గూడు చెదిరి... నీడ కరువై..
కూలిన ఇళ్లలో కాలం వెళ్ల దీస్తున్న బాధితులు
పట్టించుకోని అధికారులు
అష్టకష్టాలు పడుతున్న నిరాశ్రయులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘వేలాది ఇళ్లకు నష్టం జరిగిందంటున్నారు. వారంతా నిరాశ్రయులై ఉంటారు. తాత్కాలిక పునరావాసమేదైనా కల్పించారా..?’ ఇటీవల తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అధికారులకు అడిగిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు ఇప్పటికీ అధికారులు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. తుపాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారిలో చాలా మందికి నేటికీ నిలువ నీడ లేదు. వారెలా ఉంటున్నారో? ఎక్కడ తలదాచుకుంటున్నారో ఆరా తీసిననాథుడే కనిపించడం లేదు. దీనికి తోడుకూలిపోయిన ఇళ్ల ఎన్యుమరేషన్ కూడా సరిగా చేయడం లేదు. ఇప్పుడనేక మంది కలెక్టరేట్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. హుదూద్ తుపాను బీభత్సంతో మొత్తం15,303 ఇళ్లకు నష్టం జరిగినట్టు అధికారికంగా గుర్తించారు. అధికారుల దృష్టికి రాని, రాజకీయఒత్తిళ్లతో ఎన్యుమరేషన్ చేయనివి ఇంకెన్ని ఉన్నాయో విస్మరించిన వారికే తెలియాలి.
గుర్తించిన వివరాలిలా ఉన్నాయి. 15 పక్కా ఇళ్లు, 301 కచ్చా ఇళ్లు పూర్తిగా కూలిపోగా,91పక్కా ఇళ్లు, 713 కచ్చా ఇళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇక 296పక్కా ఇళ్లు, 6611 కచ్చా ఇళ్లు, 7276 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటినే ప్రభుత్వానికి నివేదించారు. పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వారికి, తీవ్రంగాఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రత్యామ్నాయ ఏరచేయాలి. ముఖ్యంగా ఎక్కడో ఒక చోట దలదాచుకునే విధంగా పునరావాసం కల్పించాలి. కానీ జిల్లాలో అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆదేశాలు కూడా అమలు కాలేదు.
దీంతో ఇళ్లు దెబ్బతిన్న నిరాశ్రయుల్లో కొంతమంది ఆర బయటే గడుపుతుండగా, మరికొంతమంది పరార పంచాన తలదాచుకుంటున్నారు. ఇంకొ కొంతమంది కూలిన ఇళ్లల్లోనే గోడలమాటున కాలంవెళ్లదీస్తున్నారు. ఉన్న గోడలుకూడా అనుకోకుండా కూలిపోత నివాసితుల ప్రాణాలకు ప్రమాదంవాటిల్లే అవకాశంఉం.సాధారణంగా ఇళ్లల్లో ఉన్న వారిని అప్రమత్తం చేసి, వేరొక చోటకి తరలించే ప్రయత్నంచేయాలి. కానీ ఆ దిశగా అధికారలు ఆలోచనే చేయడంలేదు.
ఒక్క రోజు... వారి జీవితాలు తల్లకిందులైపోయాయి. ఒకే ఒక్క రోజు వారి బతుకులు నిట్టనిలువునా కూలిపోయాయి. హుదూద్ సృష్టించిన విలయానికి వారంతా గూడు చెదిరిన పక్షుల్లా మారారు. మంచి తిండి తినక, మంచి బట్ట కట్టుకోక కాసిన్ని డబ్బులు మిగిల్చి కట్టుకున్న ఇళ్లు గాలివానకు నేలకూలడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. తుపాను వెళ్లిపోయి ఇన్ని రోజులవుతున్నా వారి కన్నీటి ధారలు ఆగడం లేదు. పునరావాసం కల్పిస్తామని చెప్పిన అధికారులు పత్తా లేకుండా పోతున్నారు. అధికార పార్టీ నేతలు స్వోత్కర్షకు, ఓదార్పులకే పరిమితమవుతున్నారు.