దూసుకుపోతున్న తెలంగాణ
- పరిశ్రమలు, పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా రాష్ట్రం
- ప్రపంచ బ్యాంకు ఈఓడీబీ తాజా ర్యాంకుల్లో రెండో స్థానం
- గతేడాది రాష్ట్రానికి 13వ ర్యాంకు
- మొదటిస్థానంలో కొనసాగుతున్న బిహార్
- గతేడాది రెండోర్యాంకు సాధించిన ఏపీ ప్రస్తుతం 19వ స్థానంలో
- జూలైలో తుది ర్యాంకులు ప్రకటించనున్న ప్రపంచ బ్యాంకు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ బ్యాంక్ ఏటా ప్రకటిస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’(ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గతేడాది 13వ ర్యాంక్‌ను దక్కించుకొన్న తెలంగాణ.. ఈ ఏడాది తాజా ర్యాంకింగ్‌లో 6.48 శాతం స్కోర్‌తో రెండో ర్యాంక్‌కు దూసుకుపోయింది. 8.53 శాతం స్కోర్‌తో ఒకటో ర్యాంక్‌లో కొనసాగుతున్న బిహార్‌కు గట్టి పోటీ ఇస్తోంది. తెలంగాణ తర్వాత 6.18 శాతం స్కోర్‌తో ఝార్ఖండ్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. మరోవైపు గతేడాది ర్యాంకింగ్‌లో 3వ ర్యాంక్ కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ 0 శాతం స్కోర్‌తో తాజా ర్యాంకింగ్‌లో ఏకంగా 19వ స్థానానికి పడిపోయింది.
ఈ ర్యాంకులను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఈ నెల 30 వరకు రాష్ట్రాలకు అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు పెట్టుబడులు, వ్యాపార సరళీకరణ కోసం ప్రవేశపెట్టిన సంస్కరణ లు, తీసుకుంటున్న చర్యలను కేంద్ర పరిశ్రమల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అన్ని రాష్ట్రాలు ఏరోజుకారోజు నివేదిస్తున్నాయి. రాష్ట్రాల నివేదికల ఆధారంగా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాల తాజా ర్యాంక్‌లను అప్‌డేట్ చేస్తోంది. ఏ రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందో తన వెబ్‌సైట్ ద్వారా బహిర్గతపరుస్తోంది. తుది ర్యాంక్ ను మెరుగుపరుచుకోవడానికి అన్ని రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తోంది. వచ్చే నెలలో ప్రపంచ బ్యాంక్ తుది ర్యాంక్‌లను అధికారికంగా ప్రకటించనుంది. తాజా ర్యాంకులతో పోల్చితే రాష్ట్రాల తుది ర్యాంకుల్లో మార్పులకు అవకాశం ఉందని కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మెరుగైన ర్యాంకు కోసం భారీ కసరత్తు
సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు సత్వర అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టీఎస్-ఐపాస్’ పేరుతో కొత్త పాలసీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పెట్టుబడులకు ఈ విధానం ద్వారా ఎర్రతివాచీ పరిచింది. అయినా గతేడాది జూలైలో ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన ఈఓడీబీ ర్యాంకుల్లో తెలంగాణకు 13, పొరుగున ఉన్న ఏపీకి 2వ స్థానం వచ్చింది. దీంతో ఈ అంశా న్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ర్యాం కింగ్‌ను మెరుగుపరచుకోవడానికి గత 11 నెల లుగా భారీ కసరత్తు చేసింది. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ర్యాంకును మెరుగుపరుచుకోవాలంటే వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని పలు అంశా ల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి 340 పాయింట్లు సాధించాల్సి ఉంటుందని అంచనా వేసుకుంది. సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉరుకులు పెట్టించారు. గతనెల 14 నాటికి పలు సంస్కరణలు ప్రవేశపెట్టి 289 పాయింట్లు సాధించి 87 శాతం పురోగతి సాధించింది. గడిచిన నెల రోజుల్లో పాయింట్ల సంఖ్య మరింత పెరగడంతో తాజా ర్యాం కింగ్‌లో రాష్ట్రం 2వ స్థానానికి చేరుకుంది.
ఒక్క న్యాయశాఖ తప్ప..
న్యాయ శాఖ మినహాయిస్తే.. పురపాలక, ఆర్థిక, రెవెన్యూ, అటవీ, ఇంధన, కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖలు, టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన పలు చర్యలు తీసుకోవడంతో మెరుగైన ర్యాంకు సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ‘ఈ-కోర్టుల’ విధానంతోపాటు న్యాయశాఖకు సంబంధించిన పలు అంశాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టే అంశం హైకోర్టు పరిధిలో ఉండడంతో ఈ అంశాల్లో ఆశించిన పురోగతి లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమై దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పురోగతి చర్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ ఒక ట్రెండు రోజుల్లో అన్ని శాఖల కార్యదర్శులతో మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రపంచ బ్యాంక్ జూలైలో ప్రకటించనున్న తుది ర్యాంకుల కోసం ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.