విజయనగరం ఫోర్ట్ : అన్నదాతకు వారు, వీరు అన్న తేడా ఉండదు. కుల, మత, వర్గాలకతీతంగా అన్నం పెట్టే చేయి రైతుది. రాజకీయ పార్టీల భేదమంటూ అసలు ఉండనే ఉండదు. తాను పండించే పంట ఆ పార్టీ వారికి వెళ్తుందా..? ఈ పార్టీ వారు తింటున్నారా? అని ఏ రోజూ చూడడు. అలా చూసుకుంటూ, చేసుకుంటూ పోతే.. పైర్లకు సైతం పార్టీ రంగులు వేయాల్సి వస్తుందేమో! మరి అలాంటి అన్నదాతను మన నేతలు అలానే చూస్తున్నారా? అంటే నిస్సందేహంగా కాదనే చెప్పాలి.
అన్నెంపున్నెం ఎరుగని రైతుకు రాజకీయ రంగు పులుముతున్నారు. వారికి రాయితీపై అందించే యంత్ర పరికరాల్లోనూ కుళ్లు రాజకీయాలు చేస్తున్నారు. యంత్ర పరికరాలను తమ వారికే ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది.. వ్యవసాయశాఖ అధికారులకు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. సిఫారసు లేఖలు ఎక్కువ అవ్వడంతో యంత్ర పరికరాల మంజూరుకు అవసరమైన నిధులను కలెక్టర్ నిలిపివేసినట్లు తెలిసింది.
వరి, మొక్కజొన్న, పత్తి, చెరుకు పంటల్లో యాంత్రీకరణ పద్ధతిని పెంచడం కోసం ప్రభుత్వం స్పెషల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం(ఎస్‌డీపీ)ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం కింద యంత్ర పరికరాలను రాయితీపై రైతులకు అందించేందుకు అవసరమైన నిధులను కలెక్టర్ మంజూరు చేస్తారు. వరి, మొక్కజొన్న, పత్తి, చెరుకు పంటలను సాగు చేయడానికి అవసరమైన ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, వరి నాట్లు వేసే యంత్రం, కోనో వీడర్లు, పవర్ వీడర్లు, మిని ట్రాక్టర్లు వంటివి ఎన్‌డీపీ కింద అందజేస్తారు.
నిబంధన ఇదీ..
4 నుంచి ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడి వారు పండించే పంట పేరు, కావాల్సిన యంత్ర పరికరాలు తెలుపుతూ సంబంధిత వ్యవసాయ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను సబ్ డివిజన్ అసిస్టెంట్ డెరైక్టర్లు పరిశీలించి జాయింట్ డెరైక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. జేడీ సదరు దరఖాస్తును పరిశీలించి యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి రాయితీగా అందించాల్సిన నిధుల కోసం కలెక్టర్‌కు ప్రతిపాదిస్తారు. కలెక్టర్ ఆమోదం లభించిన తర్వాత రాయితీ నిధులను సంబంధిత రైతుల గ్రూపు ఖాతాకు జమ చేస్తారు.
‘పచ్చ’జోక్యంతో నిలిచిపోయిన నిధులు
వాస్తవానికి పార్టీలకు అతీతంగా అర్హులైన రైతులకు యంత్ర పరికరాలు అందించాల్సి ఉంది. అయితే అన్ని ప్రభుత్వ పథకాల మాదిరిగానే ఇక్కడ కూడా టీడీపీ నేతల జోక్యం మొదలైంది. పింఛన్లు, రేషన్‌కార్డుల మాదిరిగానే.. యంత్ర పరికరాలను కూడా తమ వారికే ఇవ్వాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తున్నారు. ఆ మేరకు సిఫారసు లేఖలను వ్యవసాయ అధికారులకు అందజేసినట్లు భోగట్టా.
ఈ విషయం కలెక్టర్‌కు తెలియడంతో ఎస్‌డీపీ నిధులను నిలిపివేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని వ్యవసాయశాఖ జేడీ లీలావతి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. ఎస్‌డీపీ కింద యంత్ర పరికరాలకు సంబంధించి నిధులను కలెక్టర్ తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు.
రైతుపై రాజకీయం!
Published Sun, Dec 27 2015 1:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement