
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. గతంలో ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగినట్లు ఆయన గుర్తుచేశారు. గత నాలుగున్నరేళ్లు ఏమీ చెయ్యని చంద్రబాబు ప్రజల డబ్బుతో ఢిల్లీలో పారాటం చేయడమేంటని అన్నారు.
శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ రైల్వేజోన్, ప్రత్యేక హోదాపై ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ఏనాడైనా నిలదీశారా అని ప్రశ్నించారు. పాత బకాయిలు కట్టాలని ఎన్‌టీపీసీ నోటీసులు ఇచ్చిందినీ, రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి చంద్రబాబు తీసుకువచ్చారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రజా అవసరాలకు డబ్బు ఖర్చుపెట్టకుండా దీక్షల పేరుతో దుబారా ఖర్చుకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యక్రమాల కోసం ప్రజల డబ్బును దోచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
టీడీపీ నేతలకు దోచిపెట్టడానికే ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రచార కార్యక్రమాలకే 3 లక్షల కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధిచెప్తారని, వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాలకు సొంతం చేసుకుని ప్రత్యేక హోదాను సాధిస్తామని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment