ఆ చట్టం తెస్తే కేసీఆర్‌కు యావజ్జీవమే
సింగరేణి ఉద్యోగాలపై కేసు వేసింది కవిత అనుచరులే: సండ్ర
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలను, ఆరోపణలను రుజువు చేయకుంటే జైలుకు వెళ్లాలనే చట్టం తీసుకొస్తే ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు జీవితాంతం జైలులోనే ఉం డాల్సి ఉంటుందని టీటీడీఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలసి మీడి యాపాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు అందరికంటే ఎక్కువ శిక్ష తప్పదన్నారు. అప్పులు చేయడమే గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఆస్తులు రూ.వేల కోట్లకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు.
వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్న కేసీఆర్, కేటీఆర్‌లకు ఎన్ని అప్పులు ఉన్నాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ.69 వేల కోట్లు అప్పులు ఉంటే ఇప్పుడవి రూ.లక్షా 40 వేల కోట్లకు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడే పుట్టిన శిశువుపై కూడా రూ.40 వేల అప్పు ఉందని చెప్పారు. అప్పులు చేస్తేనే అభివృద్ధి, అప్పులు చేయడం సమర్థత అంటున్న కేసీఆర్‌కు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పత్రికలు, ఒక టీవీ చానల్, వందలాది ఎకరాల్లో ఫాంహౌజు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. మరోవైపు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను ఆపింది తెలంగాణ జాగృతికి చెందిన నాయకులేనని సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు.