పెనుగాయం | Cyclone Hudhud in Vizianagaram | Sakshi
Sakshi News home page

పెనుగాయం

Published Tue, Oct 14 2014 3:45 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

పెనుగాయం - Sakshi

పెనుగాయం

సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రకృతి ప్రకోపానికి జన జీవనం కకావికలమైంది.  జిల్లాలో హుదూద్ తుపాను పెను బీభత్సం సృష్టించింది. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వీచిన భీకర గాలులకు జిల్లాలోని రైతులు, మత్స్యకారు లు, ఇతర రంగాల వారు తేరుకోలేని విధం గా నష్టపోయారు. ఆహారం, నీరు అందక ఎన్నో కుటుంబాలు అలమటించాయి. రెండు రోజుల పాటు ప్రజలు ఇళ్లనుంచి ఎక్కడ చూసినా పవన విధ్వంసమే....ఎవరిని కదిపినా తుపాను విలాపమే... కూలిన ఇళ్లు, ధ్వంసమైన దుకాణాలు, కూకటివేళ్లతో రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాలు, వైర్లతో పాటు చెల్లాచెదురుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ఎగిరిపడిన హోర్డింగ్‌లు, పల్టీకొట్టిన వాహనాలు, దెబ్బతిన్న బంకులు, గోడలు కూలిన కార్యాలయాలతో జిల్లా మరు భూమిని తలపిస్తోంది.

 రోడ్లు ఛిద్రమయ్యాయి...చెరువులు కట్టలు తెగి ప్రవహిస్తున్నాయి...నదులు పొంగిపొర్లుతున్నాయి....పంటలు కంటతడి పెట్టిస్తున్నాయి... ఇలా జిల్లా అంతటా  భీతావహ వాతావరణం నెలకొంది... హుదూద్ పెనుగాయమే చేసింది... బడుగుల బతుకులను అతలాకుతలం చేసింది... మత్స్యకారులను విషాదసాగరంలో ముంచింది. చిరు వ్యాపారులు, చిన్నచిన్న ఇళ్లలో తలదాచుకుంటున్నవారిని కోలుకోలేని దెబ్బతీసింది... ఆరుగురిని పొట్టన పెట్టుకుంది....జాలిలేని గాలి రాకాసి విధ్వంసానికి జిల్లా భారీ మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. దాదాపు రూ.వేయికోట్ల మేర నష్టం వాటిల్లింది. విశాఖపట్నానికి సమీపంలో ఉన్న విజయనగరం పట్టణం అంత స్థాయిలో కాకపోయినా అందమైన, ఆహ్లాదాన్ని పంచే నగరంగా త్వరలో రూపుదాలుస్తుందనుకున్న  జిల్లా వాసుల ఆశలను ఆదిలోనే చిదిమేసింది. పట్టణం పూర్తిగా ధ్వంసమైంది. కళా విహీనంగా దర్శనమిస్తోంది. పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచిన చెట్లు ఇప్పుడు ఇళ్లు,కార్యాలయాలు, దుకాణాల మీద పడి పెను విషాదాన్ని సృష్టించాయి. హుదూద్ చేసిన గాయాల బాధలు బాధితుల హృదయాలను కలిచివేస్తున్నాయి...
 
 బయటకు రాలేకపోయారు. విద్యుత్‌సరఫరా నిలిచిపోవడంతో జిల్లా అంతా అంధకారం రాజ్యమేలింది. అలాగే దారిపొడవునా చెట్లు, స్తంభాలు పడిపోవడంతో పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, బొండపల్లి, తదితర మండలాల్లోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
 
 70 వేల హెక్టార్లలో పంట నష్టం
 పొట్ట దశలో ఉన్న వేలాది ఎకరాల్లో వరిపంట  నీటమునిగి రైతన్న  కుదేలయ్యాడు. ఇప్పటికే రుణాల్లేక, తీవ్ర ఇబ్బందుల్లో వరి సాగు చేసిన రైతులకు ఈ తుపాను మరింత కుంగదీసింది. 70వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి, చెరుకు, మొక్కజొన్న, తదితర పంటలు నీటమునిగిన ట్టు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. దాదాపుగా రూ.300కోట్లు నష్టం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఉ ద్యానవన పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. కొబ్బరి, అరటి తోటలతో పాటు వివిధ కూరగాయల పంటలు నే లమట్టమయ్యాయి. వీటివిలువ సుమారు రూ.75 కోట్లు ఉండొచ్చని అంచనా. జిల్లా వ్యాప్తంగా 13 వేలకు పైగా టేకు తదితర చెట్లు నేలకూలాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామాలకు గ్రా మాలు దిగ్బంధంలో చిక్కుకున్నాయి.జిల్లాలో 3100కు పైగా విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు 250 ట్రాన్స్‌ఫార్మర్లు 250పాడయ్యాయి. దీంతో విద్యుత్ శా ఖకు సుమారు రూ.20కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అం చనా. 1000కి పైగా చిన్నతరహా నీటి వనరులు  దెబ్బతిన్నాయి. 40 చెరువులకు గండ్లు పడ్డాయి. 50కి పైగా కల్వర్టులు పాడయ్యాయి. 105 మంచి నీటి పథకాలు దెబ్బతిన్నాయి. దీంతో తాగునీరు కలుషితమయింది.
 
 కోతకు గురైన రహదారులు
 జిల్లాలో పంచాయతీరాజ్,  ఆర్‌అండ్‌బీకి సంబంధించి 800 రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో ఆ గ్రామాల్లో రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. అత్యధికం గా విజయనగరం, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని రోడ్లకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 170 వరకూ రోడ్లు దెబ్బతిన్నాయి .  
 
 మత్స్యకారులకు తీవ్ర నష్టం
 మత్స్యకారులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.  భీకర గాలులకు తీరంలో ఉన్న ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఇళ్లపైకి ఒడ్డున ఉన్న బోట్లు వచ్చి పడిపోవడంతో ధ్వంసమయ్యాయి. సముద్రం ఇసుక ఇళ్లలో మేటలువేసింది.   140 బోట్లు, 250 వలలు కొట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లింది. ముక్కాం, చేపలకంచేరు, పతివాడ బర్రిపేట, తిప్పలవలస, చింతపల్లి తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. అలాగే  రెండు వేల వరకూ కోళ్లు, 250 వరకూ పశువులు, వెయ్యి వరకూ మేకలు, గొర్రెలు చనిపోయాయి.
 
 జిల్లా వ్యాప్తంగా ఆరుగురి మృతి
 భీకర గాలులకు భారీ వర్షాలు తోడవడంతో జిల్లాలో ఆరుగురు మృతిచెందారు.జామికి చెందిన కర్రి రమేష్, ద్వారపూడికి చెందిన శిలగం శెట్టి సత్తిబాబు, డెంకాడ మండలం బంటుపల్లికి చెందిన ఎండ సీతప్పడు, గొల్లపేటకు చెందిన బమ్మిడి సూరిబాబు, భోగాపురం మం డలం పోలిపల్లికి చెందిన కర్రోతు బంగారమ్మ భీకర గాలులకు భయాందోళనకు గురై గుండెపోటుతో  మృతిచెందగా, ముక్కాం గ్రామానికి చెందిన కారి బండమ్మ చల్లనిగాలులకు తట్టుకోలేక మృతి చెందింది. నేటి నుంచి ఎన్యుమరేషన్‌జిల్లాలో పంట నష్టం అంచనా వేసేందుకు 50 బృందా లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. ఆరుగురు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ల పర్యవేక్షణలో అంచనా వేయనున్నారు. అలాగే 8,600 మంది బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, ఒక కిలో పంచదార అందజేయనున్నట్టు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement