parakala Prabhakar
-
ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవే!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ - తెలంగాణ సమాచారాన్ని ఏపీ చోరీ చేసిందనడం హాస్యాస్పదం - గతేడాది ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ రెండో స్థానం, తెలంగాణది 13వ స్థానం - ఈసారి కూడా అధమ స్థానంలో నిలుస్తామనే కేటీఆర్ ఆరోపణలు సాక్షి, హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింట్ బిజినెస్(ఈవోబీడీ) విధానంలో డీఐపీపీ(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్), ప్రపంచ బ్యాంకు ర్యాంకు కోసం తమ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా చోరీ చేసిందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కొట్టిపారేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గతేడాది డీఐపీపీ ప్రకటించిన ర్యాంకుల్లో ఈవోబీడీలో గుజరాత్ 71.14 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, 70.12 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. 42.45 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ సర్కార్ సమాచారాన్ని రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చౌర్యం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఈ ఏడాదీ అధమ స్థానంలో నిలుస్తామనే భావనతోనే తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులు ఇప్పటినుంచే సాకులు వెతుక్కుంటూ చంద్రబాబు సర్కార్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈవోబీడీ విధానంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం తెలంగాణ సర్కార్‌కు ఎలా తెలి సిందని ప్రశ్నించారు. కేవలం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేస్తేనే తమ ప్రభుత్వం కేంద్రానికి ఏ ప్రతిపాదనలు ఇచ్చిందన్నది తెలుస్తుందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తే నిజానిజాలు వెల్లడవుతాయని చెప్పారు. ఆధార్, పాన్, మొబైల్ నెంబర్లు వంటి వివరాలతో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పోర్టల్ సమగ్రంగా ఉందని.. తొమ్మిది వేల లావాదేవీలు జరిపిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అసమగ్రంగా ఉన్న వారి పోర్టల్ ద్వారా ఒక్క లావాదేవీ కూడా జరపలేదన్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాల వ్యాజ్యాల రుసుం ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించే అంశంపై ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు(ఆర్వోసీ 850/ఎస్వో/2015)ను జారీ చేసిందని.. ఇది రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని... దాన్ని పట్టుకుని తమ రిఫెరెన్స్ నెంబరుతో చౌర్యం చేశారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్‌లో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం, వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి తెలంగాణ సమాచారాన్ని చౌర్యం చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ఇవేవీ పట్టకుండా కేంద్రానికి ఫిర్యాదు చేసి చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వం హ్యాక్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అని ప్రశ్నించగా సూటిగా చెప్పకుండా సమాధానాన్ని దాటవేశారు. -
ప్రకాశం పంతులు గొప్ప సాహసి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఒంగోలు టౌన్ : ప్రకాశం పంతులు గొప్ప సాహసి, దూరదృష్టి కలిగిన నాయకుడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 144వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండూ ఇచ్చి రాష్ట్రాన్ని, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలన్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులు సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో అదేవిధంగా ప్రస్తుతం మనం ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. అనాలోచితంగా, అశాస్త్రీయంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ‘మేం ఇచ్చాం మీరు తీసుకురాలేదు’ అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రను గుర్తుచేస్తూ భారత రాజకీయాల్లో ప్రగాఢమైన ముద్ర వేసిన వ్యక్తి అని కొనియాడారు. ప్రకాశం పంతులకు ప్రధాన నగరాల్లో విలువైన స్థలాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని స్వాతంత్రోద్యమానికి అమ్మివేసి చివరకు గర్భదారిద్య్రాన్ని అనుభవించిన మహానుభావుడన్నారు. రాష్ట్ర రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రకాశం పంతులు త్యాగనిరతి, ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రకాశం పంతులు చిత్ర పటాలను ఏర్పాటు చేయాలని, అందుకు నిధులు అవసరమైతే జెడ్పీ నుంచి విడుదల చేస్తానని తెలిపారు. కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులని పేర్కొన్నారు. సంతనూతలపాడు శాసన సభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రకాశం పంతులు విలక్షణమైన జాతీయ నాయకుడని కొనియాడారు. ప్రకాశం పంతులు స్వీయచరిత్ర పుస్తకాన్ని ప్రతి విద్యార్థి చదవాల్సి ఉందన్నారు. ప్రజాసేవ కోసం తన ఆస్తులన్నింటిని అమ్మేసిన త్యాగశీలన్నారు. కొండపి శాసన సభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాణించిన గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులని కొనియాడారు. అన్ని డివిజన్ కేంద్రాల్లో ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు అశ్వద్ధనారాయణ, డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్, అడిషనల్ ఎస్పీ రామనాయక్, జాయింట్ కలెక్టర్-2 ఐ.ప్రకాష్‌కుమార్‌తో పాటు ప్రకాశం పంతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అశ్వద్ధనారాయణతో పాటు ప్రకాశం పంతులు రెండవ కుమారుని కుమార్తె జానకమ్మను ఈ సందర్భంగా సన్మానించారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినోదరాయునిపాలెంలో.. నాగులుప్పలపాడు : టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాన్ని ఆయన పుట్టిన ఊరు వినోదరాయునిపాలెంలో ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో వేడుకలు నిర్వహించారు. సంతనూతలపాడు శాసన సభ్యుడు ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టి తన మేథా సంపత్తితో ఇంగ్లాండ్‌లో బారిస్టర్ చదివి కోట్లు గడించారని తెలిపారు. అప్పట్లో మద్రాసు హైకోర్టుకు 7 గుర్రాల బండిపై వెళ్లిన జడ్జి కూడా లేరంటే అతిశయోక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తి దేశం మీద అభిమానంతో లాయర్ వృత్తికి కూడా సెలవు పెట్టి దేశ స్వాతంత్య్రం కోసం తెల్లదొరలపై పోరాడి తన ఆస్తినంత దేశ సేవ, ప్రజల కోసం వెచ్చించిన గొప్ప నాయకుడన్నారు. ప్రకాశంకు ఘన నివాళి ఒంగోలు కల్చరల్ : లాయరుపేట రైతు బజారు వద్దగల ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం కాంస్య విగ్రహానికి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, రాష్ర్ట రోడ్లు, భవనాలు, రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, కొండపి శాసన సభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ సుజాతశర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇతర సంఘాల ఆధ్వర్యంలో.. బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, చీమలమర్రి వెంకట సుబ్బారావు, రాష్ట్ర దేవాదాయ శాఖ హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ప్రకాశం, గుంటూరు జిల్లాల సమన్వయకర్త, ఆంధ్రకేసరి సేవా పరివార్ ఆర్గైనె జింగ్ సెక్రటరీ ఆలూరు వెంకట రమణారావు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకుడు టీవీ శ్రీరామమూర్తి, ఆంధ్ర కేసరి విగ్రహ కమిటీ అధ్యక్షుడు, ఆంధ్రకేసరి సేవా పరివార్ జనరల్ సెక్రటరీ పొన్నలూరి శ్రీనివాసఫణి, టంగుటూరి ప్రకాశం మునిమనుమడు టంగుటూరి సంతోష్, ధేనువకొండ వెంకట సుబ్బయ్య, ఎస్ఏటీ రాజేష్, కాళిదాసు శివరాం, పి.వెంకటేశ్వర్లు, జగద్గురు ఆదిశంకరాచార్య హిందూ ధర్మప్రచార ట్రస్టు అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస శాస్త్రి, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు శేషయ్య, సనాతన ధార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వయంపాకుల యలమందల కోటేశ్వర శర్మ తదితరులు ప్రకాశంకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
'టీటీడీ బోర్డు నియామకంపై నిర్ణయం తీసుకోలేదు'
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు నియామకంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్సష్టం చేశారు. టీటీడీ ఛైర్మన్‌గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీటీడీ పాలకవర్గంలో 18 మంది సభ్యులను కూడా నియమించినట్లు, కొందరి పేర్లతో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో టీటీడీ బోర్డు నియామకంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పరకాల తెలిపారు. గత ఏడాది ఆగస్టులో టీటీడీ పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి నూతన పాలక మండలిని నియమించలేదు. పాలకమండలి నియామకానికి సంబంధించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. -
మంత్రివర్గంలోకి పరకాల!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్‌ను రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు తెలిసింది. ఆయనను గవర్నర్ నామినేటెడ్ కోటాలో లేదా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే నెలలో షెడ్యూల్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగానే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరకాలను సమాచార సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. -
వ్యవసాయ రుణాలంటే పంట రుణాలే
చంద్రబాబు అదే అర్థంలో చెప్పారు: పరకాల భాష్యం ప్రతిపక్ష నేత జగన్‌కు స్పష్టత లేకపోవడం వల్లే ఆరోపణలు ఈ నెల 10వ తేదీ లోగా 71 శాతం మంది రైతులకు రుణ విముక్తి శనివారం రాత్రికి అర్హులైన రైతుల జాబితా ఆన్లైన్లో పెడతాం సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల పరిభాషలో.. సెరీకల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, గొర్రెల పెంపకం, ట్రాక్టర్లు, టిల్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు ఇచ్చిన అన్ని రకాల రుణాలను వ్యవసాయ రుణాలుగా పేర్కొంటారని.. అయితే చంద్రబాబు మాత్రం పంట రుణాలనే అర్థంలో మాత్రమే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల హామీల్లో చెప్పారని.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీకి కూడా ఇదే అర్థమని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సరికొత్త భాష్యం చెప్పారు. బాబు వ్యవసాయ రుణాలని చెప్పినా ప్రజలు పంట రుణాలనే అర్థం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పరకాల శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లని, దీనికి ఆధారంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) నివేదికను ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘అదే నివేదికలో ఏడో పేరాలో అన్ని రకాల వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లు ఉంటుంది. కానీ 10వ పేరా వరకు ప్రతిపక్ష నేత ఓపిగ్గా చదివితే వ్యవసాయ రుణాలు రూ. 49,774 కోట్లు కూడా కనిపించేది. ప్రతిపక్ష నేతకు సరైన సమాచారం లేక పొరపడ్డారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలు 32 లక్షలే... 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతు కుటుంబాలు 32 లక్షలే ఉన్నాయని పరకాల పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు మీరు (పరకాల ప్రభాకర్) టీడీపీతో లేరు కాబట్టి.. వ్యవసాయ రుణాలు, పంట రుణాలకు తేడా తెలియక, స్పష్టత లేకపోవడం వల్ల పంట రుణాలనే వ్యవసాయ రుణాలని బాబు పొరబడ్డారని మీరు భావిస్తున్నారా?’’ అని విలేకరులు అడిగినప్పుడు..ఆయనకు చాలా స్పష్టత ఉందని, వ్యవసాయ రుణాలంటే పంట రుణాలేనని ప్రజలూ అర్థం చేసుకున్నారని ఆయన సమాధానం చెప్పారు. తొలి దశలో 22.79 లక్షల (71 శాతం) మంది రైతులను రుణాల నుంచి విముక్తి చేయనున్నామని, ఈ నెల 10 లోగా వారి బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తామని పరకాల చెప్పారు. శనివారం రాత్రికి రుణ విముక్తికి అర్హులైన రైతుల జాబితాను ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. 22.79 లక్షల మంది రైతులకు ఉపశమనం కల్పించడానికి చెల్లిస్తున్న రుణాల మొత్తం ఎంత అనే విషయం మీద విలేకరులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినా.. ఆయన సమాధానం చెప్పలేదు. ‘‘మీరు ప్రశ్నలు అడుగుతున్నట్లుగా లేదు. నన్ను పరీక్షిస్తున్నట్లుగా ఉంది’’ అని ఆయన ఒక దశలో అభ్యంతరం చెప్పారు. మరో 45 రోజుల్లో రెండో దశ రుణ విముక్తి కూడా పూర్తి చేస్తామని పరకాల పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించాం... రుణమాఫీకి సంబంధించి జారీ చేసిన జీఓలో 2014 మార్చి వరకు తీసుకున్న రుణాలను చెల్లిస్తామని ఉందని, కానీ తీరా అమలు చేస్తున్న సమయంలో 2013 డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలనే చెల్లిస్తున్నారని, ఇది మాట తప్పడం కాదా? అని విలేకరులు ప్రశ్నించినప్పుడు.. రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించామనీ అంటే అన్ని సార్లు మాట తప్పినట్లా? అని ప్రశ్నించారు. -
పేరు రైతుది.. పవర్ హైదరాబాద్‌కా?
తెలంగాణ నేతలపై పరకాల ధ్వజం * శ్రీశైలం విద్యుత్‌ను ఏ వ్యవసాయ క్షేత్రానికి తరలించారు? * నగరంలో రెండున్నర గంటలు కోత పెట్టి వ్యవసాయానికి ఇవ్వొచ్చు.. అప్పుడు ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడు అవగాహన లోపంతోనే బాబుపై నిందలు సాక్షి, హైదరాబాద్ : రైతుల పేరుతో తెలంగాణ నేతలు నానా యాగీ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ధ్వజమెత్తారు. రైతుల పేరు చెప్పి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కారు.. అందులో ఏ రైతుకైనా ఒక్క యూనిట్ ఇచ్చారా అని నిలదీశారు. 1,307 మిలియన్ యూనిట్ల అక్రమ విద్యుత్‌ను ఏ గోతిలో పోశారని ప్రశ్నిం చారు. రైతుల పేరు చెప్పి విద్యుత్‌ను హైదరాబాద్‌కే తరలిస్తున్నారన్నారు. ఆ విద్యుత్‌ను ఏ వ్యవసాయ క్షేత్రానికి ఇచ్చారో తెలంగాణ ప్రజలు నిలదీయాలన్నారు. ఆయన మంగళవారం సచి వాలయంలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం విద్యుత్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేసే బదులు రైతులకు అందిస్తే ఆత్మహత్యలు ఉం డేవి కాదన్నారు. నగరంలో రోజూ రెండున్నర గంటలు కోత విధించి, ఆ విద్యుత్‌ను వ్యవసాయానికి అందిస్తే ప్రయోజనం ఉండేదని, అప్పుడు ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడని చెప్పారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ప్రభుత్వం ఈ పని చేసి ఉండేదన్నారు. సీఈఆర్సీ నిర్ణయానికి కట్టుబడతాం కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం విషయంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్ సీ) నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పరకాల చెప్పారు. ఇది ఏపీఈఆర్సీ పరిధిలోది కాదని ఆ సంస్థే తేల్చిందని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టు అయితేనే సీఈఆర్సీకి వెళ్లాలన్న విలేకరుల సందేహాన్ని ఆయన కొట్టిపారేశారు. కృష్ణపట్నం ప్రాజెక్టులో తెలంగాణకు వాటాలు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ ఒప్పందాలు జరగలేదని తెలిపారు. -
హుదూద్ పోర్టల్ సిద్ధం: పరకాల
విశాఖపట్నం:సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా హుదూద్ తుపానును ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. తుపాను నష్టాలను ఆన్లైన్లో పరిశీలించేందుకు హుదూద్ పోర్టల్‌ను ఏర్పాటు చేశామన్నారు. www.hudhud.ap.gov.in వెబ్సైట్ ద్వారా తుపానుకు సంబంధించి ప్రజలు తమ సలహా లు, ఫిర్యాదులతో పాటు జరిగిన నష్టాన్ని ఫొటో తీసి పొందుపర్చవచ్చని, తద్వారా పరిహారాన్ని పొందవచ్చని సూచించారు. నష్టం అంచనాలు వేసే బృందాలకు ప్రభుత్వం ట్యాబ్‌లను అందించినట్లు తెలిపారు. విశాఖలో 300, విజయనగరంలో 100, శ్రీకాకుళానికి 100 ట్యాబ్‌లను ఇచ్చామన్నారు. వీటిలో నష్టం వివరాలను నమోదు చేస్తే పోర్టల్ ద్వారా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవచ్చన్నారు. సైట్ ద్వారా వివిధ పనుల మరమ్మతు సేవలను కూడా ఉచితంగా పొందవచ్చన్నారు. నిత్యావసరాలను కొంత మంది డీలర్లు ఇవ్వడం లేదన్న వార్తలు వస్తున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.