ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవే!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్
- తెలంగాణ సమాచారాన్ని ఏపీ చోరీ చేసిందనడం హాస్యాస్పదం
- గతేడాది ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ రెండో స్థానం, తెలంగాణది 13వ స్థానం
- ఈసారి కూడా అధమ స్థానంలో నిలుస్తామనే కేటీఆర్ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింట్ బిజినెస్(ఈవోబీడీ) విధానంలో డీఐపీపీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్), ప్రపంచ బ్యాంకు ర్యాంకు కోసం తమ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా చోరీ చేసిందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కొట్టిపారేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గతేడాది డీఐపీపీ ప్రకటించిన ర్యాంకుల్లో ఈవోబీడీలో గుజరాత్ 71.14 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, 70.12 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.
42.45 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ సర్కార్ సమాచారాన్ని రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చౌర్యం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఈ ఏడాదీ అధమ స్థానంలో నిలుస్తామనే భావనతోనే తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులు ఇప్పటినుంచే సాకులు వెతుక్కుంటూ చంద్రబాబు సర్కార్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈవోబీడీ విధానంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం తెలంగాణ సర్కార్‌కు ఎలా తెలి సిందని ప్రశ్నించారు. కేవలం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేస్తేనే తమ ప్రభుత్వం కేంద్రానికి ఏ ప్రతిపాదనలు ఇచ్చిందన్నది తెలుస్తుందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తే నిజానిజాలు వెల్లడవుతాయని చెప్పారు.
ఆధార్, పాన్, మొబైల్ నెంబర్లు వంటి వివరాలతో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పోర్టల్ సమగ్రంగా ఉందని.. తొమ్మిది వేల లావాదేవీలు జరిపిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అసమగ్రంగా ఉన్న వారి పోర్టల్ ద్వారా ఒక్క లావాదేవీ కూడా జరపలేదన్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాల వ్యాజ్యాల రుసుం ఆన్‌లైన్ ద్వారా కూడా చెల్లించే అంశంపై ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు(ఆర్వోసీ 850/ఎస్‌వో/2015)ను జారీ చేసిందని.. ఇది రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని... దాన్ని పట్టుకుని తమ రిఫెరెన్స్ నెంబరుతో చౌర్యం చేశారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్‌లో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం, వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి తెలంగాణ సమాచారాన్ని చౌర్యం చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ఇవేవీ పట్టకుండా కేంద్రానికి ఫిర్యాదు చేసి చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వం హ్యాక్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అని ప్రశ్నించగా సూటిగా చెప్పకుండా సమాధానాన్ని దాటవేశారు.