2014మార్చి వరకు రుణాలు తీసుకున్న రైతులు : 2లక్షల 67వేలు
తీసుకున్న రుణ మొత్తం: రూ. 1,462 కోట్లు
పంటలపై రుణాలు తీసుకున్న రైతులు: లక్షా 82 వేలు
తీసుకున్న రుణ మొత్తం : రూ. 730 కోట్లు
బంగారు ఆభరణాలపై పంట రుణాలు తీసుకున్న రైతులు : 55 వేలు
బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలు : రూ.432 కోట్లు
కేవలం బంగారు రుణాలపై మాఫీ అయిన మొత్తం: రూ. 86.40 కోట్లు
అన్నదాత నిలువునా దగాపడ్డాడు. సజావుగా సాగుతున్న బతుకులో చిక్కులు కొని తెచ్చుకున్నాడు. బ్యాంకులో చేసిన అప్పులు తీర్చకపోవడంతో డిఫాల్టరుగా మారాడు. కుదువపెట్టిన బంగారు ఆభరణాలు విడిపించలేకపోతున్నాడు. కట్టుకున్న భార్యకు... కన్నబిడ్డలకూ... శత్రువులా మారాడు.
ఇలా ఎందుకయిందో తెలుసా...?
ఒక్క రుణమాఫీ ప్రకటనకు ఆశపడి... పైసా చెల్లించకుండానే కుదువపెట్టిన ఆభరణాలు ఇచ్చేస్తామని చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు.
చివరికేమైంది ?
హామీలిచ్చిన వారు అందలం ఎక్కారు. ఎంచక్కా అధికారం చెలాయిస్తున్నారు. కొండత రుణంలో గోరంత తీర్చి... చేతులు దులిపేసుకున్నారు. పైగా నిండు సభలో లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బ్యాంకు రణాలు తీర్చవద్దు... మేం అధికారంలోకి వచ్చాక రుణాలన్నీ రద్దు చేస్తాం... మీరు బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలకూ మాదే బాధ్యత. తాకట్టు పెట్టిన ఆభరణాలు మీ ఇంటికొచ్చే పూచి మాది.’ ఇదీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చేసిన హామీ. వాటిని నమ్మిన రైతన్నలు పాపం రుణాలు తీర్చడం మానేశారు. అధికారంలోకి వచ్చాక గోరంత మాఫీ చేసి కొండంతగా చెప్పి రైతులను అయోమయంలో పడేశారు. ఇప్పుడా అప్పులు తీర్చుకోలేక అన్నదాతలు నలిగిపోతున్నారు. బ్యాంకులిచ్చే నోటీసులతో ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కాకపోగా... కాలాతీతం అవ్వడంతో వడ్డీలు పెరిగి, తీర్చలేకపోవడంతో బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి.
మాఫీ అయింది 20శాతమే...
జిల్లాలో పంట రుణాలు పక్కన పెడితే 55వేల మంది రైతులు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.432 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. ఇందులో కేవలం 20 శాతం మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ. 86.40కోట్లు మాఫీ జరిగింది. ఇంకా రూ.345.60 కోట్లు రైతులు బకాయి ఉన్నట్టు తేలింది. రుణాలు తీసుకున్న వారి గడువు తీరిపోయిం దని బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. చంద్రబాబు బం గారు రుణాలను మాఫీ చేస్తాననడంతో రైతులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. కానీ సర్కా ర్ అరకొరగానే మాఫీ చేసింది. మిగిలిన బకాయిల కోసం బ్యాంకులు లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నా యి. ఆభరణాలు వేలం వేస్తామని హెచ్చరిక నోటీసులు జారీ చేశాయి. కాస్తో కూస్తో పరపతి ఉన్నవారు అప్పో, సప్పో చేసి రుణాలు తీర్చుకుని ఆభరణాలు విడిపించుకోగా... కొందరైతే ఇక చేసేది లేక వదలుకుంటున్నారు.
వేలం వేసిన బంగారు ఆభరణాల విలువ రూ. 3కోట్లు
ఇప్పటివరకు జిల్లాలో 300మంది రైతులకు చెందిన రూ. 3కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకర్లు వేలం వేసినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా... ప్రభుత్వం మాత్రం కిమ్మనడంలేదు. అసలు నోటీసులిచ్చిన సమాచారమే లేదని సాక్షాత్తు అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి పుల్లారావు ప్రకటన చేయడం అందరినీ విస్మయపరుస్తోంది.
తగ్గిన కొత్త రుణాలు
రుణమాఫీ వర్తింపు తరువాత కొత్తరుణాలకు పరిమితి విదించడంతో బ్యాంకు రుణాలకు రైతులు దూరమవుతున్నారు. బంగారం, భూమి ఎంతమేరకు పెట్టినా రూ.లక్ష దాటి ఇవ్వరాదని బ్యాంకర్లు నిర్దేశించారు. దీంతో బంగారం తనఖా రుణాలు రైతుకు ఆసరా ఇవ్వడంలేదు. కొన్నేళ్లుగా బ్యాంకు రుణ లక్ష్యాలను పరిశీలిస్తే బంగారం తనఖా రుణాలపై ఆధారపడే రైతులు జిల్లాలో 40 శాతం ఉన్నారు. రుణమాఫీ ప్రకటించిన తరువాత బ్యాంకర్ల వైఖరి మారింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, రుణ పరిధి కుదింపు వంటి నిబంధనలు విధించడంతో బంగారు ఆభరణాల కింద రుణాలు తీసుకున్న వారి శాతం 10శాతానికి పడిపోయింది. గతేడాది ఖరీఫ్, రబీ కలుపుకొని రూ.1,100 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఇంతవరకు రూ. 605కోట్లు రుణాలు మాత్రమే ఇచ్చారు. ఇదంతా దాదాపు రీషెడ్యూలే. కొత్త వారికి రూ. కోటికి మించి ఇవ్వలేదు. బంగారు రుణాలకొచ్చేసరికి రూ. 600కోట్ల లక్ష్యమైనా... ఇచ్చిన రుణం మాత్రం రూ. 60కోట్లు లోపే.
వేలం వేయొద్దనే ఆదేశాలు లేవు
ఏడాది కాల పరిమితితో బంగారంపై పంట రుణాలిస్తాం. నిర్దేశిత గడువులోగా చెల్లింపులు చేయాలి. లేదంటే మూడు సార్లు నోటీసులిస్తాం. అప్పటికీ చెల్లించకపోతే వేలం వేస్తాం. వేలం ప్రక్రియ ఆపాలంటే ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక ఆదేశాలివ్వడం గాని, రైతుల తరపున బకాయిని గానీ ప్రభుత్వమే చెల్లించాలి.
- ఎ.గురవయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్
మాఫీ చేయూలి
ప్రభుత్వం మాట నమ్మి వడ్డీ కూడా కట్టలేదు. దీంతో తోణాం కెనరా బ్యాంకులో తీసుకున్న 70 వేల రూపాయల అప్పు నేడు లక్ష రూపాయలకు చేరుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాలాంటి వారికి న్యాయం చేయూలి
- ఎస్‌ఆర్‌టీపీ సుజాత, తోణాం, సాలూరు మండలం
వేలం వేస్తామంటున్నారు
2012లో బ్యాంకు నుంచి రెండు సార్లు రుణం తీసుకున్నాను. ఈ ఏడాది జనవరిలో బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. మూడు రూపాయల వడ్డీకి 39,500 రూపాయలు తీసుకువచ్చి విడిపించాను. బాబు మాటలు నమ్మి మోసపోయూను. ఇంకా రూ. 20 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా చెల్లించకపోతే వేలం వేస్తామంటున్నారు.
కె. వెంకట శ్రీనివాసరావు,
పాత గైశీల, మక్కువ మండలం
దారుణదగా!
Published Thu, Mar 10 2016 12:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement