‘బర్గర్ కింగ్’ సేల్స్ నిన్న, మొన్న కొద్దిగా డౌన్ అయ్యాయి! బహుశా ఇది తాత్కాలికమే కావచ్చు. సేల్స్ పడిపోడానికి బర్గర్ ల రుచి తగ్గడం కారణం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ మల్టీ నేషనల్ ఫుడ్ జెయింట్ సదుద్దేశంతో మహిళల కోసం చేసిన ఒక కెరీర్ ఆపర్చునిటీ ప్రకటన రుచించక, విషయం అపాలజీ వరకు వచ్చింది. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఫుల్ పేజీ గా వచ్చిన ఆ ప్రకటనకు బర్గర్ కింగ్ 'Women belong in the Kitchen' అనే హెడ్డింగ్ పెట్టడం మహిళలకు ఆగ్రహం కలిగించింది. ‘వంటపని ఆడవాళ్లదే’ అని ఆ మాటకు అర్థం. మహిళలకు ఓటు హక్కు రాని వందేళ్ల క్రితం నాటి యూసేజ్ అది.
‘వాళ్లకేం తెలుసు వంటింటి కుందేళ్లు’ అని నలుగురు మగవాళ్లు కలసిన వేళల్లో నవ్వుకుంటూ అనుకునే మాట! బర్గర్ కింగ్ ఆ మాటనే యూజ్ చేస్తూ.. ‘లేడీస్, చెఫ్ లుగా మీరెందుకు రాణించకూడదు?! అక్కడా మగవాళ్ల డామినేషనేనా! రండి. మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం. స్కాలర్ షిప్ ను ఇస్తాం. మిమ్మల్ని రెస్టారెంట్ ఇండస్ట్రీకి మహారాణులను చేస్తాం..’ అని ఆహ్వానించింది. ఇదంతా లోపల ఉన్నా.. పైకి కనిపించేదే కదా ఎవరైనా చూస్తారు! మహరాణుల ఆగ్రహంలో తప్పేమీ లేదు. మహారాజులే మాటను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.
‘‘అవును. అయితే ఏంటి?!’’ అనే మాటను ఎప్పుడు అంటాం?! ఒక నిందో, అబద్ధపు ఆరోపణో, విమర్శో వచ్చి మీద పడినప్పుడు; మన నిజాయితీని అంగీకరించడానికి అవతలివారు సిద్ధంగా లేనప్పుడు; వివరించీ, వాదించీ ప్రయోజనం లేదనుకున్నప్పుడు.. తలనొప్పి వదిలించుకోడానికి ‘అవును. అయితే ఏంటి?’ అనేసి, పక్కకు వచ్చేస్తాం. ఎవరికి వారు.. ‘అవును. అయితే ఏంటి?’ అనేస్తే గొడవే లేదు. ఇంకెవరి తరఫునో.. ‘అవును. ఆమె అంతే. అయితే ఏంటి?’ అంటేనే వాగ్వాదాలు, యుద్ధాలు మొదలవుతాయి.
‘బర్గర్ కింగ్’ పేరు వినే ఉంటారు. బర్గర్‌ల విక్రయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మల్టీనేషనల్ రెస్టారెంట్‌ల అమెరికన్ కంపెనీ. చాలాచోట్ల దుకాణాలు ఉన్నాయి. ఉమెన్స్ డే రోజు ఆ కంపెనీ యూ.కె. సంస్థ ఇంచుమించు ఇలాంటి ఒక వివాదంలోనే చిక్కుకుంది. మహిళల తరఫున మాట్లాడబోయి, కొంచెం క్రియేటివ్‌గా మాట్లాడి మహిళల ఆగ్రహానికి గురైంది. పాపం బర్గర్ కింగ్ ఉద్దేశం మంచిదే. పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో ఎందుకనో ఎక్కువగా పురుష చెఫ్‌లే కనిపిస్తారు. మహిళా చెఫ్‌లు కేవలం 20 శాతం మంది మాత్రమే. ఆ విషయాన్నే చెబుతూ.. ‘‘అన్ని రంగాల్లో ముందున్న మహిళలు చెఫ్‌లుగా మాత్రం వెనకబడి ఉండటం ఏంటి? మీకు ఆసక్తి ఉంటే చెప్పండి, మీకు స్కాలర్‌షిప్ ఇచ్చి, ట్రైనింగ్ ఇప్పించి, రెస్టారెంట్‌ల మహా సామ్రాజ్యాలకు మిమ్మల్ని మహరాణుల్ని చేస్తాం’’ అని బర్గర్ కింగ్.. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ ప్రకటన వచ్చింది కనుక బర్గర్ కింగ్ ఉద్దేశాన్ని శంకించే పనే లేదు. అయితే ఉద్దేశాలు మంచివే అయి ఉండవచ్చు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి అపార్థాలకు కారణమై ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ ప్రకటనలోని పొరపాటు బర్గర్ కింగ్ తన పికప్ లైన్‌గా (లోపలికి లాగేసే ప్రారంభ వాక్యం) ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ అనే మాటను వాడటం. ఆ మాటకు అర్థం ‘వంటపని ఆడవాళ్లదే’ అని. ఆ మాటలోని అంతరార్థం.. ‘అవును. అయితే ఏంటి? వాళ్లను అననివ్వండి. చెఫ్‌గా రాణించండి’ అని! బర్గర్ కింగ్ మహిళల వైపు మాట్లాడేందుకు, ఇలా మహిళలకు నచ్చని మాటను హెడ్డింగ్‌గా పెట్టడమే వివాదం అయింది.
ఆ ఫుడ్ జెయింట్.. పేపర్‌లో మాత్రమే ఈ యాడ్ ఇచ్చి ఊరుకోలేదు. ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు రివర్స్ ట్వీట్‌లు వచ్చాయి. ‘ఏం మాటలివి బర్గర్ కింగ్. మహిళల్ని కించపరుస్తావా? నువ్వు తయారు చేసే బర్గర్‌లు రుచిగా ఉంటే సరిపోతుందా.. మాట శుచిగా ఉండొద్దా’ అని ట్విటిజెన్‌లు కామెంట్‌లు పెట్టారు. బర్గర్ కింగ్ సాయంత్రానికల్లా ఆ ట్వీట్‌ను తొలగించింది. పేపర్‌నైతే డిలీట్ కొట్టలేదు కదా. నష్టం జరిగిపోయింది. ఒడ్డున పడే మార్గంగా మహిళలకు క్షమాపణలు చెప్పింది. వాస్తవానికి ఆ ప్రకటన ఇప్పటికే బర్గర్ కింగ్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఉద్దేశించి ఇచ్చింది! అయితే యావత్ మహిళావనికి అది స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తుందన్న ఆలోచనతో అలా బహిరంగ ప్రకటన ఇచ్చింది బర్గర్ కింగ్.
‘ఎక్కడైనా ప్రొఫెషనల్ కిచెన్ ఉందీ అంటే అక్కడ మహిళా చెఫ్ ఉన్నారనే’ అనే క్రియేటివ్ భావనకు వచ్చిన తిప్పలే ఇవి. రీడర్స్‌కి, నెటిజెన్‌లకు సరిగా అర్థం కాలేదు. ఎదురొచ్చి తగిలింది. ‘బర్గర్ కింగ్‌లోని మహిళా సిబ్బంది తమ కిచెన్ కలల్ని నిజం చేసుకోడానికి మేమొక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ని ఈ మహిళా దినోత్సవం రోజున సగర్వంగా ప్రకటిస్తున్నాం’ అని కూడా ప్రకటనలో ఉంది. అది మాత్రమే ఉండి ఉంటే సరిపోయేది. వందేళ్ల నాటి మగాళ్ల మాట.. ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ ను పట్టుకొచ్చి, శీర్షికగా పెట్టి, పర్యవసానంగా తలపట్టుకుంది బర్గర్ కింగ్.
అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వచ్చిన బర్గర్ కింగ్ ఫుల్ పేజీ ప్రకటన. మహిళల ఆగ్రహానికి కారణం అయింది ఈ ప్రకటనలోని శీర్షికే
అవును. ఇది వందేళ్లనాటి మాటే. ఇప్పుడు వాడటం మహిళల్ని కించపరచడమే. అమెరికాలో వందేళ్ల క్రితం మహిళలకింకా ఓటు హక్కు రాని కాలంలో మగాళ్లు మాత్రమే మనుషులు అన్నట్లు ఉండేది! నలుగురు మగాళ్లు ఒక చోట చేరినప్పుడు వాళ్ల నవ్వులాటలో.. స్త్రీల గురించి.. ‘వాళ్లకేం తెలుసు. వంటింటి కుందేళ్లు’ అనే మాట వాడుకలో ఉండేది. ఆడవాళ్లు ఇంటికీ, వంటకీ పరిమితం అనీ, బయటికి వెళ్లి వాళ్లే పనీ చెయ్యలేరని మగవాళ్లు బలంగా నమ్మిన కాలం నాటి రోజువారీ మాట ఈ ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’.
కాలక్రమంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఓటర్లుగా మాత్రమే కాదు, పోటీ చేసేవాళ్లుగా కూడా మహిళలు తామేంటో నిరూపించుకున్నారు. విజేతలుగా నిలిచారు. దేశాలను ఏలుతున్నారు. పురుష దేశాధినేతల కంటే కూడా సమర్థంగా పరిపాలిస్తున్నారు. ‘వంట పని ఆడవాళ్లదే’ అనే ఆ మాట దాదాపుగా భూస్థాపితం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ భూతాన్ని బర్గర్ కింగ్ వాళ్లు లేపి, మెడకు తగిలించుకున్నారు. మహిళల నుంచి అభ్యంతరం వ్యక్తం అవడంతో చెంపలు వేసుకున్నారు.
చదవండి: బర్గర్ కింగ్‌కు భారీ ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment