ప్రకాశం జిల్లాలో చీకటిని తరిమివేయండి | Prakasam MP YV Subba Reddy Letter To PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో చీకటిని తరిమివేయండి

Published Thu, Jun 7 2018 11:37 AM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

Prakasam MP YV Subba Reddy Letter To PM Narendra Modi - Sakshi

ఒంగోలు: ప్రకాశం జిల్లా పేరులో ప్రకాశం ఉన్నా...వాస్తవానికి చీకట్లు కమ్మి ఉన్నాయని, కనుక జిల్లా అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం సుదీర్ఘలేఖ పంపారు. వ్యవసాయం, నీటిపారుదల, పారిశ్రామిక అభివృద్ధిలో ఎటువంటి ప్రగతి లేదని, ఎక్కడా అభివృద్ధి జరగక పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. పార్లమెంట్‌ సభ్యునిగా తాను ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చానని, కానీ కొన్నింటికి మాత్రమే పరిష్కారం లభించిందన్నారు. కనుక చొరవ చూపి మిగిలిన సమస్యలకు కూడా పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు. గత నాలుగేళ్లుగా జిల్లాలో తీవ్రమైన కరువు ఉందని, అత్యల్ప వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో 56 మండలాలకు గాను 55 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనిని బట్టే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం అవుతుందని, కేంద్ర బృందం గత ఏప్రిల్‌లో జిల్లాలో పర్యటించినపుడు జిల్లాలోని పరిస్థితులను చూసి వారు ఈ ప్రాంతం ఒక ఎడారిలా ఉందని చెప్పడం జరిగిందన్నాని పేర్కొన్నారు.

జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకం కింద రైతులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికి రైతులకు తక్షణమే నష్టపరిహారం అందేటట్లు మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని, రైతును యూనిట్‌గా తీసుకొని నష్టపరిహారం అందజేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 119మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వివరించారు. వారిలో కేవలం 38 మందికి మాత్రమే నష్టపరిహారం అందించారని పేర్కొన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉందని, ఫ్లోరైడ్‌ సమస్య కారణంగా 2015 నుంచి ఇప్పటి వరకు 620 మంది ప్రజలు జిల్లాలో మరణించారన్నారు. కనుక తక్షణమే మంచినీటికి సంబంధించి పథకాలను విస్తృతం చేయాలని దివంగత ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తిచేయిం చారన్నారు. ఇప్పుడు ఈ పథకం పూర్తిచేయాలంటే నిధులు అవసరం అని, ప్రధానమంత్రి కృషి సంచయి యోజన పథకం నుంచి కనీసం వెయ్యి కోట్లు విడుదలచేసి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలన్నారు.

దీనివల్ల ఫ్లోరైడ్‌ పీడ కూడా విరుగుడు అవుతుందన్నారు. ప్రకాశం జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నట్లుగా జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని గతంలోనే విన్నవించామని, జిల్లాలో ఇప్పటివరకు యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేయలేదని, కనుక ఐఐఎం లేదా సెంట్రల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా 250 జిల్లాలను వెనుకబడిన జిల్లాలో జాబితాలో చేర్చినప్పటికి ప్రకాశం జిల్లా అందులో లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. జిల్లా సమస్యలపై అనేకమంది కేంద్రమంత్రులను, ప్రధానిగా తమను కలిసి సమస్యల పరిష్కారంకోసం చొరవ చూపాలని కోరారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపైన తక్షణమే ఆదుకునేందుకు దృష్టి సారిస్తారనే ఆశాభావంతో లేఖ రాస్తున్నట్లు ప్రధానమంత్రికి పంపిన లేఖలో ఎంపీ ప్రస్తావించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement