సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పథకాన్ని అమలు చేయడానికి కూడా జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అడ్డం పడుతున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దుగ్ధ దీనికి కారణంగా కనిపిస్తోంది. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే మొదట గ్రామాల నుంచి శ్రీకారం చుట్టాలన్న సత్సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘సంసాద్ ఆదర్స్ గ్రామ యోజన పథకం’ కింద ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ది చేయాలని ప్రకటించారు.
ఇందులో భాగంగా మన రాష్ట్రంలోనే ప్రథమంగా ఎంపీ వైవీ తన పార్లమెంట్ పరిధిలోని గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలంలోని దద్దవాడ అనే వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆ గ్రామంలో అన్ని విభాగాల అధికారులతో గ్రామసభలు నిర్వహించి సమస్యలను గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ బృందం కూడా ఈ గ్రామాన్ని శుక్రవారం సందర్శించింది. ఈ గ్రామ అభివృద్ధిపై శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమీక్ష జరుపుతున్నట్లు వారం రోజుల క్రితమే కలెక్టర్ విజయకుమార్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి సమాచారమిచ్చారు.
అదే సమయంలో మీడియాకు కూడా ఈ విషయం తెలియజేశారు. గతంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఎంపీ అధ్యక్షత వహించి నిర్వహించిన తీరు అందరి ప్రశంసలు అందుకోవడంతో ఈ విషయంపై అప్పట్లో మంత్రి శిద్దా రాఘవరావు కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. మరోసారి ఎంపీ వైవీకి ఆదర్శ గ్రామంపై సమీక్షించనున్నట్లు తెలుసుకున్న జిల్లా మంత్రి శిద్దా దద్దవాడ మీటింగ్ జరిగే సమయానికే జిల్లాలో పలు ప్రభుత్వ విభాగాలపై సమీక్ష ఏర్పాటు చేశారు. ఆగమేఘాలపై జిల్లా ఎమ్మెల్యేలకు ఈ సమావేశ సమాచారం అందించారు.
సాయంత్రం నాలుగు గంటలకు జరగాల్సిన దద్దవాడ సమీక్షను ఆరు గంటలకు మారుస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరగాల్సిన సమావేశాన్ని ఆరు గంటల వరకూ ప్రారంభించలేదు. ఆరు గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి పది గంటల వరకూ ఉద్దేశ్యపూర్వకంగా పొడిగించారు. దీంతో దద్దవాడ గ్రామ సమీక్ష జరగని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలపై ఎంపీ వైవీ తీవ్రంగా స్పందించారు. మంత్రి చర్య తనను, జిల్లా ప్రజలను కాకుండా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించినట్లుయిందన్నారు.
శనివారం జరిగిన పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎంపీ ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు దద్దవాడ సర్పంచి, ఎంపీటీసీలు, ముఖ్యులు వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి రాత్రి పది గంటల వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. తమ ప్రచారం కోసం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో కూడా ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నిలదీయడంతో వ్రతం చెడినా ఫలితం దక్కని విధంగా శిద్దా పరిస్థితి తయారైంది.
శిద్దా ... ఇదేమి బుద్ధి
Published Sun, Dec 28 2014 2:25 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement