హుదూద్ పోర్టల్ సిద్ధం: పరకాల
విశాఖపట్నం:సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా హుదూద్ తుపానును ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుపాను నష్టాలను ఆన్‌లైన్‌లో పరిశీలించేందుకు హుదూద్ పోర్టల్‌ను ఏర్పాటు చేశామన్నారు. www.hudhud.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తుపానుకు సంబంధించి ప్రజలు తమ సలహా లు, ఫిర్యాదులతో పాటు జరిగిన నష్టాన్ని ఫొటో తీసి పొందుపర్చవచ్చని, తద్వారా పరిహారాన్ని పొందవచ్చని సూచించారు.
నష్టం అంచనాలు వేసే బృందాలకు ప్రభుత్వం ట్యాబ్‌లను అందించినట్లు తెలిపారు. విశాఖలో 300, విజయనగరంలో 100, శ్రీకాకుళానికి 100 ట్యాబ్‌లను ఇచ్చామన్నారు. వీటిలో నష్టం వివరాలను నమోదు చేస్తే పోర్టల్ ద్వారా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవచ్చన్నారు. సైట్ ద్వారా వివిధ పనుల మరమ్మతు సేవలను కూడా ఉచితంగా పొందవచ్చన్నారు. నిత్యావసరాలను కొంత మంది డీలర్లు ఇవ్వడం లేదన్న వార్తలు వస్తున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.