మహిళలు పూజలు కోరుకోవట్లేదు | Provides equal opportunities with men women | Sakshi
Sakshi News home page

మహిళలు పూజలు కోరుకోవట్లేదు

Published Thu, Mar 9 2017 12:59 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

మహిళలు  పూజలు  కోరుకోవట్లేదు - Sakshi

మహిళలు పూజలు కోరుకోవట్లేదు

పురుషులతో సమాన అవకాశాలు కల్పిస్తే చాలనుకుంటున్నారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి కేటీఆర్‌
మొక్కుబడి ఉత్సవాల బదులు మహిళల విజయాలను గౌరవిద్దాం


హైదరాబాద్‌: మహిళలెవరూ వారిని పూజించాలని కోరుకోవట్లేదని, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తే చాలని భావిస్తున్నారని ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్‌) వ్యాఖ్యానించారు. మహిళా దినోత్సవం పేరుతో జీవితంలో వారు చేసే త్యాగాల గురించి మొక్కుబడిగా ఏకరువు పెట్టే బదులు ఆ కష్టాలను కొంచెమైనా తగ్గించేందుకు ప్రయత్నించడం మేలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌లో జరిగిన కార్యక్రమానికి గౌరవ అతిథిగా కేటీఆర్‌ హాజరయ్యారు. తాను ఈ స్థాయిలో ఉండేందుకు తన చుట్టూ ఉన్న శక్తిమంతమైన మహిళలు.. అమ్మ, చెల్లి, భార్య తదితరులే కారణమని కొనియాడారు.

అయితే మహిళలను పురుషులకు సాయపడే వారిగా చిత్రీకరిస్తూ వారిని పొగడటం కంటే వారి వ్యక్తిత్వాలను, సామర్థ్యాలను ప్రతిరోజూ సెలబ్రేట్‌ చేసుకుందామని, గౌరవిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్‌ భమ్రే మాట్లాడుతూ దేశ రక్షణ రంగ ప్రాజెక్టుల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఎనలేనిదని, వారి కారణంగానే దేశం ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగిందని కొనియాడారు. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘డీఆర్‌డీవో మహిళా శాస్త్రవేత్తలు, సిబ్బంది నిబద్దత తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమన్నారు. దేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మహిళా సిబ్బంది పాత్ర ఎంతైనా కొనియాడదగినదని అన్నారు.

బాధ్యతల తరువాత మళ్లీ విధుల్లోకి...
మహిళలు కుటుంబ బాధ్యతల నిర్వహణ కోసం కొన్నిసార్లు వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని... అయితే ఆ బాధ్యతలు పూర్తయిన తరువాత వారు మళ్లీ విధుల్లోకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని... కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు ఇందుకు అనుగుణంగా విధానాలను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్నారు. లింగ వివక్షను పటాపంచలు చేస్తూ రక్షణ రంగంలో అగ్రస్థానానికి చేరుకున్న టెస్సీ థామస్‌ వంటి శాస్త్రవేత్తలు మరింత మంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ క్రిస్టోఫర్, చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సతీశ్‌ దువా, అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీ చైర్‌పర్సన్‌ టెస్సీ థామస్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌డీవోలో 15 శాతం మహిళలు: టెస్సీ థామస్‌
దేశ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)లో ప్రస్తుతం 15 శాతం మంది మహిళలు పనిచేస్తు న్నారని... 2030 నాటికల్లా దీన్ని 50 శాతానికి చేర్చాలని ఆకాంక్షిస్తున్నట్లు అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీ చైర్‌పర్స న్, అగ్ని–5 క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్‌ టెస్సీ థామస్‌ తెలిపారు. డీఆర్‌డీఓలోని ఉన్నత స్థానాల్లో మహిళా సిబ్బంది 25 శాతం వరకూ ఉన్నారన్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం తాను డీఆర్‌డీవోలో చేరినప్పుడు రెండు మూడు శాతమే మహిళలు ఉండేవారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement