ప్రకాశం పంతులు గొప్ప సాహసి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్
ఒంగోలు టౌన్ : ప్రకాశం పంతులు గొప్ప సాహసి, దూరదృష్టి కలిగిన నాయకుడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 144వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండూ ఇచ్చి రాష్ట్రాన్ని, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలన్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులు సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో అదేవిధంగా ప్రస్తుతం మనం ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. అనాలోచితంగా, అశాస్త్రీయంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిందన్నారు.
ఆంధ్రాకు ప్రత్యేక హోదా ‘మేం ఇచ్చాం మీరు తీసుకురాలేదు’ అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రను గుర్తుచేస్తూ భారత రాజకీయాల్లో ప్రగాఢమైన ముద్ర వేసిన వ్యక్తి అని కొనియాడారు. ప్రకాశం పంతులకు ప్రధాన నగరాల్లో విలువైన స్థలాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని స్వాతంత్రోద్యమానికి అమ్మివేసి చివరకు గర్భదారిద్య్రాన్ని అనుభవించిన మహానుభావుడన్నారు. రాష్ట్ర రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రకాశం పంతులు త్యాగనిరతి, ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రకాశం పంతులు చిత్ర పటాలను ఏర్పాటు చేయాలని, అందుకు నిధులు అవసరమైతే జెడ్పీ నుంచి విడుదల చేస్తానని తెలిపారు. కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులని పేర్కొన్నారు. సంతనూతలపాడు శాసన సభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రకాశం పంతులు విలక్షణమైన జాతీయ నాయకుడని కొనియాడారు.
ప్రకాశం పంతులు స్వీయచరిత్ర పుస్తకాన్ని ప్రతి విద్యార్థి చదవాల్సి ఉందన్నారు. ప్రజాసేవ కోసం తన ఆస్తులన్నింటిని అమ్మేసిన త్యాగశీలన్నారు. కొండపి శాసన సభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాణించిన గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులని కొనియాడారు. అన్ని డివిజన్ కేంద్రాల్లో ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు అశ్వద్ధనారాయణ, డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్, అడిషనల్ ఎస్పీ రామనాయక్, జాయింట్ కలెక్టర్-2 ఐ.ప్రకాష్‌కుమార్‌తో పాటు ప్రకాశం పంతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అశ్వద్ధనారాయణతో పాటు ప్రకాశం పంతులు రెండవ కుమారుని కుమార్తె జానకమ్మను ఈ సందర్భంగా సన్మానించారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వినోదరాయునిపాలెంలో..
నాగులుప్పలపాడు : టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాన్ని ఆయన పుట్టిన ఊరు వినోదరాయునిపాలెంలో ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో వేడుకలు నిర్వహించారు. సంతనూతలపాడు శాసన సభ్యుడు ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టి తన మేథా సంపత్తితో ఇంగ్లాండ్‌లో బారిస్టర్ చదివి కోట్లు గడించారని తెలిపారు. అప్పట్లో మద్రాసు హైకోర్టుకు 7 గుర్రాల బండిపై వెళ్లిన జడ్జి కూడా లేరంటే అతిశయోక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తి దేశం మీద అభిమానంతో లాయర్ వృత్తికి కూడా సెలవు పెట్టి దేశ స్వాతంత్య్రం కోసం తెల్లదొరలపై పోరాడి తన ఆస్తినంత దేశ సేవ, ప్రజల కోసం వెచ్చించిన గొప్ప నాయకుడన్నారు.
ప్రకాశంకు ఘన నివాళి
ఒంగోలు కల్చరల్ : లాయరుపేట రైతు బజారు వద్దగల ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం కాంస్య విగ్రహానికి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, రాష్ర్ట రోడ్లు, భవనాలు, రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, కొండపి శాసన సభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ సుజాతశర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఇతర సంఘాల ఆధ్వర్యంలో..
బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, చీమలమర్రి వెంకట సుబ్బారావు, రాష్ట్ర దేవాదాయ శాఖ హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ప్రకాశం, గుంటూరు జిల్లాల సమన్వయకర్త, ఆంధ్రకేసరి సేవా పరివార్ ఆర్గైనె జింగ్ సెక్రటరీ ఆలూరు వెంకట రమణారావు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకుడు టీవీ శ్రీరామమూర్తి, ఆంధ్ర కేసరి విగ్రహ కమిటీ అధ్యక్షుడు, ఆంధ్రకేసరి సేవా పరివార్ జనరల్ సెక్రటరీ పొన్నలూరి శ్రీనివాసఫణి, టంగుటూరి ప్రకాశం మునిమనుమడు టంగుటూరి సంతోష్, ధేనువకొండ వెంకట సుబ్బయ్య, ఎస్‌ఏటీ రాజేష్, కాళిదాసు శివరాం, పి.వెంకటేశ్వర్లు, జగద్గురు ఆదిశంకరాచార్య హిందూ ధర్మప్రచార ట్రస్టు అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస శాస్త్రి, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు శేషయ్య, సనాతన ధార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వయంపాకుల యలమందల కోటేశ్వర శర్మ తదితరులు ప్రకాశంకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.