ఉదారంగా ఆదుకోండి
కేంద్ర మంత్రులు జైట్లీ, రాధామోహన్‌సింగ్‌లకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వినతి
న్యూఢిల్లీ: హుదూద్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. వెయ్యికోట్ల సాయం సరిపోదని, కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి బాధితులకు మరింత సాయం అందించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. రైతులను ఆదుకోవాలని పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. తొలుత ఉదయం 11 గంటల సమయంలో నార్త్‌బ్లాక్‌లో ఆయన అరుణ్‌జైట్లీని కలిశారు. ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల రైతు సంఘాల నేతల ప్రతినిధి బృందంతో కలిసి కృషి భవన్‌లో వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని, అవసరమైన సాయం అందేలా చూస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. నాలుగు జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా అందేలా చూడాలని కోరగా వ్యవసాయశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు.
పొగాకు సాగుపై నియంత్రణ వద్దు
పొగాకు సాగులో సమస్యలను రాష్ట్రానికి చెందిన రైతు ప్రతినిధి బృందంతో కలిసి కేంద్ర వ్యవసాయ మంత్రికి వివరించినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ‘పొగాకు సాగు తగ్గించి ప్రత్యామ్నాయంగా శనగ పండించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన లమేరకు ఆ పంట వేసిన ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల శనగ రైతులు గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయారు. ప్రత్యామ్నాయం చూపే వరకు పొగాకు సాగుపై నియంత్రణ విధించవద్దని రైతుల తరఫున మరోమారు విజ్ఞప్తి చేశాం’ అని ఎంపీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రాధామోహన్‌సింగ్ హామీ ఇచ్చారన్నారు.
వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు నెలకొల్పాలి
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేలా రాష్ట్రంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు స్థాపించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ, పారిశ్రామిక స్టాండింగ్ కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కోరారు. కేసీ త్యాగి అధ్యక్షతన సోమవారం పార్లమెంట్‌లో నిర్వహించిన పారిశ్రామిక స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.గ్రామీణ యువతలో వృత్తి నైపుణ్యం పెంచాలన్న ప్రధాని న రేంద్రమోదీ ఆలోచన మేరకు నిరుద్యోగులకు ఉపయోగపడేలా వీటిని ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు.