'ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటన చేయాలి' | YV Subbaredy says PM modi should announce special status | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటన చేయాలి'

Published Wed, Oct 21 2015 7:16 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YV Subbaredy says PM modi should announce special status

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు గురువారం రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఇదే అంశంపై ప్రధానిమంత్రిని కలవాలని ఈ నెల 14న మోదీకి లేఖ రాశామన్నారు.

గన్నవరం విమానాశ్రయం వద్ద గానీ, తిరుపతిలో గానీ తమకు సమయం కేటాయించాలని కోరామన్నారు. ప్రధానితో సమయం కోసం బుధవారం ఉదయం కూడా ఆయన కార్యాలయంతో సంప్రదింపులు జరిపామని, అపాయింట్‌మెంట్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమకు అపాయింట్‌మెంట్ వస్తే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు, 67 మంది ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి మోదీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరతామన్నారు. ఒకవేళ తమకు సమయం ఇవ్వకపోయినా రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రధాని నుంచి ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన వచ్చేలా కృషి చేయాలని వైవీ కోరారు. ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌తో తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేశారని, ఆంధ్రప్రదేశ్ హక్కు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement