గోకులాల నమూనా చిత్రం
అన్నదాతకు పాడి పశువుల పెంపకం భారంగా మారింది. పశు పోషణ, వసతి రైతులకు శిరోభారం కావడంతో చాలా మంది వాటిని విక్రయించి రైతువారీ పనులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు పాడి పశువులతో కలకలలాడే గ్రామాల్లో నేడు అవి లేక వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో పాడి పశువులను అభివృద్ధి చేసి పాల దిగుబడిని పెంచేడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. వివరాల్లోకి వెళ్తే...
పార్వతీపురం: పశు సంవర్ధక శాఖ ద్వారా ఊరూరా గోకులాలను ఏర్పాటు చేసి అందులో పాడి పశువులకు ఆశ్రయం కల్పించి వాటి రక్షణతో పాటు పాల దిగుబడిని పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు.
జిల్లాకు తొలి విడతగా 25 యూనిట్లు మంజూరు...
జిల్లాకు తొలి విడతగా 25 గోకులం యూనిట్లు మంజూరయ్యాయి. ఇందు కోసం పశు సంవర్ధక శాఖ అధికారులు గ్రామాల వారిగా యూనిట్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించే రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు. 25 యూనిట్లు మంజూరు చేసినప్పటికీ పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం మండలానికి మూడు యూనిట్లు చొప్పున మంజూరు చేయడానికి గ్రామాలను ఎంపిక చేశారు.
ఎంపిక చేసిన గ్రామాల్లో ఏ గ్రామంలో అయినా ఈ యూనిట్ మంజూరు చేయడానికి అనుకూలమైన వసతులు లేకుంటే అక్కడ నుంచి వేరొక గ్రామానికి తరలించే అవకాశం ఉంటుంది. దీని దృష్ట్యా ముందస్తుగా మూడు గ్రామాలు చొప్పున ఎంపిక చేశారు. ఇలా పార్వతీపురం ఐటీడీఏ ఉప ప్రణాళికా ప్రాంతంలోని పార్వతీపురం మండలంలో 4 గ్రామాలు, కొమరాడలో–3, గరుగుబిల్లి–3, కురుపాం–3, జియ్యమ్మవలసలో–3, గుమ్మలక్ష్మీపురంలో –3, మక్కువ–3, సాలూరు–3 గ్రామాలు చొప్పున ఎంపిక చేశారు.
ఒక్కో యూనిట్‌కు రూ.21 లక్షలు..
ఒక్కో గోకులం నిర్మాణానికి రూ.21లక్షలు మంజూరు చేస్తారు. ఇందులో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.18.50లక్షలు, పశు సంవర్ధక శాఖ నుంచి రూ.2.50లక్షలు మంజూరు చేస్తారు. ఈ యూనిట్‌ను నిర్వహించడానికి ఆయా గ్రామాలకు చెందిన పాడి రైతులతో పాటు మరికొందరితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీని విలేజ్ ఆర్గనైజేషన్ కమిటీ అంటారు.
కమిటిటీలో పాడి పశువులు ఉన్న ముగ్గురు రైతులు, ఒక పశువైద్యాధికారి, గ్రామ కార్యదర్శి ఉంటారు. వీరు ఈ గోకులం యూనిట్‌ను నిర్వహిస్తారు. ఈ యూనిట్‌లను ఏర్పాటు చేయడానికి కొన్ని నిబంధనలు విధించారు. తప్పనిసరిగా ఆయా గ్రామాలకు రహదారి సౌకర్యం, నీటి వసతి, విద్యుత్ సదుపాయం కలిగి ఉండడంతో పాటు మహిళా గ్రూపులకు చెందిన కుటుంబంలో ఉన్న రైతులు అర్హులు.
అంతే కాకుండా పశువైద్య కేంద్రానికి అందుబాటులో ఉన్న గ్రామాల్లో మాత్రమే ఈ గోకులం యూనిట్‌లను మంజూరు చేస్తారు. గోకులం యూనిట్‌ల నిర్మాణం కోసం ఆయా గ్రామాల్లో ప్రభుత్వానికి చెందిన 25 సెంట్లు భూమిని కేటాయించాల్సి ఉంటుంది.
గోకులాల ఉపయోగం...
ప్రస్తుతం గ్రామాల్లో పశువులు ఇంటికి ఒకటో లేక రెండో ఉంటాయి. వాటి కోసం ఇంటి ముందు లేక వెనక భాగంలో పశువుల శాలను నిర్మించాలి. రోజూ శాలను శుభ్రపరచాలి. వాటిని మేతకు తోలుకు పోవాలి. పాడి పశువులకు దాణా పెట్టాలి. జబ్బు చేస్తే వైద్యుని వద్దకు తోలుకుపోవాలి. ఇలా ఎవరికి వారే ఈ పనులు చేసుకోవాలి. ఇది రైతులకు కష్టతరమైన పని.
కాబట్టి రైతులందరి పాడి పశువులను ఒకే చోటకు చేర్చి వాటికి మేత, తాగునీరు, వైద్య పరీక్షలు చేయడం, అవసరమైన మందులు వేయడం వంటి సౌకర్యాలున్నా గోకులంలో లభ్యమయ్యే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. ఒక గ్రామానికి చెందిన 20 మంది రైతులకు చెందిన పాడి పశువులను ఈ గోకులంలో చేర్చి వాటిని సంరక్షిస్తారు. ఇక్కడ పశువులకు అవసరమైన సైలేజ్ గడ్డి, దాణామృతం వంటి మేతను రాయితీపై ప్రభుత్వం అందిస్తుంది.
పశువులకు జబ్బు చస్తే కమిటిలో ఉన్న వైద్యులకు సమాచారం ఇవ్వగానే వెంటనే వైద్యాధికారి వచ్చి పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తారు.
పాడి రైతులకు వరం
గోకులాలు అందుబాటులోకి వస్తే పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 25 గోకులాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఒక్కో యూనిట్‌కు రూ.21లక్షలు మంజూరు కానుంది. ఒక గ్రామంలో ఉన్న 20 మంది పాడి రైతులను గుర్తించి వారి పాడి పశువులను ఈ గోకులాల్లో చేర్పించి ఒకే చోట అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుంది.
పశువులు ఊరిలో విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉండదు. తాగునీరు, మేత ఒకే చోట లభిస్తాయి. గోకులాలు అందుబాటులోకి వస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.–యండ సింహాచలం, పశుసంవర్ధక శాఖ, జాయింట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment