సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్(ఏపీ)కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఏపీలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేకహోదాపై కృతనిశ్చయంతో పోరాడుతుందన్న నమ్మకం తనకు ఉందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఉమ్మడి ఏపీకి చెందిన మాజీ ప్రధాని పీవీ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనీ, ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అదేనని సుర్జేవాలా అన్నారు. గత ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఇచ్చిన ఆ హామీని అమలు చేయకపోవడం ద్వారా రాజ్యాంగ విధానాలను మోదీ తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసే ముందు జైట్లీసహా ఇతర బీజేపీ సీనియర్ నేతలతో చర్చిస్తే వారు సమ్మతించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం అసలు పరిశీలనలోనే లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులోనే చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇది కోట్లాదిమంది ఏపీ ప్రజలకు బీజేపీ చేసిన సిగ్గుమాలిన నమ్మక ద్రోహమేనని సుర్జేవాలా అన్నారు. మోదీ తమ మాటనిలబెట్టుకుంటారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు వేచిచూస్తున్నారనీ, మాట నిలుపుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని సుర్జేవాలా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment