉన్న సిబ్బంది వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. కోస్ట్‌గార్డు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురిని రక్షించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మరణించగా మరొకరు గల్లంతయ్యారు. టగ్‌లో గాయపడిన 15 మందిని పోర్ట్ ప్రథమ చికిత్సా లాంచీల ద్వారా జీసీబీ జెట్టీ వద్దకు తరలించారు. అక్కడి నుంచి నగరంలోని జిల్లా పరిషత్ వెనుక గల మై క్యూర్ ఆస్పత్రికి, ఐఎన్‌ఎస్ కల్యాణికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. 15 మంది క్షతగాత్రులో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా ఇద్దరు తూర్పు గోదావరి జిల్లా వాళ్లు, విశాఖ, శ్రీకాకుళంకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, పోర్టు అధికారులు వెంటనే స్పందించి తగిన సహాయ చర్యలు చేపట్టినట్టు పోర్టు వర్గాలు తెలిపాయి. పోర్టు తరపున సీ లయన్ ఏజిల్, సీ లయన్ సెంటినల్, సర్దార్ పటేల్, ఫైర్ ఫ్లోట్, కోస్ట్‌గార్డ్ తరపున రాణి రోష్మణి, చార్లి సీ 432 నౌకలు, వెసల్ సీజీ – 81లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించడంతోపాటు నౌకలోని మంటలను ఆదుపుచేశాయి.
తల్లడిల్లిన భరద్వాజ్ తల్లి..
విశాఖపట్నం పాతపోస్టాఫీస్ కోటవీధిలో నివసిస్తున్న కాశారపు భరద్వాజ్(23)కి 90 శాతం శరీరం కాలిపోయి ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు. ఆస్పత్రికి చేరుకున్న అతని తల్లి తీవ్ర మనస్తాపానికి గురై సొమ్మసిల్లి పోయింది. కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది.
మెరుగైన చికిత్సకు చర్యలు
అగ్ని ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి వర్గాలకు తెలియజేశాం. ప్రభుత్వం తరపున చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ – 2
మైక్యూర్‌లో చికిత్స పొందుతున్న వారు
1. కన్నయ్య (44)..గుజరాత్
2. వై.సత్తిబాబు (39)..తూర్పు గోదావరి
3. రామ్ నివాస్ యాదవ్ (64)..హర్యానా
4. రోహిత్ చౌహాన్ (31)..ఉత్తర ప్రదేశ్
5. శ్యాం కె.అర్జున్ (25)..కేరళ
6. మంజిత్ కుమార్ (27)..ఉత్తర ప్రదేశ్
7. రాకేష్ కుమార్ (27)..జార్ఖండ్
8. ముఖేష్ కుమార్ (35)..హర్యానా
9. కమల్‌కాంత్ (24)...బీహార్
Comments
Please login to add a commentAdd a comment